పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : అష్టమ స్కంధం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

రచన

మ్మెర పోతన వ్రాసిన శ్రీ మహాభాగవతం “తెలుగువారి దైనందిన జీవితంలో పెనవేసుకుపోయిన కావ్యం”. అని ఇరివెంటి కృష్ణమూర్తి గారు చక్కగా వెల్లడించారు. కరుణశ్రీ గారి మాటలలో చెప్పాలంటే మనకు పోతన్నగారి భాగవతం లభించటం మన జన్మజన్మల పుణ్యవిశేషం.

గుడులు కట్టించె కంచర్ల గోపరాజు
రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు
పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు
రాజులీ మువ్వురును భక్తిరాజ్యమునకు

అన్నట్లు గోపన్న బండరాళ్ళతో గుళ్ళు కట్టించాడు; త్యాగరాజు రాగాల గుళ్ళు కట్టించాడు; పోతన తెలుగువారి గుండెలలో కృష్ణుడికి గుళ్ళు కట్టించాడు.

హజకవి, ప్రజాకవి పోతన గారు భాగవతంలో తత్వాన్ని నవరసపరిపూర్ణం చేసి అందించాడు. హైందవ తత్వంలో అనేకత్వంలో ఏకత్వం, ఏకత్వంలో అనేకత్వం నిండుగా ఉన్నదే. ఈ భాగవత తత్వానికి హృదయం వంటి అష్టమ స్కంధం అనే ఏకత్వంలో అత్యధికంగా తెలుగు వారి గుండెలలో ఆప్యాయంగా దాచుకున్న అనేక ఘట్టాలు గజేంద్ర మోక్షం, సముద్ర మధనం, వామనావతారం, త్రివిక్రమా వతారం, మత్యావతార అందంగా అమర్చబడ్డాయి. మధుర నాద పరిపూర్ణమైన ఛంధస్సుతో రమణీయ పదాలు కూర్చిన పద్యం అనే ఏకత్వంలో భావాలు అనేకం స్పురింపజేసారు కవితాబ్రహ్మ పోతన.

అష్టమ స్కంధం

నీరాట వనాటములకు
బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.

చమత్కార పద్యంతో ఆరంభమైన గజేంద్రమోక్ష మనే అమృతాటవిలో ఎంత ఆస్వాదించినా దాహం తీరదు. రుచిచూడని వారుండరు తెలుగు దేశంలో.

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణముల పాలం
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ' డభ్రగపతిం బన్నింపఁ' డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

పాల సముద్రం చిలికినట్లు పదాలను చిలికి వెన్నదీసి ఆరగించ మని అందించిన సముద్రమధన ఘట్టలోని రెండు సుధలు రుచికి మాత్రమే.

విడు విడుఁ డని ఫణి పలుకఁగఁ
గడుభరమున మొదలఁ గుదురు గలుగమి గెడఁవై
బుడబుడ రవమున నఖిలము
వడవడ వడఁకఁగ మహాద్రి వనధి మునింగెన్.

మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో?

క్తిరసావిష్కరణలో, కవితా మాధుర్యంలో వితరణశీలి బలిచక్రవర్తి చరిత్ర, వామనావతార ఘట్టాలు చిన్నవి అనలేము. ఎన్నెన్నో తేనెలూరు తేట తేట పద్యాలు. ఉదాహరణగా రెండు పద్యాలు:

వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

ప్రజాకవి జాతీయాలతో మధురమైన మత్స్యావతార ఘట్టంలోని ఒక పద్యం.

ఇంగలముతోడి సంగతి
బంగారము వన్నె గలుగు భంగిని ద్వత్సే
వాంగీకృతుల యఘంబులు
భంగంబులఁ బొందు ముక్తి ప్రాపించు హరీ!

ధురాతి మధురం మహామహితాత్మక మైన యీ అష్టమ స్కంధంలో పోతన కవితా పటుత్వం త్రివిక్రమ రూపం ధరించింది అనటం అతిశయోక్తి కాదు. ఈ పరమాద్భుత స్కంధంలో 14 ఛందో ప్రక్రియలుతో ప్రయోగించిన 745 పద్యగద్యల వ్యాప్తి గ్రహింతము.

వృత్తాల వారీ పద్యాల లెక్క

పద్యగద్యలు = 745 +తేసీతో =52 +ఆసీతో =41; మొత్తం = 838

పద్యం ఛందోప్రక్రియ = అష్టమ స్కంధంమొత్తం = 838వచనం. = 236కంద పద్యం. = 217సీస పద్యం. = 93తేటగీతి సీసంతో. = 52మత్తేభం. = 70చంపకమాల. = 5ఉత్పలమాల. = 9ఆటవెలది. = 67తేటగీతి. = 7శార్దూలం. = 33మత్తకోకిల. = 6ఆటవెలది సీసంతో. = 41గద్యం. = 1మాలిని. = 1

సంకలన కర్త

తూర్పు గోదావరి జిల్లా, ఊలపల్లి గ్రామస్థులు చిట్టిరాజుగారి కుమారుడు అచ్యుతరామయ్యగారు మఱియు విశాఖపట్నం జిల్లా శ్రీరామపురం గ్రామస్థులు సాంబశివ రావిగారి కుమార్తె వేంకట రత్నంగారు దంపతులు బహు సాత్వికులు ఉన్నత సంస్కారులు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు లక్ష్మీ నారాయణ దేవ్ మఱియు సాంబశివ రావు, ఇద్దరు కూతుళ్లు శేష కుమారి, లక్ష్మి. సదరు సాంబశివ రావుని తల్లిదండ్రులు, అన్నగారు ఎంతో గారాబంగా పెంచారు. ఆటపాటలలోనే కాదు చదువులలో కూడా ముందుండే అతనిని, అనుగ్రహించి రాయవరం గ్రామస్థులు పూజారి తాతగారు పురాణ, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం పరిచయం చేసారు. కాలక్రమాన ఇవటూరి సూర్యభాస్కర రావుగారు, పోతాప్రగడ వారి ఆడబడుచు సూర్యకాంతంగారు దంపతుల పుత్రికను వివాహం చేసుకున్నారు. సాంబశివరావు దంపతులకు ఫణి కిరణ్, భాస్కర కిరణ్ అనే ఉత్తములు కలిగారు. ఈయన వృత్తిరీత్యా విద్యుత్తు ఇంజనీరుగా క్రీ.శ. 2007లో పదవీవిరమణ చేసాక, భాగవత గణనాధ్యాయం చేపట్టారు. గణనాధ్యాయంలో భాగంగా ఈ తెలుగుభాగవతం.ఆర్గ్ నిర్మాణం చేసి అంతర్జాలంలో అందిస్తున్నారు.

కృతఙ్ఞతలు

భాగవత గణానాధ్యాయంలో భాగంగా యూనీకోడీకరించిన తెలుగు భాగవత సంకలనానికి ఆధారభూతమైన పుస్తకములకు, రచయితలకు, ప్రచురణకర్తలకు, అంతర్జాల సంస్థలకు, సహకరించిన ప్రోత్సాహించిన మిత్రులకు, ఇతర వ్యక్తులకు, జాలగూడు మున్నగు వాటికి అమూల్య సహాయం అందించిన వారికి, అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -