పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : దశమ స్కంధం - ఉత్తర భాగం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

రచన

అమృతమహాంబురాసి తెలుగై మఱి భాగవతమ్మునై త్రిలిం
గమునకు డిగ్గెనేమొ యనఁగా హృదయమ్ముల నాడు నేడు నా
ట్యము లొనరించు పోతనమహాకవి ముద్దులపద్యముల్ శతా
బ్దము లయిపోవుగాక మఱవన్ తరమే రసికప్రజాళికిన్.

- దాశరథి

వును ఆధునిక కవులలో ఎన్నదగిన మన దాశరథి గారు అన్నట్లు పోతన భాగవతము విలువ ఎన్ని శతాబ్దాలైనా పెరుగుతుందే కాని తరగదు. శివుని ధ్యానించి, శ్రీరాముని కనుగొని, షష్ఠ్యంతాలలో శ్రీ కృష్ణునికి సమర్పితంబుగా హరిహరాధ్వైత సిద్ధాంతం చెప్పిన భాగవతం అజరామరం కాకపోవుట సంభావతీతం. అసలు భాగవతం అంటేనే కృష్ణ తత్వం అని కొందరి ప్రగాఢ విశ్వాసం. ముందరి స్కంధాలలో కృష్ణ కథలు ఉన్నా దశమస్కంధం మొత్తం ఆ నందనందనునికి చెందినదే. దశమ స్కంధానికి ఉపోద్ఘాతాలే ముందరి స్కంధాలన్నీ అని కొందరు అంటారు. కవికి స్వతంత్రత్వ లక్షణాలు సహజం అంటారు. సహజకవి పోతన భాగవతం తెనిగించుటలో ఆ పోకడలు చూపాడు అనవచ్చు. కొన్ని సందర్భాలలో సంక్షిప్తం చేసి, అనేక సందర్భాలలో వృద్ధి చేసి ఎంతో అభివృద్ధిని సాధించాడు. దశమ స్కంధం వ్యాసవిరచితంలో ఒకటే భాగం. కాని పోతన ప్రణీతంలో దాని విస్తృతి విస్తారతల రీత్యా రుక్మిణీ కల్యాణం వరకు పూర్వభాగం, పిమ్మటి కృష్ణకథలు ఉత్తరభాగంగా రెండు స్వతంత్ర భాగాలుగా అందించాడు. మొత్తం గ్రంథంలో మూడోవంతు ఇవే ఉన్నాయి (9014 పద్యగద్యలలో 3137 దశమ స్కంధంలోవే). రెంటిలోను ప్రథమ భాగం అత్యధిక ప్రజాదరణ పొందింది. పోతన శ్రీధరస్వామి శిష్యుడని ఓరుగల్లు ప్రాంతంలో ప్రతీతి. శ్రీధర వ్యాఖ్యానాన్ని అనుసరించే ఆంధ్రీకరించాడు అని పండితులు అంటారు. సంస్కృతంలో శ్రీధరీయం మున్నగు అనేక అద్భుత వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి. కాని మనకి పరభాషా పారవశ్యం ముందునుంచి ఉందేమో. పోతన భాగవతానికి రావలసినన్ని అధ్యయనాలు. వ్యాఖ్యానాలు రాలేదు. వచ్చిన వాటిలో చెప్పుకో దగ్గవి పందొమ్మిదో శతాబ్దపు శ్రీ పాలపర్తి నాగేశ్వర శాస్త్రులవారి శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమ స్కంధము. ఇరవయ్యో శతాబ్దపు జగత్ గురువులు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి శ్రీమగ్భాగవత ప్రకాశము. ఇది సప్తమ స్కంధదగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఏ కారణం అయితేనేం బాధపడే విషయం రెండు పాక్షికాలే భాగవత గ్రంథ దృష్టిలో. కాని రెండు అద్భుత విభిన్న పరిపూర్ణ వేదాంతార్థ విశ్లేషణా సంశోభితాలే.

