పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : నారాయణ నామ మహిమ

నారాయణ నామ మహిమ : : అజామిళుడి వృత్తాంతం
 - ఆచార్య. చొప్పకట్ల సత్యన్నారాయణ గారు

 భారతవర్షంలో కన్యాకుబ్దమని ఒక నగరం; అందులో పరమ పవిత్రమైన వంశంలో పుట్టిన అజామిళుడు అనే ఒక విప్రుడు ఉండేవాడు. చక్కటి స్వాధ్యాయ సంప్రదాయాలు మెండుగా అబ్బాయా యబ్బాయికి. తండ్రి తాతలు సంపాదించిన సిరిసంపదలు కావాల్సినన్ని ఉన్నాయి. అంతలో వయసు వచ్చింది మొదలు వీనికి జూదం, వేశ్య గమనం బాగా ఎక్కువ అయ్యాయి. వేశ్యయే భార్యగా నిరంతరం అక్కడే ఉంటూ సర్వము నాశనం చేసుకున్నాడు. ఆమె వల్ల పదిమంది బిడ్డల తండ్రి అయ్యాడు

 పరమ పవిత్రమైన వంశంలో పుట్టినా ఆచార, సాంప్రదాయాలను విడిచి పాపకర్మలలో మునిగి తేలుతుండగా వార్ధక్యం నెత్తిమీద పడింది; నీలికాంతులీనే జుట్టు తెల్ల బూడిద లాగా అయ్యింది; అవయవాలు పట్టు తప్పాయి; తలవణుకు మొదలైంది; చూపు సన్నగిల్లింది; పళ్ళు ఊడాయి; ఆయాసంతో దగ్గు ఆయాసం ఆరంభ మయ్యాయి; ఎనిమిది పదులు దాటాయి.

 బిడ్డలలో చివారివాడు అయిన వాడిమీద ప్రేమ ఎక్కువ అయ్యింది ఆ బాలుడి పేరు నారాయణుడు . ముసలితనంలో ఎప్పుడూ వాని లాలనలో కాలం గడుపుతూ ఉండగా వానికి కాలం చెల్లింది. కన్నుమూస్తూ కూడా ముద్దులకొడుకు మీద ప్రేమతో 'నారాయణా' అంటూ ప్రాణాలు వదిలాడు. ఎన్నో పాపాలు చేసిన కారణంగా వానిని నరకానికి తీసుకుపోవడానికి యమకింకరులు వచ్చారు భయంకర ఆకారులై; అంతిమ క్షణంలో నారాయణ నామస్మరణ చేసిన కారణంగా విష్ణుదూతలు వచ్చారు; అప్పటికే యమదూతలు అజామిళుని దేహం నుండి జీవుని లాగి పాశ బంధం వేశారు; వచ్చిన విష్ణుసేవకులు, యమభటులని దూరంగా తరిమారు;వారిని ఆశ్చర్యంతో చూస్తూ యమకింకరులు: "అయ్యా!!! మీరెవరు??? మీ శరీర ఆకారాలు మాకెంతో ఆనందం కలిగిస్తున్నాయి . శంఖ, చక్ర, గదా, పద్మధారులై, పీతాంబరాలు ధరించి కిరీట కాంతితో విరాజిల్లే పరమ శాంతిమూర్తులైన మిమ్ము చూసే కొద్దీ సంతోషం పెరుగుతున్నది. నిఖిల లోక ధర్మ రక్షణకి ప్రజాపతిచే నియోగింపబడ్డ యమధర్మరాజు మా ప్రభువు. ఆయన ఆజ్ఞానుసారము వీనిని తీసుకుని వెళ్తుంటే మీరెందుకు అడ్డుకున్నారు" అని ప్రశ్నించి అంతతో ఆగక...

  "ధర్మాధర్మ నిర్ణయం చేసేది వేదం . అటువంటి వేదం పరమేశ్వర స్వరూపం. ధర్మబద్ధమైన సత్కర్మలు చేసేవాడే విప్రకులంలో పుడతాడు . ఈ ప్రాణి అటువంటి సదాచార సంపన్నమైన వంశంలో పుట్టి శాంతన్వభావంతో ధర్మనిష్ఠతో గురుసన్నిధానంలో శ్రద్ధగా వేదాధ్యయనం చేసాడు. అతిధి మర్యాదలు నడిపాడు. భూతదయ కలవాడు. అన్ని నిష్ఠగా సాగించినా... యవ్వనం ప్రవేశించి, కామోద్రేకం కలిగే వయస్సు వచ్చింది. ఆ రోజుల్లో ఒకనాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం దేవ పూజకి పువ్వులు, పళ్ళు తేవడానికి నగరం వెలుపల ఉద్యనవనానికి వెళ్ళాడు; అది వసంత మాసం; వనంలో లతలన్నీ సుగంధ సుమాలతో నిండిఉన్నాయి వానిలో తేనె త్రాగడానికి ఝంకారాలతో తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఫల వృక్షాల మీద కోకిలలు, చిలుకలు కులకూజితాలు వినిపిస్తున్నాయి. అటువంటి వనం, నగరంలోని విలాసినీ జనానికి, ఆటపట్టు. అక్కడికే విటులు అందరూ చేరుతూ ఉంటారు. పువ్వులు, ఫలాలు, దర్భలు తీసుకుని వస్తున్నాడు ఇతను. ఆ సమయంలో ఆ వనంలో ఒక పువ్వు పొదరింట నడివయస్సులో ఉన్న సుందరాంగిని ఆలింగనం చేసుకుని ముద్దులు కురిపించే యువకుడిని చూసాడు ఆ కామిని బాగా మద్యం త్రాగి ఉంది అందువల్ల దాని కన్నులు ఎర్ర కలువల వలె ఉన్నాయి. మత్తులో ఉండటం వలన అది మరీ మీద మీదకి వెళ్లి ప్రియుడికి ఉద్రేకం కలిగిస్తున్నది. మైకంలో వారిద్దరూ ఒళ్ళు తెలియకుండా క్రిందా మీద పడుతూ నవ్వుతూ కులాసాగా గడుపుతున్నారు. దాని జుట్టు ముడి వీడి ముఖం నిండా చిందరవందరగా పడింది. చేతుల గాజులు గలగలాడుతున్నాయి . మువ్వల వడ్డాణం ఘల్లు ఘల్లు మంటున్నది. అటువంటి సన్నివేశం చూసిన యవ్వనుడు ఎవరికైనా మనస్సు చెడుతుంది.. అప్పటికే నూనూగు మీసాల వయస్సు లో ఉన్న అజామిళుడు గుండెలో మన్మథుడు విల్లు ఎక్కుపెట్టి ఉన్నాడు.. అంతే కామోద్రేకం కలిగిన వాడికి మంచిచెడ్డల విచక్షణ పోతుంది. పోయింది అజామిళుడు సర్వము మార్చిపోయాడు. పువ్వులు, పళ్ళు, దర్భలు జారావిడిచాడు అది మొదలు వాని జీవితం మారిపోయింది వేదంత చర్చలు మాని, కామిని జన చర్చలో పడ్డాడు; శాస్త్ర పాఠ తర్కం వదిలి, ప్రణయ తర్కం ఆరంభించాడు; తన సంసారం వదిలి, దాని సంసార భారం మీదవేసుకున్నాడు; అజామిళుడు కులాచార మర్యాదలను కూలద్రోశాడు, తండ్రిగారు సంపాదించిన ఆస్తినంతటినీ ఆమెపాలు చేశాడు; సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు, బాగా రుచిమరిగి వాలుగన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు; ఇంటివద్ద తన భార్య ఉన్నది. ఆమె ఎంతో సౌన్దర్యవతి. సుగుణవతి, సౌభాగ్యవతి, నవ యౌవనవతి. అటువంటి అందాల రాశిని విడిచిపెట్టి, ఆ పరమ మూర్ఖుడు సిగ్గుఎగ్గులు వదలి, ఆ వెలయాలి ఇంటిలోనే కాపురం పెట్టాడు. చాలా కాలం ఈ ప్రకారంగా భ్రష్టాచారుడై పాపచిత్తుడై మలినదేహుడై చెడుమార్గంలో ప్రవర్తింపసాగాడు. అందువల్ల ఆ పాపాత్ముణ్ణి మేము బలవంతంగా బంధించి తీసుకుపోతున్నాము." అని పల్కుతున్న యమభటులను నివారించి నీతిశాస్త్ర పండితులైన భగవంతుని దూతలు ఈ విధంగా అన్నారు.

 "ఆహాహా! ఏమి మీ తెలివితేటలూ! మీ యుక్తాయుక్త వివేకము! మీ ధర్మ నిర్ణయ పాండిత్యం తెలిసిపోయింది. అదండ్యులైన పుణ్యపురుషులను దండించే మీ అజ్ఞానం వెల్లడయింది. యితడు కోటికంటే ఎక్కువ జన్మాలలో చేసిన పాపసమూహాలను ఈ జన్మలో ఇప్పుడు బుద్ధిమంతుడై పారద్రోలాడు. మరణ సమయంలో అమృతం వంటి భగవంతుని పుణ్య నామసంకీర్తనం చేసిన మహాభాగ్యం ఇతడికి అబ్బింది. ఈతడు "నారాయణా" అని పిలిచినప్పుడు ఇతని హృదయం కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు తలంప వద్దు. భగవంతుని పేరును ఏవిధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై అందులో ఉండనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచినా, విశ్రాంతి వేళలోఅయినా, ఆటలోనైనా, పరిహాసంగానైనా పద్య వచన గీత భావార్థాలతో నయినా సరే కమలాక్షుణ్ణి స్మరిస్తే చాలు, పాపం పరిహరింపబడుతుంది. భగవంతుడంటే ఏమిటో ఎరుగని బాలుడు కూడా హరిభక్తులలో జేరి 'హరిహరి' అని పలుకుతూ ఉంటే చాలు... అగ్ని గాలితో కూడి గడ్డిని కాల్చివేసినట్లు హరి నామస్మరణం పాపాలన్నింటినీ పటాపంచలు చేస్తుంది. సారవంతమైన ఔషధం అనుకోకుండా పొరపాటున సేవించినప్పటికీ దాని గుణం వృధా పోదు. దాని ప్రభావం రోగాలను పోగొట్టి తీరుతుంది. అదేవిధంగా పరమ పావనుడైన భగవంతుని నామం తెలియక పలికిననూ, తిరస్కార భావంతో పలికిననూ దాని ప్రభావం ఊరకే పోదు. దాని మహత్తర గుణాన్ని అది తప్పకుండా చూపించి తీరుతుంది. అంత్య కాలం సమీపించి ధైర్యం సన్నగిల్లినప్పుడు ఏదో పూర్వ జన్మ విశేషం ఉంటేనే గాని పరాత్పరుడు మనస్సులోకి రాదు. ఇక ఈ అజామిళుడు మరణకాలంలో శ్రీహరి నామస్మరణం అనే అమృతాన్ని ప్రత్యక్షంగానే ఆస్వాదించాడు. శాశ్వతమైనదీ, నిర్దోషమైనదీ, సమస్తమైన చైతన్యానికి ఆలవాలమైనదీ అయిన నారాయణ నామస్మరణం వ్యర్థంగా ఎందుకు పోతుంది." అని వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి పరమ భయంకరమైన యమపాశాలనుండి విముక్తుణ్ణి చేశారు.

 అజామిళుడు ఎదుటనున్న విష్ణుదూతలకు ఎంతో ఆనందంతో చేతులెత్తి నమస్కరించాడు. శ్రీమన్నారాయణుని చరణకమల స్మరణమనే నిర్మల జలం అతని మహాపాతక సమూహాలన్నింటినీ కడిగివేసింది. అతని హృదయం నిశ్చల భక్తికి నిలయమై క్షణ మాత్రంలో అతనికి జ్ఞానోదయమయింది. పశ్చాత్తాపంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను నా చిత్తాన్ని లొంగదీసుకొని, ఇంద్రియాలను జయించి, శ్వాసను నియమించి శ్రీమన్నారాయణుని శరణు పొందుతాను అని భావించి గొప్ప తత్త్వజ్ఞానియై సంసార బంధాలన్నింటినీ పారద్రోలి గంగా ద్వారానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక దేవాలయంలో కూర్చొని యోగామార్గాన్ని ఆశ్రయించాడు.గుణాతీతుడైన తన ఆత్మను పరమాత్మలో లీనం చేశాడు. అప్పుడు అతనికి మొదట తనను రక్షించిన ఆ దివ్యపురుషులు కనిపించారు. అతడు వారికి నమస్కరించి గంగాతీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణపార్శ్వచరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణుదూతలతో కలిసి రత్నాలు చెక్కిన బంగారు విమానాన్ని అధిష్ఠించి వైకుంఠ నగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని చరణారవిందాలను సేవించే పరిణత దశకు చేరుకున్నాడు.

 ఈవిధంగా అజామిళుడు సర్వధర్మాలను ఉల్లంఘించిన వాడు, దాసీపుత్రిని పెండ్లాడిన వాడూ దుష్కర్మల చేత భ్రష్టుడైన వాడూ అయి నరకంలో పడబోతూ 'నారాయణ స్మరణం' వల్ల క్షణ మాత్రంలో మోక్షాన్ని అందుకున్నాడు. కర్మాలన్నీ విడిపోవటానికి వేరే ఉపాయం ఏదీ లేదు. చెప్పిన మాట వినకుండా ఎదురుతిరిగి మనస్సు ఎన్ని మార్గాల్లో పోయినా సర్వదా నారాయణ నామాన్ని ఉచ్చరించడమే సరైన ఉపాయం.అజామిళుడు అవసాన కాలంలో కుమారుని పేరు పెట్టి పిలిచాడు. కానీ శ్రీహరిని పిలువలేదు. అయిననూ పుత్రుని పేరుతో విష్ణు నామాన్ని మరణకాలమందు ఉచ్చరించినందువల్ల హరి సాన్నిధ్యాన్ని చేరగలిగినాడు. ఇక భక్తి పూర్వకంగా భగవంతుని నామాన్ని పలికితే చెప్పేదేముంది?