పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : యజ్ఞం - హోమం.

p> యజ్ఞానికి హోమానికి ఉన్న తేడా
✍ యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి" అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది.
✍ యాగానికి, హోమానికి తేడా ఉంది. యాగంలో ఆహుతి ఇచ్చేది అధ్వర్యుడు; మంత్రాల్ని పఠించేది హోత. మంత్రాంతంలో ఉచ్చరించబడే వౌషట్ శబ్దమే వషట్కారం. ఈ వషట్కారోచ్చరణకాలంలోనే అధ్వర్యుడు అగ్నిలో ఆహుతుల్ని వ్రేలుస్తాడు. ఈ క్రమంతో కూడినది యాగం. హోమరీతి ఇంతకంటేకూడా సంక్షిప్తం. దీనికి హోతతో పనిలేదు. అధ్వర్యుడు అగ్ని పార్స్వాన ఆసీనుడై, తనే యజుర్మంత్రాల్ని చదువుతాడు. మత్రాంతన స్వాహా శబ్దాన్ని ఉచ్చరిస్తాడు. ఇదే స్వాహాకారం.ఇది ఉచ్చరిస్తున్నప్పుడు ఆహుతిని వేస్తాడు. ఇది హోమ క్రమము.
✍యజ్ఞాలలో రకాలు
యజ్ఞాలు మూడు ప్రధాన రకాలున్నాయి. అవి
(1) పాక యజ్ఞాలు; (2) హవిర్యాగాలు; (3) సోమ సంస్థలు
1.పాక యజ్ఞాలు - ఇవి మళ్ళీ ఏడు విధాలు
ఔపాసన; స్థాలీపాకము; వైశ్వదేవము; అష్టకము; మాస శ్రాద్ధము; సర్పబలి; ఈశాన బలి.
2.హవిర్యాగాలు - వీటిలో కూడా ఏడు రకాలున్నాయి.
అగ్నిహోత్రాలు; దర్శపూర్ణిమాసలు; అగ్రయణం; చాతుర్మాస్యాలు; పిండ, పితృ యజ్ఞాలు; నిరూఢ పశుబంధము; సౌత్రామణి.
3.సోమ సంస్థలు - వీటిలో ఏడు రకాలు
అగ్నిష్టోమము; అత్యగ్నిష్టోమము; ఉక్థము; అతిరాత్రము; ఆప్తోర్యామం; వాజపేయం; పౌండరీకం,
✍కొన్ని యజ్ఞాలు
అశ్వమేధ యాగం; పుత్రకామేష్టి యాగం; రాజసూయ యాగం; సర్పయాగం.
విశ్వజిత్ యాగం : ఒక్క రోజులో పూర్తి కావలిసిన యాగం. ఇందులో యజమాని తన మొత్తం ఆస్తిని దానం చేయవలసి ఉంటుంది.

--- ఆచార్య. చొప్పకట్ల సత్యన్నారాయణ గారు.