పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : చతుర్థ స్కంధం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

రచన

క్తి ప్రపత్తులకు మారుపేరై, నిరీహుడై నిస్సంగుడై కావ్యరచన సాగించిన మహనీయుడు మన బమ్మెర పోతన్న. వీరి భాగవత రచనా శైలి పండిత పామరు లందరు మెచ్చేలా ఉంటుంది. ‘పోతన్న భాగవతం ఎప్పుడు చూచినా – “అప్పుడే తీసిన వెన్న. ” అందుకే దాన్ని వదలి పోలేడు కృష్ణన్న’ అని జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు (కరుణశ్రీ) అన్నారు. మరి తెలుగు వారికి కృష్ణుడు అంటే యిష్టం. అందుకే పోతన్న భాగవతాన్ని వదిలిపెట్టరు. ఏ పండితు డైనా ఏ ప్రవచనం చెప్పాలన్న పోతన్న భాగవత పద్యం తలచుకోకుండా ఉండలేరు. అట్టి బహుళ ప్రసిద్ధ మైనది యిది. ‘ఒకే గ్రంథమున కథా సూత్రమున నిమిడి యుండియు, ప్రతి పద్యమునకు నొక ముక్తము వలె ప్రత్యేక పఠనీయముగ నుండునట్లు రచింపగల యత్యంతలోకోత్తర కవితా శక్తి పోతన్న కున్నట్లు మరి యే తెలుగు కవికి లేదు.’ అని ఆచార్య నిడదవోలు వేంకటరావు ఉన్న విషయం చెప్పినట్లు. కావలసిన పద్యాన్ని విడిగా చదువుకోవచ్చు బలే రత్నం దొరికింది అని సంతోషించొచ్చు. నచ్చిన ఘట్టం విడిగా చదువుకోవచ్చు ఆహా అమృతం ఆస్వాదించాం అనుకోవచ్చు. తరచి చూస్తే అవి స్వతంత్రమైనవిగా అనిపిస్తాయి. ఇప్పటి ఆంగ్లభాషలో చెప్పాలంటే ‘హైలీ మాడ్యులర్ స్ట్రక్చర్’ అనటానికి ఏమాత్రం అనుమానం లేదు.

బమ్మెర పోతన

త్యమా కాదా అన్నది పక్కనపెట్టి వారి జీవితంలో జరిగినది అని జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన ఘట్టం ఒకటి స్మరిద్దాం. కవిసార్వభౌములు శ్రీనాథుల వారి పుత్రిక శారదను పోతన్న కొడుకు మల్లనకు ఇవ్వాలన్న ఆలోచన యున్నది. ఆ సమయంలో పోతరాజు తను రాసిన పద్యం

సిరికిం జెప్పఁడు; శంఖచక్రయుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

చదివి వినిపించాడు. కవిసార్వభౌముడు అంతటి విష్ణువు ఆయుధాలు లేకుండా వెళ్ళాడా అని ఆక్షేపించాడు. యిద్దరు భోజనాలు చేస్తున్నారు. ఇంతలో రాయి నూతిలో వేసి అతని బిడ్డ నూతిలో పడిందని కేకలు వేయగా. ఖంగారు పడి చేయి కడుగుకొనుట కూడ మరచి పరుగెట్టు కొచ్చాడు. నిజం తెలిసి ఆ పద్యంలోని సహజత్వాన్ని అంగీకరించి పొగిడాడు.

చతుర్థ స్కంధము

ఇంతటి సహజ భక్తితత్పరుడు రాసిన భాగవత రచనలోని చతుర్థ స్కంధలోని చక్కటి రత్నాలు ఉన్నాయి. మనువుల చరిత్రలు, దక్షయజ్ఞం, ధృవోపాఖ్యానం ఈ స్కంధంలో చెప్పుకోదగ్గవి. అంతేకాదు చెట్లను కాపాడండి అంటు ఏదో కొత్త విషయంలా మనం చెప్పుకొనే పర్యావరణానికి వృక్షాల ఆవశ్యకతను చెప్పే ప్రచేతస్సుల వృత్తాంతం కూడ ఈ స్కంధంలోదే.

న పోతనగారికి అలతిపొలతి పదాలతో క్రీడించటం వెన్నతో పెట్టిన విద్య. మామ దక్షప్రజాపతి అల్లుడు మహేశ్వరుని మీద క్రోధం పెంచుకున్నాడు. ఎంతైనా మహాయజ్ఞికుడు, తపస్వి, భక్తుడు కదా ఎంత కోపంలో ఉన్నా, ఎంత కావాలన్నా బయటకు వచ్చే మాటలపై ఆప్రభావం ఉండకుండా పోదు. “అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన; హీనుఁడు మర్యాదలేని వాఁడు ” అని శంకరుని ఎలా దూషిస్తున్నా పోతనగారి చమత్కారంతో వచ్చింది నిందాస్తుతే మరి. ఇదే ఘట్టంలో శివద్వేషంతో దక్షుడు నిరీశ్వర యాగం తలపెట్టాడు. పుత్రిక సతీదేవి తన తండ్రి యజ్ఞానికి వెళ్ళడానికి శంకరుని వేడుటలో పోతన్న కంద అక్షరాలు ఎన్ని వయ్యారాలు పోతున్నాయో చూడండి.

సతి దన పతి యగు నా పశు
పతిఁ జూచి సముత్సుకతను భాషించె; ప్రజా
పతి మీ మామ మఖము సు
వ్రతమతి నొనరించుచున్న వాఁడఁట వింటే;

వును అవి బమ్మెర పోతన గారి అక్షరాలు కదా. అవి విన్యాసాలు చేయటమే కాదు, పెద్దసామ్రాజ్యాన్ని మెనేజ్ చేస్తున్న పృథుమహారాజుకి భూదేవి చేత ఎంత చక్కటి పాఠాలు చెప్పించాయో రుచి చూద్దాం.

ధర విరులు గందకుండఁగ
సరసగతిం బూవుఁదేనెఁ జవిగొను నిందిం
దిరవిభు కైవడి బుధుఁడగు
పురుషుఁడు సారాంశ మాత్మఁబూని గ్రహించున్.

క్రమమున నిటు పృథ్వాదులు
దమతమ కామితము లనఁగఁ దగు భిన్నక్షీ
రము దోహన వత్సక భే
దమునం దగఁ బిదికి; రంత ధరణీధవుఁడున్.

తెనుగు గుణమైనవారికి, సంస్కృతం గుణమైనవారికి, రెండు గుణమైనవారికి అందరికి నచ్చేలా చెప్పేవాడు కదా. ప్రచేతస్సుల నోట పలికించిన సంస్కృతపదభూయిష్ఠ స్తుతి.

తోయరుహోదరాయ భవదుఃఖహరాయ నమో నమః పరే
శాయ సరోజకేసర పిశఙ్గ వినిర్మల దివ్య భర్మ వ
స్త్రాయ పయోజ సన్నిభ పదాయ సరోరుహ మాలికాయ కృ
ష్ణాయ పరాపరాయ సుగుణాయ సురారిహరాయ వేధసే.

వృత్తాల వారీ పద్యాల లెక్క

పద్యగద్యలు = 9014 +తేసీతో 175 మొత్తం = 1152

పద్యం ఛందోప్రక్రియ = చతుర్థ స్కంధంమొత్తం = 1152వచనం. = 315కంద పద్యం. = 282సీస పద్యం. = 175తేటగీతి సీసంతో. = 175మత్తేభం. = 33చంపకమాల. = 87ఉత్పలమాల. = 19ఆటవెలది. = 7తేటగీతి. = 52శార్దూలం. = 1మత్తకోకిల. = 1తరలం. = 2గద్యం. = 1మాలిని. = 1కవిరాజ విరాజితం. = 1


విశిష్ఠ వృత్తం కవిరాజవిరాజితము వేనుని చరిత్ర సందర్భంలో ప్రయోగించ బడింది.

అరయఁగ వైన్యుని దక్షిణహస్తము నందు రమారమణీసుమనో
హరలలితాయుధచిహ్నము లంఘ్రుల యందు సమగ్రహలాంకుశభా
స్వర కులిశధ్వజ చాప సరోరుహ శంఖ విరాజిత రేఖలు వి
స్ఫురగతి నొప్పఁ బితామహముఖ్యులు చూచి సవిస్మయులైరి తగన్.

ఇంత చక్కటి ప్రణీతం అందించిన మన పోతన్న గారికి చేద్దాం వందన శతాలు.

సంకలన కర్త

లపల్లి వంశంలో తల్లి వెంకటరత్నంగారు తండ్రి అచ్యుత రామయ్య గారు లకు కీ.శ. 1949లో జన్మించాను. నన్ను సాంబశివరావు అంటారు. ఎలక్ట్రికలు ఇంజనీరుగా ఎమ్.ఇ.ఎస్., రాష్ట్ర విద్యుత్ సంస్థలలో పనిచేసాను. 2007లో పదవీవిరమణానంతరం ఈ భాగవత కార్యక్రమం, గణనాధ్యాయం అని భావగ్రహణం (conceptualisation) చేసికొని, ఆ ప్రయత్నంలో భాగంగా ఈ తెలుగు భాగవతం యూనీకోడీకరించాను.

కృతఙ్ఞతలు

కృషికి ఉపయోగపడిన వివిధ పుస్తకముల రచయితలకు, ప్రచురణకర్తలకు, సహకరించిన ప్రోత్సాహించిన మిత్రులు, ఇతర వ్యక్తులు, అంతర్జాల సంస్థలకు. మా తెలుగుభాగవతం అంతర్జాల జాలగూడు ఆదులను నిర్మించుట నిర్వహించుట, గాత్ర ప్రదానాదులకు తమ అమూల్య సమయాన్ని కేటాయించిన వారికి, అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -