పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : దశమ స్కంధం - పూర్వ భాగం.

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

రచన

అమృతమహాంబురాసి తెలుగై మఱి భాగవతమ్మునై త్రిలిం
గమునకు డిగ్గెనేమొ యనఁగా హృదయమ్ముల నాడు నేడు నా
ట్యము లొనరించు పోతనమహాకవి ముద్దులపద్యముల్ శతా
బ్దము లయిపోవుగాక మఱవన్ తరమే రసికప్రజాళికిన్.
-దాశరథి

వును ఆధునిక కవులలో ఎన్నదగిన మన దాశరథి గారు అన్నట్లు పోతన భాగవతము విలువ ఎన్ని శతాబ్దాలైనా పెరుగుతుందే కాని తరగదు. శివుని ధ్యానించి, శ్రీరాముని కనుగొని, షష్ఠ్యంతాలలో శ్రీ కృష్ణునికి సమర్పితంబుగా హరిహరాధ్వైత సిద్ధాంతం చెప్పిన భాగవతం అజరామరం కాకపోవుట సంభావతీతం. అసలు భాగవతం అంటేనే కృష్ణ తత్వం అని కొందరి ప్రగాఢ విశ్వాసం. ముందరి స్కంధాలలో కృష్ణ కథలు ఉన్నా దశమస్కంధం మొత్తం ఆ నందనందనునికి చెందినదే. దశమ స్కంధానికి ఉపోద్ఘాతాలే ముందరి స్కంధాలన్నీ అని కొందరు అంటారు. కవికి స్వతంత్రత్వ లక్షణాలు సహజం అంటారు. సహజకవి పోతన భాగవతం తెనుగించుటలో ఆ పోకడలు చూపాడు అనవచ్చు. కొన్ని సందర్భాలలో సంక్షిప్తం చేసి, అనేక సందర్భాలలో వృద్ధి చేసి ఎంతో అభివృద్ధిని సాధించాడు. దశమ స్కంధం వ్యాసవిరచితంలో ఒకటే భాగం. కాని పోతన ప్రణీతంలో దాని విస్తృతి విస్తారతల రీత్యా రుక్మిణీ కల్యాణం వరకు పూర్వభాగం, పిమ్మటి కృష్ణకథలు ఉత్తరభాగంగా రెండు స్వతంత్ర భాగాలుగా అందించాడు. మొత్తం గ్రంధంలో మూడోవంతు ఇవే ఉన్నాయి (9014 పద్యగద్యలలో 3137 దశమ స్కంధంలోవే). రెంటిలోను ప్రథమ భాగం అత్యధిక ప్రజాదరణ పొందింది. పోతన శ్రీధరస్వామి శిష్యుడని ఓరుగల్లు ప్రాంతంలో ప్రతీతి. శ్రీధర వ్యాఖ్యానాన్ని అనుసరించే ఆంధ్రీకరించాడు అని పండితులు అంటారు. సంస్కృతంలో శ్రీధరీయం మున్నగు అనేక అద్భుత వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి. కాని మనకి పరభాషా పారవశ్యం ముందునుంచి ఉందేమో. పోతన భాగవతానికి రావలసినన్ని అధ్యయనాలు. వ్యాఖ్యానాలు రాలేదు. వచ్చిన వాటిలో చెప్పుకో దగ్గవి పందొమ్మిదో శతాబ్దపు శ్రీ పాలపర్తి నాగేశ్వర శాస్త్రులవారి శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమ స్కంధము. ఇరవయ్యో శతాబ్దపు జగత్ గురువులు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి శ్రీమగ్భాగవత ప్రకాశము. ఇది సప్తమ స్కంధదగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఏ కారణం అయితేనేం బాధపడే విషయం రెండు పాక్షికాలే భాగవత గ్రంథ దృష్టిలో. కాని రెండు అద్భుత విభిన్న పరిపూర్ణ వేదాంతార్థ విశ్లేషణా సంశోభితాలే.

దశమ స్కంధం - పూర్వభాగం

శ్రీకృష్ణ కథామృత మైన దశమస్కంధం ఒక స్వతంత్ర కావ్యం. తీసుకొచ్చి భాగవతంలో కలిపేసారు అని కొందరి అభిప్రాయం. తరచి చూస్తే ప్రబంధం అనదగ్గ సర్వలక్షణ సంశోభితంగాను అనిపిస్తుంది. అంతటి ఉత్కృష్ణమైనదీ దశమ స్కంధం. శైశవలీలలు, వెన్నదొంగ ముచ్చట్లు, చల్దులు గుడుచుట, పోతనాదుల సంహారాలు, కాళియ మర్థనం, గోవర్థన గిరి ధారణ, రాసక్రీడావర్ణన, రుక్మిణీకల్యాణం మున్నగు ఈ స్కంధభాగం పూర్వభాగం లోని ఘట్టాలు అన్ని సుధలు స్రవించే, చెవులూరించే, భక్తిముక్తి ప్రయుక్తాలే, బహుళార్థ సాధకాలే, బహుశాస్త్ర సంశోభితాలే. పద్యాల అమృతగుళికల అబ్బో ఎన్నెన్నో.

