పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : ఈనాడు అంతర్యామి ఎంచిన వ్యాసాలు

ఈనాడు అంతర్యామి 02- ఏప్రిల్-2018
భక్తుడి చూపు

భాగవతాన్ని భావగతం చేసుకొని బాగుపడాలన్నారు పెద్దలు. భాగవత పురాణం- నవ విధ భక్తిమార్గాల్ని ఆవిష్కరించడం ద్వారా మహాభక్తుల చరిత్రల్ని లోకం ముందుంచుతుంది. ‘నీవే తప్ప ఇతఃపరం బెరుగ!’ అనే అనన్య భక్తిభావంతో భగవంతుణ్ని కొలిచి తరించిన మహానుభావులెందరో అందులో కనిపిస్తారు. భగవంతుడి మీద తదేక భక్తి- భక్తుడి చిత్తాన్ని పరిశుద్ధం చేస్తుంది. అతడిలో సాత్విక భావాల్ని పెంపుజేస్తుంది. అటువంటి భాగవతుల లౌకిక వ్యవహార శైలి ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ‘సర్వం హరిమయం’గా భావిస్తాడు కాబట్టి, భక్తుడు సర్వ సమత్వ భావనకు దగ్గరగా ఉంటాడు. సాటి సామాజికుల కంటే ఎక్కువ ఔదార్యం, ఉదాత్తత కనబరుస్తాడు. ఇతరుల స్వభావాల్ని, గుణగణాల్ని, ప్రవర్తనను, నైతికతను బేరీజు వేసే న్యాయమూర్తి తానే అని ఎన్నడూ భావించుకోడు. అతడి దృష్టిలో అన్నీ భగవంతుడి లీలావిలాసాలే! భక్తాగ్రణి ప్రహ్లాదుడు ఏనాడూ తండ్రి మార్గాన్ని అవలంబించలేదు. అలా అని ఆయనను ఎప్పుడూ దూషించలేదు, ద్వేషించలేదు. అనుక్షణం నారాయణ స్మరణ చేసిన పరమ భక్తుడు ప్రహ్లాదుడు. కానీ నారద మహర్షికి దేవతలు, దానవులతో సమానమైన బంధాలు ఉన్నాయి. శ్రీకృష్ణుణ్ని నవనీత చోరుడిగా ఊహించి భజించే భక్తుడు- ఆ చోరత్వానికి ఆపాదించేది లౌకికమైన అర్థం కాదు. వెన్నదొంగ కన్నయ్య పరుల సొమ్ము హరించేవాడు కాడు. ఆయన భగవత్అవతారమైన లీలా బాలుడు. లౌకికమైన ధర్మాధర్మాలకు, విధి నిషేధాలకు అతీతుడు. సకల సృష్టికర్త, సర్వైశ్వర్య ప్రదాత అయిన స్వామిని కొంటె పిల్లవాడుగా భావించటం, భాగవతుడి భక్తి ప్రకటనలో ఓ చమత్కారం. అంతర్యామిగా ఉన్న కృష్ణపరమాత్మ గోపికలకు, గోపాలకులకు పరపురుషుడు ఎలా అవుతాడు? వారికి, ఆయనకు పారమార్థిక దృష్టిలో భేదమే లేదు.

యజుర్వేదంలో భాగమైన ‘రుద్ర నమకం’లో శివుణ్ని ‘తస్కరాణాం పతి’ (దొంగల రాజు) అని వర్ణిస్తారు. దీని అర్థం ఉదాత్తమైనదని వితండాలకు, కుతర్కాలకు దూరంగా ఉండే వివేకవంతులకు తెలిసిన విషయమే! అందరికీ పాలకుడైన లోకేశ్వరుడు దొంగలకూ పాలకుడు. జగత్పిత మహేశ్వరుడికి దొంగలు, దొరలు అందరూ బిడ్డలే. దురదృష్టం లేదా దుష్కర్మ ఫలం వల్ల దొంగలైనవారి మనసుల్ని మార్చి, తన కటాక్షంతో సంస్కరించగల అనాథ నాథుణ్ని ‘తస్కరాణాం పతి’ అనటంలో తప్పేముంది? ఇదీ భక్తుడి దృక్కోణం.

శ్రీహరికి ఆ దొంగతనం పేరులోనే ఉంది. హరించేవాడు కాబట్టి ‘హరి’. సొమ్ములు, సుఖశాంతులు హరించి బాధించేవాడు లౌకిక చోరుడు. బాధలన్నింటినీ హరించి, సుఖశాంతులు మిగిల్చే దొంగ- హరి. అందుకే  ఆయనను ‘భక్త దుఃఖ పరిహారి, దుష్టసంపదపహారి...’ అని పోతన పరవశంతో వర్ణించాడు. అన్ని రకాల అపహరణల్నీ  స్వామికి ఆనందంగా ఆపాదించాడు!