దశమ స్కంధం – ఉత్తర భాగం

శ్రీకృష్ణ కధామృత మైన దశమస్కంధం ఒక స్వతంత్ర కావ్యం. తీసుకొచ్చి భాగవతంలో కలిపేసారు అని కొందరి అభిప్రాయం. తరచి చూస్తే ప్రబంధం అనదగ్గ సర్వలక్షణ సంశోభితంగాను అనిపిస్తుంది. అంతటి ఉత్కృష్ణమైనదీ దశమ స్కంధం. పౌఢ కృష్ణుని ప్రభావ ప్రవాహాలే ఈ ద్వితీయ భాగంలోని విషయం. రతీప్రద్యుమ్నం, శమంతక మణి వృత్తాంతం, నరకాసుర వధ, పారిజాతాపహరణం, ఉషాయనిరుద్ధం, కుచేలోపాఖ్యానం మున్నగు ఈ పూర్వభాగం లోని ఘట్టాలు అన్ని భక్తి, శృంగార, వీర రస ప్రపూర్ణాలు. పద్యాల విషయానికొస్తే అమృతగుళికలు లాంటివి అనేకం. ప్రద్యుమ్నుడు ఆ మన్మథుని అవతారం. మన్మథమన్మథుడు శ్రీకృష్ణుని కొడుకు. పెరిగి యౌవనుడైనాడు. పోతన గారి ప్రద్యుమ్నుడు చూసిన సుందరులు ఎప్పుడు ఇతనిని చేరదామా అని తహతహలాడే టంత అందంతో ఇలా విరాజిల్లుతు ఉన్నాడుట.

సుందర మగు తన రూపము
సుందరు లొకమాఱు దేఱి చూచినఁ జాలున్
సౌందర్య మేమి చెప్పను?
బొందెద మని డాయు బుద్ధిఁ బుట్టించు, నృపా!

శమంతక మణికై గుహ జొచ్చిన శ్రీకృష్ణునితో జాంబవంతుడు తలపడ్డాడు. వారు యిద్దరు ఒక్క మాంసం ముక్కకోసం పోరే డేగలలా పరమ భీకరంగా యిరవై ఎనిమిది రోజులు ఎడతెగకుండా పోరు సాగించారు.

పలలమునకుఁ బోరెడు డే
గల క్రియ శస్త్రములఁ దరులఁ గరముల విజయే
చ్ఛల నిరువదియెనిమిది దిన
ములు వోరిరి నగచరేంద్రముఖ్యుఁడు హరియున్.

నరకాసురునిపై యుద్ధానికి సత్యభామా సమేతుడై వెళ్ళాడు శ్రీకృష్ణుడు. సత్య విల్లందుకొని నరకాసురునితో యుద్ధం ఆరంభించింది. అప్పుడు ఆ అపరజాణ శత్రువుపై పౌరుష కోపాలతో ఒకపక్క, ప్రియపతిపై ప్రేమానురాగాలుతో ఒకపక్క ఒకే సమయంలో తన కడకంటి చూపులలో వీరం, శృంగారం ఒలికించింది.

పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.

పరమ ధనహీనుడు కుచేలుడు తెచ్చిన అటుకులు మూడు గుప్పిళ్ళు మూడు లోకాలకు సంపత్కరుడైన శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. మరో గుప్పెడు తీసుకో బోతుంటే లక్ష్మీదేవి అపరావతారమైన రుక్మిణీదేవి, ఇప్పటికే అనూన సంపదలు సౌకర్యాలు అందేయి. ఇక చాలు అంటు చెయ్యి పట్టుకొని వారించింది.

మురహరుఁడు పిడికెఁ డడుకులు
గర మొప్పఁగ నారగించి కౌతూహలియై
మఱియును బిడికెఁడు గొనఁ ద
త్కర మప్పుడు పట్టెఁ గమల కరకమలములన్.

ఇలా ఎన్నని ఇక్కడ ఎంచగలం. ఇలాంటి పద్యాల ప్రసాదం పంచిన పోతన మహత్వపూర్ణుడే. దీనికో దృష్టాంతం ప్రచారంలో ఉంది.

దృష్టాంతం

"అంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?"

న్న మహావాక్యం ఆదర్శంగా పెట్టుకొని పొలం దున్నుకు జీవించి తరించిన మహా కవిశేఖరుడు, "ఈ నవ పల్లవ కోమల కావ్యకన్యకును కూళల కివ్వను" అని నిలబడగలిగిన మహోన్నత ధీశాలి ఆత్మాభిమాని. సర్వజ్ఞ సింగభూపాలునికి ఆంధ్ర మహా భాగవతాన్ని అంకిత మిప్పించాలని పట్టుబట్టి కూర్చున్న పోతన బావగారు శ్రీనాథుడు పోతన శ్రీమతి నరసమాంబతో యీ గ్రంధరాజాన్ని రాజు కంకిత మివ్వకపోతే తన కూతురు శారదను మల్లన కివ్వను అన్నాడు. పోతనగారి పుత్రునికి ఆత్మాభిమానానికి లోటే ముంటుంది. మల్లన శారదను లాక్కొచ్చి "నీ కిచ్చవచ్చిన వారి కిచ్చుకో" అని శ్రీనాథుని వొడిలోకి తోసేశాడు. ఏమైతేనేం కొద్దిరోజులకే యిరుకుటుంబాలు సంతోషంగా యిద్దరికి వివాహం చేసారు. అటువంటి క్లిష్ట పరీక్షలు ఎదురైనా పోతన తన ధ్యేయం విడువలేదు

వృత్తాల వారీ పద్యాల లెక్క

విషయం = పూర్వ భాగం|| = ఉత్తర భాగంపద్యగద్యలు = 1792|| = 1343తేటగీతి సీసంతో = 69|| = 123ఆటవెలది సీసంతో = 85|| = 16మొత్తం = 1946|| = 1482పద్యం ఛందోప్రక్రియ = దశమ స్కంధం పూర్వ భాగం|| = దశమ స్కంధం ఉత్తర భాగంమొత్తం = 1942|| = 1482వచనం. = 530|| = 395కంద పద్యం. = 579|| = 369సీస పద్యం. = 154|| = 139తేటగీతి సీసంతో. = 69|| = 123మత్తేభం. = 137|| = 76చంపకమాల. = 34|| = 137ఉత్పలమాల. = 126|| = 82ఆటవెలది. = 84|| = 36తేటగీతి. = 7|| = 74శార్దూలం. = 114|| = 20ఆటవెలది సీసంతో. = 85|| = 16మత్తకోకిల. = 11|| = 4తరలం. = 6|| = గద్యం. = 1|| = 1మాలిని. = 1|| = 1ఇంద్ర వజ్రం. = 2|| = లయగ్రాహి. = || = 1ఉత్సాహం. = || = 2కవిరాజ విరాజితం. = || = 2లయ విభాతి. = 2|| = 1స్రగ్దర. = || = 2దండకం. = 1|| = మహాస్రగ్దర. =

కృతఙ్ఞతలు

భాగవత గణానాధ్యాయంలో భాగంగా యూనీకోడీకరించిన తెలుగు భాగవత సంకలనానికి ఆధారభూతమైన పుస్తకాలకు, రచయితలకు, ప్రచురణకర్తలకు, అంతర్జాలసంస్థలకు, సహకరించిన ప్రోత్సాహించిన హితులకు, స్నేహితులకు, మిత్రులకు, ఇతర వ్యక్తులకు, జాలగూడు మున్నగు వాటికి అమూల్య సహాయం అందించిన వారికి, గాత్రప్రదానాలు చేసిన గాయకులకు, అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -