పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : తెలుగు భాగవత వైశిష్యం

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


తెలుగు భాగవత వైశిష్ఠ్యం
(1)తెలుగు భాగవతం గొప్పదనాలు తలచుకుందాం, చర్చించుకుందాం రండి.. . . పోతన భాగవతం ఉత్తి సాహితీ గ్రంథం మాత్రమేనా? ఉత్తి భక్తి కథల పుస్తకం మాత్రమేనా? భాగవత గణనాధ్యాయి వీటిన అంగీకరించ లేడు. “తనంతట తనే ఓ మహా ప్రపంచం” అని పండితోత్తములు ఉత్తినే అన్నారా? కాదు. దీనిని, మనం అందరం బాల్యాది అవస్థలు అన్నిటి యందు అధ్యయనం చేయాలి. ఆయా స్థాయిలను అనుసరించి, మరల మరల చదువుకుని అధ్యయనం చేయవలసిన మహా విశిష్ఠ గ్రంధం ఇది. లెక్కలేనన్ని బహు ముఖ పరిశోధనలు చేయటానికి అవకాశం, అవసరం ఉన్న గ్రంధం. అందుకే దీనిని “ఇహపర ప్రయోజనాలు” కలది అని, “ఇది ఒక మహా ప్రపంచం” అని విజ్ఞులు అంటారు; “బ్రహ్మాదులైనా వర్ణించలేనిది” అంటారు. దాని భావం ఇది బహుముఖ అధ్యయనం చేసి, తరచి తరచి, తరించదగ్గది అని. లోతుగా చూడాలంటే ఇప్పటి భాషలో తలచుకుందాం extraordinary memory capabilities, unlimited conceptualisation ఉన్నవాళ్ళకు కూడా hard challenge ఇస్తుంది. అతి సామాన్యులకు కూడా ఆనందంగా ఆస్వాదించేంత సున్నితంగానూ ఉంటుంది. అంతే కాదు తరతరానికి నవతరం మంచి చురుకైన అవగాహన ద్విగుణీకృతంగా పెరుగుతూ వస్తున్న ఈ తరుణంలో. గణని (కంప్యూటరు), అంతర్జాలాది (ఇంటర్ నెట్) వంటి బహుముఖ పరికరాలు అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలో. . ఎంతో విస్తారమైన, విస్తృతమైన విషయ సంపత్తి గల మన ప్రామాణిక గ్రంథాల అధ్యయనం చేపట్టకపోతే, రాబోయే తరాల జ్ఞానతృష్టను తృప్తిపరచ లేము. . నవతరాల జ్ఞానతృష్ణ తృప్తిపడకపోవడం జరిగితే యువతరాలు పెడదారిపట్టే ప్రమాదాలు మరీ పేట్రేగిపోతాయి. అందుచేత వచ్చే వేల సంవత్సారల వరకు కూడా మన గ్రంథాల పరిశోధన కొనసాగుతూ ఉండాల్సిందే. ఈ సందర్బంలో ఒక విషయం చెప్తాను వినండి, పరిశోధనలకు బహు అనుకూలమైన యూనీకోడు లిపిలో, దత్తై దస్త్రాలుగా (డేటా ఫైల్సుగా) కూడ సమకూర్చి, ఒక లండనులో ఉండే రచయిత, సాంకేతిక నిపుణురాలు అన్నట్లు “reference+” గా సిద్ధంగా ఉంచాము మన పోతనగారి తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడు (వెబ్ పోర్టలు) యందు.
కనుక, భగవత్సరూపుల్లారా! మన తెలుగుల పుణ్య పేటి పోతన. మన బమ్మెర పోతనామాత్యుల. వారు ప్రజాకవి, విప్లవ కవి, జాతీయ మహాకవి. వారిచే ప్రణీతమైన తెలుగు భాగవతం గొప్పదనాలు తలచుకుందాం, చర్చించుకుందాం రండి. అమృతం కంటే రుచికరంగా ఉంటూనే, లోతులు చూడాలంటే ఎంతైనా లోతులు చూపిస్తా అనే ఈ గ్రంథం రుచి ఏమిటో చూద్దాం.

(2)అనువైన పరికరం కళ్ళబడితే, మనం కూడ తెచ్చుకుంటాం కదా; అలాగే సంస్కృతం నుంచి భాగవత పురాణాన్ని తెలుగులోకి తెచ్చుకున్నాం మరి.
దేనికైనా మూలం ఎంత గొప్పదైతే వృక్షం అంత గొప్పది కదండి. మన తెలుగు భాగవతాన్ని గురించి మా పోతన్న గారు చెప్పిన సత్యం చూడండి. ఇది కల్పవృక్షం లాంటి గొప్ప గ్రంధం అని; వ్యాస మూలం అని అన్నారు.

లితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం;
జుతా శోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో;
జ్జ్వవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై;
వెయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై”.

[బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించే గ్రంథం. ఇది ధృవీకరించడానికి రెంటి జత లక్షణాలను, ఏక పదప్రయోగాలతో చెప్పిన ఈ చమత్కృతి చూడండి. అది ఎలాగంటే, కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది;కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది;కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది;కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది.కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది;కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది;కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది;కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్చమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది;కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది;కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.]
అష్టాదశ పురాణాలు, భాగవతాది రచించిన మహర్షి వ్యాసభగవానుల వారు మూల కవి. అంతటి వారు, వాటి అన్నిటి పిమ్మట ఎత్తుకున్నది కనుక ఎంతో ఉన్నతంగా ఉంటుంది కదా. ఇది కల్పవృక్షంలా ఇహపరాలు రెండు ప్రయోజనాలు ప్రసాదించే, సకల శ్రేయస్సులు అందించే మహా మంత్ర రాజమే మరి. ప్రతి ఘట్టం ప్రభావవంత మైన మంత్రమే. ఉదాహరణకు రుక్మిణీ కల్యాణం ‘కల్యాణం శీఘ్రంగా కావడానికి’ ప్రయోగించటం అనాదిగా ఉన్నదే. ఈ తెలుగు కల్పవృక్షానికి మూలం, మన పోతన్న గారు. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఏ జపాను వాడో చక్కటి కార్టూను చిత్రం పెడితే, మన భాషలోకి తెచ్చుకుంటాం కదా; మన మిత్రుల వద్ద మంచి చరవాణి కనిపిస్తే, మనం కూడా తెచ్చుకుంటాం కదా; ఏదైనా అనువైన పరికరం కళ్ళబడితే, మనం కూడ తెచ్చుకుంటాం కదా; అలాగే సంస్కృతం నుంచి భాగవత పురాణాన్ని తెలుగులోకి తెచ్చుకున్నాం మరి. అవును, గొప్ప గ్రంథం దొరికితే మన మాతృభాషలోకి తెచ్చుకోవాలి, మనం సాహితీ సంపద పెంచుకోవాలి. అలా సంస్కృతం నుండి దేశ భాషలలోకి తెచ్చుకున్న మహా భాగవతాలలో ప్రప్రథమమైనది మనదే. దీనికన్న సమగ్రంగా ఈనాటి వరకూ భాగవత పురాణం ఏ భాషలోకి రాలేదు.

(3)తెలుగుల పుణ్యపేటి పరమ భాగవతుడు పంచదారలో అద్దిన వర ప్రసాదంగా. . పోతన పంచిన ఊరగాయ ముక్క ఇది.
కరుణశ్రీ గారు “పంచదారలో అద్దితివేమొ గంటము మహాకవిశేఖర!” అన్నారంటే ఉత్తినే అనలేదు. అలతిపొలతి పదాలతో తెలుగు వచ్చీరానివారినైనా అలరించగల వందనీయడు. మహా పండితుల నైనా అలాగే పడవేసే మహత్వ కవిత్వ సంపదలు గల మహానుభావుడు. కావాలంటే చూడండి.

“పలికెడిది భాగవతమట;
లికించెడివాడు రామభద్రుడట నే;
లికిన భవహర మగు నట;
లికెద, వేరొండు గాథ లుకగ నేలా”

[వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను.]
పద్యమే తీసుకోండి. చెప్పించేదీ. చెప్పేది రాముడే. దీనిని చెప్పుకుంటే మోక్షం కూడా దక్కుతుంది అంటున్నాడు. ఇంత చిన్న మాటలలో అనంత భాగవత భక్తి ప్రపత్తుల ప్రధాన సూత్రం అందిం చేసాడు. అందుకే ఎంతటి మహా పండితులైనా దీనిని మాటిమాటికీ తలచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే దీని సారం ఆస్వాదించిన కొద్దీ రుచి పెరుగుతూనే ఉంటుంది, నల్లనయ్య చేతిలోని ఊరగాయ ముక్కలాగ. ఈ కందపద్యం అందానికి దాసోహమవని ఛందోప్రియులు ఉండరు అంటే ఉత్కర్ష కాదు. ఇందులోని ‘పలి’ ‘పలి’ . . అంటూ పలవరిస్తూ అలంకారాలు వేసిన తీరు అమోఘం. “ఇతర విషయాలు నాకెందుకు” అనే గట్టిదనం కూడా ఉందండోయి. అదే భాగవత తత్వం జీవన విధానం. కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యన్నారాయణ అంతటి వారు “అచ్చమైన యమృత మమరులు త్రావినా, రోయి దాని కే నసూయ పడను, పరమ భక్త వరుడు బమ్మెర పోతన, భాగవ దమృతంబు పంచె గాన.” అన్నారు. అవును ఇది పోతనామాత్యుల వర ప్రాసాదం అంటే.

(4)ఇలా ప్రపంచంలోని సమస్త విజ్ఞానాలకు చెందిన మూలాలు హైందవంలో ఎలా ఉన్నాయో చూపిస్తుందీ గ్రంధం.
పృథు మహారాజు రాజ్యంలో కోరినవి ఇవ్వటం లేదు అని, భూదేవిమీద అలిగాడు. గోరూప భూదేవిని వెంటాడ సాగాడు. ఏ లోకాలకి వెళ్తే ఆ లోకాలకి వెళ్ళాడు . ‘యత్నం పురుష లక్షణం’ కదా. కనుక, భూదేవి వ్యాపార నిర్వహణా శాస్త్రం బోధించిందిట. “నేలను సమతలం చేయించు, నీటి యాజమాన్య విధానాలు పాటించు. అమృత ఫలాలు అందిస్తాను. అని చెప్తూ, తగిన పాల పాత్ర (ఫలితాలు ఒడిసిపట్టే వాటిని / వాడిని) వాడి, తగిన పాలు పితికేవాడిని (చేతనైన పనివాడిని / పరికరం) నియమించి, తగిన పాలు చేపే దూడ (ఉత్ప్రేరకం, తనుకార్య నిర్వహణలో భాగం కాకపోయినా శీఘ్ర, వలసిన ఫలితాలను ఇచ్చేది / ఇచ్చేవాడు) తగినట్లు ప్రయోగించు. ఈ సూత్రాలు అనుసరిస్తేనే కదా ఎంతటి వారైనా, ఆఖరికి మహేంద్రుడు లాంటి గొప్ప దేవతలైనా, సుఫలాలను అందుకోగలరు” అని చెప్పిందిట. ( తెలుగుబాగవతం.ఆర్గ్, గ్రంధం, చతుర్థ స్కంధ, 17వ ఘట్టం. .) ఇంత కన్నా గొప్ప management సూత్రం ఏముంటుంది. ఇలా ప్రపంచంలోని సమస్త విజ్ఞానాలకు చెందిన మూలాలు హైందవంలో ఎలా ఉన్నాయో చూపిస్తుందీ గ్రంధం. అన్నీ ఇక్కడ చర్చించలేం కాని మాదిరి మల్లే మరి కొన్ని మాత్రం చూద్ధాం.
ప్రచేతసులని ఒకే పేరు ఒకే లక్షణాలు గల అన్నదమ్ములు పదిమంది ఉన్నారట. వారికి ఒకర్తే భార్యట మారిష. (అన్ని జీవులలోనూ మిక్కిలి తెలివైన మానవులకు సంకేతం అనుకోవచ్చు). వారు సముద్ర జలాలలో వేల యేళ్ళు తపస్సు చేసి, బయటకొచ్చా రట. (నీరు విజ్ఞానానికి సంకేతం. విజ్ఞానం ఎక్కువ అయి) వృక్షాల మీద విపరీతమైన కోపం వచ్చి నాశనం చేయబూనే రట. అది ప్రళయం కాబోతోందని, బ్రహ్మ దేవు డంతటి వాడు దిగివచ్చి, ప్రచేతసులకు నచ్చచెప్పి, శాంత పరచాడట. కనుక భూలోకం క్షేమానికి వృక్షాలు నాశనం చేయరాదు. ప్రకృతి సమతౌల్యాన్ని నొక్కి చెప్తున్నారా. ఉత్తి కథేనా ఇది?
(తెలుగుబాగవతం.ఆర్గ్, గ్రంధం, 4వ స్కంధ, 25వ ఘట్టం, 4-938-వ. నుండి. . )

మన తెలుగుభాగవతం రసవంతమైన రచనా విశేషమే కాదు, పసందైన పద్యాల పందారమే కాదు, వేల ఏళ్ళ కైనా చెరగని విశిష్ఠతలు గల ఈ గ్రంధంలోని నిర్వహణా, ప్రకృతి సమతౌల్యాది సమస్త వైజ్ఞానిక సంబధ విషయాలు ఇప్పటి కాలానికి కూడా చక్కగా అనువర్తిస్తాయి. ఆ ఫలాలు అందుకోవాలంటే ఈ గ్రంధాన్ని ప్రస్తుత కాలానికి అనుగుణంగా చక్కగా పరిశోధిస్తూ ప్రయోగిస్తూ ఉండాలి.

సంకేత (రహస్య) అర్థాలను వాడి, అదే కథలో, అదే పద్యంలో అనేక వైజ్ఞానిక విషయాలు గుప్పించారు. .
మనందరికీ “గజేంద్ర మోక్షం” చిరపరచితమైనదే కదా. ఇందులో ఉన్న కథా పటుత్వం, పద్యాల సొగసులు, వర్ణనల వైభవం, పాత్ర చిత్రీకరణలో సమౌన్నత్యం మన అందరికీ తెలుసు. “సిరికిం జెప్పడు” లాంటి ఆణిముత్యాలు కోకొల్లలు. అసలు పోతన భాగవతంలో ముఖ్యమైన పద్యాలు కొన్ని వందలు ఎంచమంటే, అమ్మో ఏవి వదిలేయాలి బాబో అంటారట మహా పండితులు కూడా. కాని ఇదే కథలోని పదాలకు, జంతువులకు, చెట్లకు ఇంకా ఇలాంటి వాటికి నీతి శాస్త్రం, వేదాంత శాస్త్రం మున్నగు వాటిలో ఉండే సంకేత అర్థాలను వాడుకుంటూ ఎన్ని విశిష్ఠ విషయాలు పొట్లం కట్టి ఇచ్చారో కదా ఆ మహానుభావులు. రండి ఆ పొట్లాలు విప్పుకుందాం. ఆ భావ సముద్రంలోని రత్నమాణిక్యాలను మన నవీన వైజ్ఞానిక భవనాలకు పునాది రాళ్ళగా వాడుకుందాం. అవునా అంటారా? అయితే మన భాగవతంలో వివరణలు విభాగంలో, సంకేత పదాలు తెరచి చూడండి. ఇవి రుచి మాత్రమే, వీటిలో చాలా పదాలకు రసాయనిక రహస్యార్థాలు కూడా ఉన్నాయిట.

(5)మన తెలుగు భాగవతం వంటి ప్రామాణికగ్రంథాల విశిష్ఠత గుర్తిద్దాం. వాటిని లోతుగా శోధిద్దాం.
మన తెలుగుభాగవతంలో అనంత కోటి విషయాల ప్రస్తావనలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఉదాహరణకు మన జాలగూడులో వివరణలు విభాగంలో చూపాను. మన కాల మానం (అంటే కొలత ప్రమాణాలు) చూడండి, 0.1 మైక్రో సెకను నుంచి ప్రత్యేకమైన యూనిట్ పేర్లు ఉండేవి. అలాగే వేల సంవత్సరాల ప్రమాణం వరకు కూడా పేర్లు ఉన్నాయి. వేలవేల సంవత్సరాల మన చరిత్రలో ఇలాంటి మానాలు రకరకాలు ఉండేవి. వాటిలో 1, 2 మాత్రమే ఇక్కడ కనబడతాయి. అలాగే సంఖ్యామానం పదికి 35 పైగా గుణాంకాల (పవర్) వరకు విడి విడి నామాలు వాడుకలో ఉండేవి. ఇలాంటి కథల పుస్తకాలలోనే వాటి ప్రయోగం ఉందంటే. అసలు శాస్త్రీయ గ్రంథాలు ఎంత లోతుగా ఉంటాయో. వాటిన మనం అందుకోలేం మరి. ఈ విషయాలకు చెందిన విజ్ఞానం మన సంస్కృతిలో కలిసిపోయి ఉంది. గర్భస్థ పిండ దశలను కపిలుడు తన తల్లికి వివరిస్తాడు. ఆహా ఏమి స్పష్టత ఏమి అవగాహన. అంత ఎందుకు వీటిలో ఇచ్చిన జంతు వృక్ష జాతుల వివరాలు వెతుక్కుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని జాతులు నశించి పోయాయో. అలాంటి విశిష్టతలను, విజ్ఞాన విషయాలను వెలికి తీసి, ఆ పునాది మీద నవీన విజ్ఞాన సోపానాలు కట్టుకుందాం. విలువల ప్రగతి సాధింద్దాం. ప్రపంచంలో మన ఉన్నత స్థానాన్ని స్థిరపరచుకుందాం.

గమనిక:- పద్యాలలో యతి అక్షరాలు క్రిందిగీతతోనూ, ప్రాసాక్షరాలు బొద్దు లిపితోనూ సూచించడమైనది.

:చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం:
-
సంకలనం: ఊలపల్లి సాంబశివ రావు,
భాగవత గణనాధ్యాయి,