- మల్లాది హనుమంతరావు

ఈనాడు అంతర్యామి – 15-03-2018పరమాత్మ 

మనిషి మనసులో ప్రశ్న మొలిస్తే, ఆ వెంటనే జవాబు కోసం వెతుకులాట మొదలవుతుంది. అతడి ప్రయత్నం కొనసాగుతున్నకొద్దీ, ఆత్మను ఆవరించి ఉన్న ‘జడత్వం’ అనే ముసుగు తొలగిపోతుంది. దాని స్థానంలో చేతనత్వం చోటుచేసుకుంటుంది. ఆ సాధకుడు ఆధ్యాత్మిక మార్గానికి మళ్లుతాడు. అతడు కచ్చితంగా భక్తుడిగా మారతాడు.

భక్తిమార్గంలో వినిపించే పదం ‘ఎవడు’. ఆ మూడక్షరాల మాటలోనే ఎన్నో భావాలు ఇమిడి ఉన్నాయి. అందులో అమాయకత్వం ఉంది. గడుసుతనమూ కనిపిస్తుంది. తెలిసిన తత్వంతో పాటు తెలియనితనం సైతం దాగి ఉంటుంది. ‘ఎవడు’ అని పలికే తీరును బట్టి, లోపలి భావం ప్రశ్నగానే కాక జవాబుగా కూడా పనిచేస్తుంది. అందుకే ఆ పదం పోతన మహాకవికి ఎంతో అభిమానపాత్రమై నిలిచింది. ఆ ఒక్క పదమే ఆయువుపట్టు అనిపించేలా, దాన్ని ఆయన పలు సందర్భాల్లో, అర్థాల్లో వాడాడు.  అదీ ఆ సహజ కవి దూరదృష్టి! కేనోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు చేసిన పనీ అదే! వాటిని సామాన్యులు ఉన్నపళంగా చదవలేరు. ఒకవేళ చదివినా, వారికి ఉపనిషత్తులు అప్పటికప్పుడు అవగతం కాకపోవచ్చు. అలాంటివారికీ ఉపనిషత్స్ఫురణ కలిగే విధంగా, పోతనామాత్యుడు ‘ఎవడు’ పద ప్రయోగాన్ని వివిధ రూపాల్లో చేశాడు. 

భారతం, భాగవతం- రెండింటినీ వ్యాసుడే సంస్కృతంలో రచించాడు. భాగవతానికి పోతన అనువాద పటిమ- దాన్ని ఆయనే రాశాడన్నంత పేరు సంపాదించిపెట్టింది. వ్యాస భారతంలోని ఆనుశాసనిక పర్వం 149వ అధ్యాయంలో విష్ణు సహస్ర నామాలున్నాయి. భీష్ముడు వాటిని యుధిష్ఠిరుడికి ఉపదేశించాడంటారు. ఆ పేర్ల గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ‘ఎవరి నామాన్ని ఉచ్చరిస్తే సంసార బంధనాలన్నీ తొలగిపోతాయో...’ అంటాడు వ్యాసుడు. ఆయన మీద భక్తిభావం గల పోతన- భాగవతంలోనిది కాకపోయినా తన అనువాద ప్రారంభంలో ‘ఎవరి అవతారం అన్ని ప్రాణులకీ సుఖాన్ని కలగజేస్తుందో, ఎవరి శుభనామం తలిస్తే అందరి సంసార బంధనాలూ తొలగిపోతాయో, ఎవరి చరితను హృదయంలోకి చేరిస్తే మృత్యుభయం ఉండదో...’ అని రాశాడు. అక్కడ పరమాత్మ, భగవంతుడు వంటి పదాలు ఉపయోగించకుండా ‘ఎవరి’ పదాన్ని ప్రయోగించడంలోనే గొప్ప ఆంతర్యముంది.

భగవంతుడు గొప్పవాడని కొందరు నమ్ముతారు. మరికొందరు- మానవమాత్రుడే గొప్ప అని తలుస్తారు. ఇంకొందరు వేరొకర్ని విశ్వసిస్తారు. ఎవరు అనే పదప్రయోగంతో పోతన-  ఎవరికి నచ్చినవారిని వారు ఆ స్థానంలో ఊహించుకునే స్వేచ్ఛనిచ్చాడు. అదే సందర్భంలో ఆయన గడుసుదనమూ ప్రస్ఫుటమవుతుంది. జరిగేవన్నీ చెప్పి, ఆ  ‘ఎవరో’ అనేది స్పష్టంగా చెప్పకుండా వదిలేస్తే...‘ఇంతకీ ఎవరది’ అని అందరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న అంకురిస్తుంది. అలాంటివాడి కోసమే అన్వేషణ సాగుతుంది.  ఆ ప్రయత్నంలో వివరం తెలుసుకున్నవారే ముక్తులవుతారు. ఆ ప్రయత్నాన్ని వారికే వదిలేశాడాయన!

అష్టమ స్కందంలో ‘ఈ జగత్తు ఎవరి వల్ల జనిస్తోందో, ఎవరి అధీనంలో ఉందో, ఎవరి కారణంగా నశిస్తున్నదో...’ అంటాడు పోతన. సృష్టికి మూలకారణం ఎవరో, ఆది మధ్య అంతం లేనివారెవరో, అన్నీ తామే అయిన వారెవరో... అంటూ వర్ణిస్తాడు. అలాంటి ఆత్మభవుడై(తనంత తాను జన్మించి)న పరమాత్మను శరణు వేడుతున్నాను’ అంటాడాయన. భక్తుల్లో అలా ఉత్కంఠ పెంచుతూ, ‘ఇన్ని లక్షణాలున్నవాడు పరమాత్మ ఒక్కడే’ అని జవాబు చెబుతాడు. ఎక్కువ ఎవరూ లేరన్నంతగా అన్నిసార్లూ ముక్తాయిస్తాడు. పరమాత్మకు భక్తుడు కాకుండా, ఇక ఆ పాఠకుడు ఎలా తప్పించుకుంటాడు?

అష్టమ స్కంద ప్రారంభంలో ‘ఎవడు’ అనే పదాన్ని రెండు అర్థాల్లో వాడిన తీరు, పోతన రచనా పాటవానికి ప్రతీక. ఎంత వెతికినా, అన్ని లక్షణాలూ ఉన్నవాడు ఆ సర్వవ్యాపి అయిన అంతర్యామి ఒక్కడే! అంత గొప్పవాణ్ని కనుగొన్న జీవుడు ఆరాధించకుండా ఉండలేడు. అందువల్ల అతడు జీవన్ముక్తి పొందగలుగుతాడు. సామాన్యులూ మోక్షప్రాప్తి పొందే మార్గం చూపిన పోతన- మహానుభావుడు!

- అయ్యగారి శ్రీనివాసరావు

11-02-2018 ఈనాడుఅంతర్యామికాలాతీతం

‘నువ్వు తప్ప మరెవరూ దిక్కు లేరు’ అనేది శరణాగత స్థితి! భక్తుడు తన ప్రయత్నం తాను చేశాక, ఇక చేయడానికి ఏదీ లేదన్న నిశ్చయానికి వచ్చి శరణు వేడితే- అన్నింటినీ ఆ సర్వాంతర్యామి చూసుకుంటాడంటాయి పురాణాలు. అలాంటి స్థితికి చేరినవారి పట్ల ఆయనకు అపార ప్రేమ, అభిమానం ఉంటాయి. వారి కర్మల్లో కొద్దిపాటి లోపాలున్నా తెలియనివ్వకుండా, వారితోనే ప్రాయశ్చిత్తం చేయిస్తాడు. మాయామోహాలు మిగిలి ఉంటే, వాటినీ తొలగించి ముక్తుల్ని చేస్తాడు.సంపూర్ణ ఫలితాలనిస్తాడు.

త్రిమూర్తుల్లో స్థితి కారకుడు విష్ణువు. అదే విషయాన్ని తన కృష్ణావతారంలో పలుమార్లు స్పష్టీకరించాడు. బాల్యంలో చేసిన చేష్టలు, అల్లరి, అందులో భాగంగా రాక్షస సంహారం, అప్పుడు ప్రదర్శించిన అమాయకత్వం- అన్నీ మానవ జీవన వికాసానికి ఆయన వేసిన పునాదులు.

కురుక్షేత్రంలో బంధుమిత్రులందర్నీ చూసి యుద్ధ విముఖుడయ్యాడు అర్జునుడు. ఇంటిముఖం పడుతున్న అతణ్ని కృష్ణ భగవానుడు వారించాడు. ‘దేనికీ నువ్వు కర్తవి కాదు. కర్మవీ కాదు. నీవే కాదు, లౌకికంగా అందరూ కేవలం నిమిత్తమాత్రులు. ఘటనాఘటన సమర్థుడు అంతర్యామి ఒక్కడే’ అని బోధించి, అంతా తానేనన్న సత్యాన్ని ఎరుకపరచి, పార్థుడి మనసును అనేక బంధనాల నుంచి విముక్తం చేశాడు. తననే శరణు వేడాలని ప్రబోధించాడు. ఎవరికి ఎప్పుడు ఎటువంటి సాయం అందించాలో ఆయనకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో కలగజేసుకోవాలో కచ్చితంగా తెలిసి ఉన్నప్పటికీ, ఆ సమయం ఆసన్నమయ్యే వరకు వినోదం చూస్తూనే ఉంటాడు. అందుకే శ్రీకృష్ణుడు ‘లీలావినోది’.

మొసలి నోటికి చిక్కిన గజేంద్రుడు, మొదట అది తననేమీ చేయలేదనుకున్నాడు. విదిలించబోయాడు. కుదరలేదు. బలం ప్రదర్శించాడు. పెనుగులాడాడు. కడవరకూ పోరాడాడు. సాధ్యం కాని స్థితిలో శ్రీహరిని తలచుకున్నాడు. స్వామి సాయపడేలోగా, మళ్లీ తన వంతు ప్రయత్నం కొనసాగించాడు. ద్వైదీభావంతో ఉన్న ఆయన ఓ నిర్ణయానికి వచ్చేలోగానే, గజరాజు ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆశలు వమ్ము కావడంతో ‘నువ్వు తప్ప మరో దిక్కు లేదు. రా. నన్ను రక్షించు’ అని మనస్ఫూర్తిగా శరణు కోరాడు. అప్పుడు తన భక్తుణ్ని రక్షించడానికి భగవంతుడు క్షణమైనా ఆగకుండా పరుగు పరుగున వచ్చాడని భాగవతం చెబుతోంది.

కుచేలుడి విషయంలోనూ అంతే! బాల్యమిత్రుడైన సుదాముడు (అసలు పేరు కుచేలుడు) బహు సంతానం, కటిక పేదరికం- రెండింటితోనూ సతమతమవుతున్నాడని భగవంతుడికి తెలుసు. చేయూతతో అతడి కష్టాలు తొలగించవచ్చని తెలిసినా, అడగకుండా ఏదీ ఎవరికీ ఇవ్వకూడదన్నది ఆయన ఆలోచన. మిత్రుడు దరిచేరేవరకు అతడి పేదరికాన్ని రూపుమాపే ప్రయత్నం చేయలేదు. అడగాలనే ఉద్దేశంతో కృష్ణుడి వద్దకు వెళ్ళడంతో, ఏదీ అడగకుండానే కుచేలుడికి సకల సంపదలూ అనుగ్రహించాడు.

ఇవన్నీ లోకంలో అందరికీ తెలిసిన కథలు. ఇవే కాకుండా- ఇంకెన్నో తెలియని విషయాలూ భాగవతంలో అడుగడుగునా కనిపిస్తాయి. వాటన్నింటి ఉమ్మడి సారాంశం ఒక్కటే. కోరితే గాని ఎవరికీ ఏమీ చేయకూడదని, చేసినా అంతగా విలువ ఉండదని! భక్తుడు తనకు తానుగానే ముందుకు సాగాలని, అప్పుడే కోరుకొనే వాటి విలువ అతడికి తెలుస్తుందని దైవ భావం. ఇలా అనేక విధాలుగా మానవ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే అంశాలు భాగవతంలో కథలు, సంఘటనల రూపంలో గోచరిస్తాయి. అవి ఆ సమయానికి, ఆ కాలానికి మాత్రమే కాదు- ఏ సమయానికైనా, ఏ పరిస్థితులకైనా సరిపోయేవే!

- అయ్యగారి శ్రీనివాసరావు

21-01-2018 ఈనాడుఅంతర్యామికాలాతీతం

‘నువ్వు తప్ప మరెవరూ దిక్కు లేరు’ అనేది శరణాగత స్థితి! భక్తుడు తన ప్రయత్నం తాను చేశాక, ఇక చేయడానికి ఏదీ లేదన్న నిశ్చయానికి వచ్చి శరణు వేడితే - అన్నింటినీ ఆ సర్వాంతర్యామి చూసుకుంటాడంటాయి పురాణాలు. అలాంటి స్థితికి చేరినవారి పట్ల ఆయనకు అపార ప్రేమ, అభిమానం ఉంటాయి.వారి కర్మల్లో కొద్దిపాటి లోపాలున్నా తెలియనివ్వకుండా, వారితోనే ప్రాయశ్చిత్తం చేయిస్తాడు. మాయామోహాలు మిగిలి ఉంటే, వాటినీ తొలగించి ముక్తుల్ని చేస్తాడు.సంపూర్ణ ఫలితాలనిస్తాడు.