పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : ద్వాదశ స్కంధం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

రచన

ఈ కవీంద్రు జన్మ మీశ్వరునకె తక్క
నొరుల కెప్డు చేతులొగ్గి యడుగ
దాఁడుబిడ్డ దేహ మమ్ముక తినునట్లు
కృతుల నమ్ముకొనుటె బ్రతుకు తెరువు

-వానమామలా వరదాచార్యులు

న కొలువున నుండ మని సర్వజ్ఞ భూపాలుడు అడుగగా పోతన్న గారు చెప్పిన సమాధానం. దీనితో కోపగించిన రాజు ఎలాగైనా కృతి అంకితం పొందాలని ఎంతో ప్రయత్నించాడు. కాని లాభము లేకపోయింది. తదనంతర కాలంలో భాగవత శిధిలభాగ పూరణ, పునరుద్ధరణలకు తగిన యత్నాలు ధన సహాయము సమకూర్చాడు. పోతన తెనిగించుట చేసి, దేవతార్చనతో నుంచి అర్చించెడి వాడు. వైకుంఠానికి పయన మగు సమయ మాసన్నం అవుతుండగా కొడుకు మల్లనకు సకల రహస్యార్థ సాధక మగు నీ మహాపురాణమును ముముక్షువులకే కాని ఐహికవాంఛా లోలు లగు పామరులకు బఠింప నర్హముగా దని తెలిపి, పదిలముగ కాపాడ మని చెప్పాడు. బహుకాలం గడచిన పిమ్మట, మల్లన తన సహాధ్యాయి, తండ్రికి శిష్యుడు నగు వెలిగందల నారయకు పైతృక గ్రంథ మని చూపి పదిలపర్చ మని చెప్పాడు. వారు తీసి చూడగా మిక్కలి జీర్ణమైన శ్రీమద్భాగవతం కనబడెను. రాజు సాయం సంపాదించి, వలసినవి పూర్ణించుట, లోపించిన చోట్ల నవీనముగ తను రచించి, మరికొందరిచే పూరింప జేసి సంపూర్ణం చేసాడు. ప్రచార మొనర్చుటకు పాటుపడ్డాడు. ఆ విధంగా పోతన భాగవతములో పంచమ, షష్ఠ స్కంధములకు గంగన, సింగయలు; ఏకాదశ, ద్వాదశ స్కంధములకు నారయ రచనలు చేరాయి. వీరిలో నారయ సాక్షాత్తు పోతన శిష్యుడగుటచే, స్కంధాంత గద్యములలో పోతన శిష్యుడ నని గర్వముగా చెప్పుకొన్నాడు.

ఏకాదశ ద్వాదశ స్కంధములు

నారయ కవివర్యుని రచన పోతనామాత్యుని యంత రసవత్తరము కాదు. 11, 12 స్కంధాలలోని విషయము మిక్కిలి దుర్గ్రాహ్యములు. అయినను పూర్తి చేసి పోతన సరసను చేరగలిగిన అదృష్టశాలి వెలిగందల నారయ. దీని పునరుద్ధరణలో అతను చేసిన శ్రమకు బహుమతి యిది అనవచ్చు. తన ఆంధ్రీకరణలో విశిష్ఠాధ్వైతానికి ప్రాధాన్య మిచ్చాడని అంటారు.

కాదశ స్కంధంలో యాదవ కులంలో ముసలం పుట్టడం, శ్రీకృష్ణుని వైకుంఠానికి మరలి రమ్మని బ్రహ్మాది దేవతలు వేడుట, కృష్ణు డుద్దవునకు పారమార్థం ఉపదేశించుట, యాదవుల మరణం, కృష్ణ బలరాముల నిర్యాణం మున్నగు విషయములు ఏకాదశ స్కంధంలో ఉన్నాయి. ఇతను అరుదైన సర్వలఘు సీస పద్యమును ఈ స్కంధంలో ప్రయోగించాడు. దీనిని సర్వలఘు సీసానికి ప్రామాణిక ఉదాహరణగా వ్యాకరణవేత్తలు ఉటంకిస్తారు. ద్రమిళు డనే ముని విదేహునికి ఆత్మయోగం వివరించి హరిని యిలా స్తుతించాడు

11-72-సర్వలఘు సీసం
నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ;
గగనచరనది జనిత! నిగమవినుత!
జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిర;
పరిమళిత నిజహృదయ! ధరణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ! ;
కటిఘటిత రుచిరతర కనకవసన!
భుజగరిపు వరగమన! రజతగిరిపతివినుత! ;
సతతజపరత! నియమసరణి చరిత!
తేటగీతి
తిమి కమఠ కిటి నృహరి ముదిత! బలి నిహి
త పద! పరశుధర! దశవదన విదళన!
మురదమన! కలికలుష సుముదపహరణ!
కరివరద! ముని నర సుర గరుడ వినుత!

ద్వాదశ స్కంధములో శుకుడు పరీక్షిత్తునకు చనిపోతున్నా ననే భయాన్ని వదలిపెట్టు. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. విష్ణుధ్యానము చెయ్యి. వైకుంఠవాసము దక్కుతుం దని చెప్పిన ఉత్పలమాల ప్రసిద్దికెక్కెను.

ఏను మృతుండ నౌదు నని యింత భయంబు మనంబులోపలన్
మానుము; సంభవంబు గల మానవకోట్లకుఁ జావు నిత్యమౌఁ;
గాన హరిం దలంపు; మికఁ గల్గదు జన్మము నీకు ధాత్రిపై;
మానవనాథ! పొందెదవు మాధవలోకనివాససౌఖ్యముల్.

రీక్షిత్తు తక్షక విషానికి గురై దివంగతు డగుట, జనమేజయుని సర్ప యాగము, మార్కండోపాఖ్యానము మొదలైన అంశములు ద్వాదశ స్కంధమున చేరినవి.

వృత్తాల వారీ పద్యాల లెక్క

విషయం = ఏకాదశ స్కంధం|| = ద్వాదశ స్కంధంపద్యగద్యలు = 128|| = 54తేటగీతి సీసంతో = 9|| = 2మొత్తం = 137|| = 56పద్యం ఛందోప్రక్రియ = ఏకాదశ స్కంధం|| = ద్వాదశ స్కంధంమొత్తం = 137|| = 56వచనం. = 47|| = 21కంద పద్యం. = 48|| = 19సీస పద్యం. = 9|| = 2తేటగీతి సీసంతో. = 9|| = 2మత్తేభం. = 2|| = 2చంపకమాల. = 2|| = 3ఉత్పలమాల. = 4|| = 1ఆటవెలది. = 2|| = తేటగీతి. = 10|| = 4మత్తకోకిల. = 1|| = గద్యం. = 1|| = 1మాలిని. = 1|| = 1సర్వలఘు సీసం. = 1|| =

కృతఙ్ఞతలు

భాగవత గణానాధ్యాయంలో భాగంగా యూనీకోడీకరించిన తెలుగు భాగవత సంకలనానికి ఆధారభూతమైన పుస్తకాలకు, రచయితలకు, ప్రచురణకర్తలకు, అంతర్జాలసంస్థలకు, జాలగూడులో పెట్టుటలో గాత్ర ప్రదానం చేసిన వేంకట కణాద, ప్రాచుర్యానికి తీసుకురాటంలో సలహా సహకారాలు అందించిన బండి శ్రీనివాస శర్మ, జాలగూడు నిర్వాహణలో ఉత్సాహంగా ముందుకొచ్చి నిలబడిన మోపూరు ఉమామహేశ్వరరావు గార్లకు, సహకరించిన ప్రోత్సాహించిన యితర మిత్రులకు, ఇతర వ్యక్తులకు, జాలగూడు మున్నగు వాటికి అమూల్య సహాయం అందించిన వారికి, అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -