పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : గోవర్ధన గిరి ప్రదక్షిణ

గోవర్ధనగిరి ప్రదక్షిణ

  ఢిల్లీ నుండి కొద్ది దూరంలో మధుర దగ్గరలో బృందావనం ఉంది. గోవర్ధన పర్వతం బృందావన్ నుండి 22కి.మి దూరంలో వుంటుంది. బస్సులు, ఆటోలు వెళుతుంటాయి. దారిలో రాధాకుండ్ వుంది. రాధాకుండ్ నుండి 5కి.మి దూరంలో వుంటుంది గోవర్ధన పర్వతం. ఇక్కడ ఒక చిన్న ఊరులా వుంటుంది. ఈ ఊరినీ గోవర్ధన్ పేరుతోనే పిలుస్తారు. గోవర్ధన పర్వతం వున్న చోట గోవర్ధన మందిరం వుంది. అందరూ అక్కడ దర్శనం చేసుకునే ప్రదక్షిణ మొదలుపెడతారు. అక్కడ ఒక దగ్గర కృష్ణుడి విగ్రహం, మరో దగ్గర చిన్న గోవర్ధన పర్వత నమూనాలో గుడి వున్నాయి. భక్తులు కూడా బాగానే వుంటారు. గోవర్ధన గిరి ప్రదక్షిణ ఇక్కడ ఒక చోటునుండి మొదలవుతుంది, సుమారు 11 కి.మీ, కొనసాగుతుంది.

 సాధారణంగా గోవర్ధన పర్వతం అంటే చాలా ఎత్తుగా నిలబడి వుంటుంది అనుకుంటారు. కాని గోవర్థనగిరి పడుకున్న పర్వతం, ఎత్తు తక్కువగా వుంటుంది. చుట్టు కొలత మాత్రం 11కి.మి. ఉంటుంది. గోవర్ధన పర్వతాన్ని చూడకపోయిన దాని గురుంచి తెలియని వారు వుండరేమో. బృందావనంలో నివసిస్తున్న సమయంలో కృష్ణుడు, గోపాలులు ఆచరిస్తున్న ఇంద్రయాగాన్ని ఆపించి, గోవర్ధన గిరికి పూజ చేయిస్తాడు. కోపగించిన ఇంద్రుడు ప్రళయ భయంకర మైన రాళ్ళవానతో బృందావన ప్రజలను ముంచేస్తాడు. అప్పుడు చిన్నికృష్ణుడు చిటికెన వేలుమీద గోవర్ధన గిరి ఎత్తి పట్టుకుని ఊరి వారికి రక్షణ కల్పించాడు. వరుసగా ఏడు (7) రోజులు కృష్ణుడు అలా గోవర్ధన గిరిని పట్టుకునే వున్నాడు. దీనికి గుర్తుగా వైష్ణవ సంప్రదాయులు ఇప్పటికి దీపావళి మరుసటి రోజుని గోవర్ధన పూజ చేస్తారు. భక్తుల దృష్టిలో గోవర్ధన పర్వతం కృష్ణుడికి భిన్నమైనదేమి కాదు. గోపజనులను, గోవులను కాపాడిన కృష్ణుడు ఆ రోజు నుండి గోవిందుడు అయ్యాడు. గిరిని ఎత్తి గిరిధారి అయ్యాడు.

 కిరి యై ధర యెత్తిన హరి
రి సరసిజముకుళ మెత్తుతిఁ ద్రిభువన శం
 కకరుఁడై గోవర్థన
గిరి నెత్తెం జక్క నొక్క కేలన్ లీలన్.

 కృష్ణుడి అభిన్నరూపంగా సాక్షాత్ శ్రీకృష్ణుని మరో రూపంగా భావించబడే గోవర్ధన గిరి ప్రదక్షిణ చేయడం చాలా ఉత్సాహంగా వుంటుంది. కొందరు నడవలేని వాళ్ళు రిక్షాలో చేస్తారు. కొందరు చెప్పులతో నడుస్తుంటే, మరికొందరు చెప్పులు లేకుండా నడుస్తారు. సాధారణంగా గిరికి కుడివైపు వుండేలా గిరి చుట్టూ నడుస్తారు. రకరకాల వాళ్ళు ప్రదక్షిణలు చేస్తుంటారు. వాళ్ళలో సాధువులు, గృహస్థులు, పిల్లలు, వృద్ధులు. ఎవరు ఎలా చేయగలిగితే అలా చేస్తుంటారు.

 ఇక్కడ గిరిప్రదక్షిణ అంటే ఎవరికి వారే చేయడమే కాదు. కుటుంబం సమిష్టిగా కూడ చేస్తుంటారు. ఇలా కుటుంబం (అంటే బార్య, భర్త, ఇద్దరు పిల్లలు అనుకోండి) సమిష్టిగా చేసే ప్రదక్షిణ కొంచెం వింతగా అనిపిస్తుంది. వాళ్ళు పడుకొని సాష్టంగ పడుతూ గిరికి ప్రదక్షిణ చేస్తారు. కాకపోతే ఒక్కరే కాదు నలుగురు కలిసి ప్రదక్షిణ. అంటే భర్త సాష్టంగ పూర్తయిన చోటునుండి భార్య, ఆమెది పూర్తయ్యే చోటు నుండి ఒక పిల్ల, అక్కడ నుండి మరొక పిల్ల, మళ్ళీ వాళ్ళ నాన్న. ఇలా సాష్టాంగ ప్రదక్షిణలు చేయడం అన్నది ఇక్కడ కనబడుతుంది. కఠినమైన చలి, మంచు వున్నా కూడా సాష్టాంగ పడుతూ చేస్తుంటారు.

 ఈ ప్రదక్షిణ మార్గంలో అక్కడక్కడ నిర్జన ప్రదేశాలు. మద్యలో ఒక ఊరు, చిన్న చిన్న ఆశ్రమాలు, సాధువుల కుటీరాలు కనబడతాయి, ముఖ్యంగా కొందరు సాధువులు చేసే సాష్టాంగ ప్రదక్షిణ మిక్కిలి ఆకర్షించే ప్రదక్షిణ.

 మాములుగా అయితే వరుసగా సాష్టాంగ ప్రణామాలు పెడుతూ ముందుకు వెళ్ళాలి. లేదా కుటుంబం సమిష్టిగా చేస్తూ వెళ్ళాలి. కాని ఈ సాధువులు ఒకే చోట 108 లేదా 1008 సార్లు సాష్టంగప్రణామం చేశాకనే ముందుకు వెళ్తారు. అలా ప్రతి సారి వాళ్ళు మొక్కిన్నన్ని సార్లు చేస్తారు. అలా అది 108 కావచ్చు 1008 కావచ్చు. వాళ్ళు ఎన్సిసార్లు అనుకున్నారో అన్ని చిన్నరాళ్ళ కుప్పని పెట్టుకుంటారు. ప్రతి ప్రణామానికి ఒక రాయి ముందు పెడతారు. అలా అనుకున్న 108 లేక 1008 రాళ్ళు ముందుకు వచ్చాక, వాళ్ళు ముందుకి జరిపిన రాళ్ళకుప్ప దగ్గరకి వస్తారు. తరువాతి సాష్టాంగం మొదలు పెడతారు. అంటే కొన్ని సార్లు ఒకే చోట ఒక సాష్టాంగం పూర్తవడానికి వాళ్ళకి ఒకటి లేక రెండు రోజులు పడుతుంది. అలా మొత్తం గిరి ప్రదక్షిణ పూర్తవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.