శ్రీకంఠచాప ఖండన!
పాకారిప్రముఖ వినుత భండన! విలస
త్కాకుత్స్థవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!

ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభులాన మంజులవాణీ!

వీరెవ్వరు? శ్రీకృష్ణులు
గారా? యెన్నడును వెన్నఁ గానరఁట కదా!
చోరత్వం బించుకయును
నేర రఁట! ధరిత్రి నిట్టి నియతులు గలరే?

కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్

తీపుగల కజ్జ మన్యుఁడు
కోపింపఁగ నొడిసి పుచ్చుకొని త్రోపాడం
బైపడి యది గొని యొక్కఁడు
క్రేపులలో నిట్టునట్టుఁ గికురించు నృపా!

భ్రమరా! దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
ప్రమదాళీకుచకుంకుమాంకిత లసత్ప్రాణేశదామప్రసూ
న మరందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁగా
క మమున్నేఁపుచుఁ బౌరకాంతల శుభాగారంబులన్నిత్యమున్.

నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!

లా ఎన్నని ఇక్కడ ఎంచగలం. ఇలాంటి పద్యాల ప్రసాదం పంచిన పోతన మహత్వపూర్ణుడే. దీనికో దృష్టాంతం ప్రచారంలో ఉంది.

దృష్టాంతం

ర్ణాటప్రభువు ఒకమారు పోతనను నిర్భంధించి యైనా సరే అంకింతం అందుకోవా లని పట్టుబట్టి, పరిచారకులను పోతనకడకు పంపాడట. పోతరాజు ఇంటివద్ద భీకరమైన అడవిపందిని చూసి వెరచి వెనుదిరిగారట. ఆ రాజు పందిని చూసి పారిపోయి వచ్చిన పిరికి పందల్లారా అని పరిహరించి, తనే స్వయంగా సైనికులతో వెళ్ళాడు. సింహంలా మీదకి వస్తున్న వరాహాన్ని చూసి చెల్లాచెదురయ్యారుట. ఈ అలికిడికి పోతన బయటకు రాగా అడవిపంది అదృశ్యమైందట. కర్ణాటరాజు కవిరాజు కాళ్ళ మీద పడ్డాడట.

వృత్తాల వారీ పద్యాల లెక్క - దశమ స్కంధం

విషయం = పూర్వ భాగం|| = ఉత్తర భాగం
పద్యగద్యలు = 1792|| = 1343
తేటగీతి సీసంతో = 69|| = 123
ఆటవెలది సీసంతో = 85|| = 16
మొత్తం = 1946|| = 1482
పద్యం ఛందోప్రక్రియ = దశమ స్కంధం పూర్వ భాగం|| = దశమ స్కంధం ఉత్తర భాగం
మొత్తం = 1942|| = 1482
వచనం. = 530|| = 395
కంద పద్యం. = 579|| = 369
సీస పద్యం. = 154|| = 139
తేటగీతి సీసంతో. = 69|| = 123
మత్తేభం. = 137|| = 76
చంపకమాల. = 34|| = 137
ఉత్పలమాల. = 126|| = 82
ఆటవెలది. = 84|| = 36
తేటగీతి. = 7|| = 74
శార్దూలం. = 114|| = 20
ఆటవెలది సీసంతో. = 85|| = 16
మత్తకోకిల. = 11|| = 4
తరలం. = 6|| =
గద్యం. = 1|| = 1
మాలిని. = 1|| = 1
ఇంద్ర వజ్రం. = 2|| =
లయగ్రాహి. = || = 1
ఉత్సాహం. = || = 2
కవిరాజ విరాజితం. = || = 2
లయ విభాతి. = 2|| = 1
స్రగ్దర. = || = 2
దండకం. = 1|| =
మహాస్రగ్దర. = || = 1
ఉంపేంద్ర వజ్రం. = 1|| =
పంచచామరం. = 1|| =
మానిని. = 1|| =

కృతఙ్ఞతలు

భాగవత గణానాధ్యాయంలో భాగంగా యూనీకోడీకరించిన తెలుగు భాగవత సంకలనానికి ఆధారభూతమైన పుస్తకాలకు, రచయితలకు, ప్రచురణకర్తలకు, అంతర్జాలసంస్థలకు, సహకరించిన ప్రోత్సాహించిన మిత్రులకు, ఇతర వ్యక్తులకు, జాలగూడు మున్నగు వాటికి అమూల్య సహాయం అందించిన వారికి, గాత్రప్రదానాలు చేసిన గాయకులకు, అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -