పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : ద్విపద భాగవతము ఉపోద్ఘాతము

శ్రీ
రమణమహర్షియేనమః

ఉపోద్ఘాతము.

- : గ్రంథకర్త - మడికి సింగనార్యుఁడు:-

శ్రీపతియొక్క యెనిమిదియవ యవతారమగు శ్రీకృష్ణ భగవానుని చరిత్ర గలది భాగవతమందు దశమస్కంధము. భాగవతమహాగ్రంధమును దెనుఁగు భాషలో విలసిల్లఁ జేసిన మహాకవి బమ్మెరపోతరాజు. ఈ బమ్మెరపోతనార్యుఁడు హూణశకము 1400 మొదలు 1470 ప్రాంతమందుండినట్లు, ఆంధ్ర కవుల చరిత్రలో శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారు చర్చించి యున్నారు. వాసిష్ఠరామాయణ, పద్మపురాణ, భాగవత దశమస్కంధముల కర్త యగు మడికి సింగనార్యుఁడు హూణశకము 1430వ ప్రాంతము వఱకు నైనను జీవించి యుండవలయునని వారు నిర్ధారించిరి. పోతనార్యుని భోగినీదండకము తన 25వ వత్సరమున అనగా 1425వ సంవత్సరమున విరచించినట్లు తెలియుచున్నది. మడికి సింగనార్యుఁడు పద్మపురాణమును దెనిఁగించి ముగించిన వత్సరము దాని కృత్యంత పద్యమువలన స్పష్టమగుచున్నది.

మంగళమహాశ్రీ :-
"ఆ కరయుగానల మృగాంక శకవత్సరములై పరఁగు శార్వరిని బుణ్య
ప్రాకటిత మార్గశిర పంచమిని బొల్చు నడుపాలసుతవాసరము నందున్
శ్రీకరముగా మడికి సింగన తెనుఁగున రచించెఁ దగఁ బద్మ పురాణం
బాకమల మిత్ర శిశిరాంశువుగఁ గందసచివాగ్రణికిన్ మంగళ మహాశ్రీ.. . .

(కర - 2 యుగ=4 అనల=3 మృగాంక+1 అంకానాం వామతోగతిః. కాబట్టి శాలివాహన శకము 1342. హూణశకము 1420 శార్వరి సంవత్సరమున మార్గశీర్ష శుద్ధ పంచమీ బుధవారమునాఁడు పద్మపురాణము ముగింపఁబడెను.)

దీనిని బట్టి పర్యాలోచించి చూచిన మడికి సింగనార్యుఁడు ప్రౌఢావస్థ యందున్న సమయమందు పోతనార్యుని భోగినీదండకము పుట్టినదని నిర్ణయించుటకు వీలున్నది. అప్పటికింకను పోతనార్యుఁడు భాగవతమును దెనిఁగించుటకుఁ బూనుకొని యుండలేదు.

"వాసిష్ఠ రామాయణము పద్మపురాణమునకుఁ దరువాత రచయింపఁబడిన దగుటచే నది 1420కిఁ దరువాతఁ జేయఁబడినది. ఈ రెండుకావ్యములకు నడుమ సింగన్న భాగవత దశమస్కంధమునుఁ గూడఁ దెనిఁగించి కందనామాత్యునికే అంకిత మొనరించెను. సింగన కృత భాగవత దశమస్కంధము నాకు లభింపలేదు. అటుతరువాత నీకవి సకల నీతిసమ్మతమను నీతిగ్రంథమును సమకూర్చె నని రామకృష్ణ కవిగారు చెప్పుచున్నారు. వీటినన్నిటిని విచారించి చూడఁగా మడికి సింగన్న 1430వ సంవత్సరము వఱకైనను జీవించి యుండును. [ఆంధ్ర॥ కవు॥ చరి॥ ప్ర॥ భా॥ 378 పుట]

మడికి సింగనార్యుఁడు 1420కిఁ బూర్వమే భాగవత దశమస్కంధమును రచించినట్లు తెలియుచున్నది. కాఁబట్టి పోతనామాత్యుని భాగవతమునకు ముందుగా రచింపఁ బడినది మడికి సింగనార్యుఁని భాగవత దశమస్కంధ మనుటలొ సందేహముండదు.

సింగన్న నియోగి బ్రాహ్మణుఁడు భారద్వాజ గోత్రుఁడు. అయ్యల మంత్రివరునకును సింగాంబికకును జన్మించినవాఁడు. సింగన్నకృతమగు వాసిష్ఠ రామాయణములోని యీక్రింది పద్యములను గమనింపుడు.

సీ॥
"అతండు తిక్కనసోమయాజుల పుత్రుఁడై; కొమరారు గుంటూరి కొమ్మ విభుని
పుత్రి చిట్టాంబిక బుధలోక కల్పక; వల్లి వివాహమై వైభవమున
భూసారమగు కోటభూమిఁ గృష్ణానది; దక్షిణ తటమున ధన్యలీల
నలరు రావెల యను నగ్రహారము తన; కేక భోగంబుగా నేలుచుండి

యందుఁ గోవెల గట్టి గోవిందు నెన్న
గోపీనాథుఁ బ్రతిష్టయుఁ గోరి చేసి
యఖిల విభవములందును నతిశయిల్లె
మనుజమందారుఁ డల్లాడ మంత్రివిభుఁడు.

క॥ "అయ్యువతీరమణులకును
నయ్యల మంత్రీంద్రుఁ డుదితుఁడై ధారుణిలో
నెయ్వెడ నర్థార్థులు మా
యయ్య యని పొగడఁగ నెగడె సౌదార్యమునన్.

సీ॥ ఆత్రేయ గోత్రపవిత్ర పేరయమంత్రి; పుత్రి సింగాంబికఁ బుణ్యసాధ్వి
వెలయ వివాహమై వేఁగి దేశంబులో; నేపారు రాజమహేంద్ర పురికి
నధిపతి తొయ్యేటి యనపోత భూపాలు; మంత్రియై రాజ్యసంపదఁ బొదలి
యొప్పారు గౌతమి యుత్తర తటమున; మహనీయమగు పెద్దమడికి యందు

స్థిరత రారామతతులు సుక్షేత్రములును
బెక్కులార్చించి సితకీర్తి బెంపు మిగిలి
యఖిలజగదన్నదాతనా నవనిఁ బరఁగె
మధుర గుణధుర్యఁ డయ్యల మంత్రివరుఁడు

చ॥ ఒనరఁగఁ దద్వధూవరు లహోబలదేవునిఁ గొల్చి తద్వరం
బున నొగి సింగనార్యుని నమోఘ గుణాఢ్యు ననంతుని న్మహీ
జననుతు నబ్బయాంకు బుధసన్నుతి పాత్రుని నారయాహ్యయున్
గని నరసింహ నామములు గారవ మారఁగఁ బెట్టిరందఱున్.

క॥. వారలలో నగ్రజుఁడను
వారిజదళనయనచరణవారిజసేవా
సారమతి నతులవాక్య
శ్రీరచనాచతురమతిని సింగమహ్వయున్.

పై పద్యముల వలన నీ కవి తిక్కనసోమయాజుల మనుమరాలి మనుమఁడనియు, గోదావరి మండలములోని పెద్దమడికి నివాసుఁడనియు, స్పష్టమగుచున్నది. ఈ విధముగాఁ దర్కించి చూచినపుడు మడికి సింగనార్యుఁడు 15వ శతాబ్దపు కవియని నిర్ణయించుటలో సందేహమునకుఁ దావు లేదు.

ప్రస్తుత పరిష్కరణమైన భాగవత దశమస్కంధము మడికి సింగనార్యుని కృతమా కాదా యనునది చర్చింప వలసియున్నది. అనేక ప్రబల నిదర్శనములపై నేను ద్విపద బద్ధమైన యీ భాగవత దశమ స్కంధము మడికి సింగనార్య కృతమను నిశ్చితాభిప్రాయమునకు వచ్చితిని. కాండాంతద్విపదలను గమనింపుడు.

ద్విపద.
"అని ఇట్లు నయనిర్జరామాత్యుపేర
ధన ధాన్య మణిమయ దానాఢ్యు పేర
భూభరణక్షమ భుజసారుపేర
నౌభళ మంత్రి కందామాత్యు పేరఁ
గోరి భరద్వాజ గోత్ర సంజాతుఁ
డారూఢ మతి నయ్యలార్య నందనుఁడు
శృంగార రసకళా శ్రితివచోధనుఁడు
సింగయామాత్యుఁడు చెలువగ్గలింప
సలలితరసభావ శబ్దగుంభనల
మహానీయమగు దశమస్కంధ సరణి
విహితలీలలనొప్పు విష్ణుచరిత్ర
ప్రాకటంబగు మధురాకాండమనిన
నాకల్ప మాకల్పమగు భంగిఁజెప్పె.. . .

భరద్వాజగోత్రసంజాతుఁడును, అరూఢమతి యయ్యలార్య నందనుఁడును నగు సింగయామాత్యుఁడు ఔబళమంత్రి కందామాత్యున కంకితముగా నీభాగవతదశమస్కంధమును రచించినట్లు స్పష్టము: మడికి సింగనామాత్యుఁడు రచించిన వాసిష్ఠరామాయణము యొక్క ప్రారంభమున నొక వచన భాగమును దిలకింపుడు.

"అని సకలజన సమ్మతంబుగా నుపక్రమించి భాగవత దశమస్కంధంబును దెనుంగున రచియించి యిచ్చి, అప్పుణ్య పురాణంబులకుఁ గృతిపతిగా నేపుణ్యునిఁ బ్రార్ధింతునో యని విచారించి, గజగంధవారణగంధ గోవాళ చలమర్తి గండగండరాయ గజశేఖరదొంతి మన్యవిభాళాది నానాబిరుదవిఖ్యాతులఁ బ్రసిద్ధుండగు రామగిరి పట్టణాధీశ్వరుండైన కుమారముప్ప భూపాలు మాన్యమంత్రి పదదురంధురుండగు నమ్మహారాజు దిగంతవ్యావృత కీర్తిలతాలవాలుండును, ధర్మచారిత్రుండును, నీతిచాతుర్య విశేషగుణగణాలంకారుండును, అనవరతదాన శీలుండును, అఖిల దిక్పరీతవిశాలుండును, వారణ వంశాబ్ధిసుధాకర కాశ్యపగోత్రపవిత్ర అబ్బనాచార్య తనూభవ కందనామాత్యుండు నాకు నతిస్నేహ బాంధవుండును నభీష్ట ఫలప్రదుండును నపూర్వవచనరచనానుబంధురకావ్య రసాభిజ్ఞుండును, అర్థిజన పారిజాతంబును గావున నమ్మంత్రి యుగంధరుం గృతిపతిగావించి, వెండియు కవిత్వత్త్వ రచనా కౌతుకంబున జిత్తంబు జొత్తిల్ల నొక్క కృతిఁ జెప్పంబూనితి . . . . . . . . . . . . . . . .

రామగిరి పట్టణాధీశ్వరుండగు కుమారముప్ప భూపాలుని మాన్యమంత్రియైన కందమాత్యునకుఁ గవి భాగవత దశమస్కంధమును దెనిఁగించి యంకితమొనర్చినట్లు ఈవ చన భాగమునుండి స్పష్టమగుచున్నది. ప్రస్తుత పరిష్కరణము యొక్క కాండాంత పద్యములందు కననగు కృతికర్త కృతిభర్తల నామగోత్రాది వివరములును, వాసిష్ఠరామాయణ పద్మపురాణములయొక్క కృతికర్త కృతిభర్తల నామగోత్రాది వివరములును నచ్చొత్తినట్లు సరిపోయి యున్నందున భాగవతదశమస్కంధము (ప్రస్తుతపరిష్కరణము) మడికి సింగనార్య కృతమనుటలో సందేహముండదు. తెనుఁగు జాతీయతను బోషించు శైలిని బట్టి చూచినప్పుడును భాగవతదశమస్కంధము, వాసిష్ఠరామాయణము, పద్మపురాణము ఈ మూఁడును నేకకవికృతములను సత్యము నుద్ఘాటించుచున్నవి.

వాసిష్ఠరామాయణ పద్మపురాణములను పద్యకావ్యములుగా రచించిన మడికి సింగన్న భాగవత దశమస్కంధమును మాత్రమేల ద్విపదకావ్యముగా విరచించెను? శ్రీకృష్ణభగవానుని లీలలను వీనుల విందుగాఁ బండిత పామరులందఱును, ఆబాలగోపాలము పాడుకొని యానందించుటకు వీలగునట్లు సరళమైన జాతీయగీతమగు ద్విపదలలో నిమడ్చి రచియించుట మంచిదని యుచితజ్ఞుండగు కవి తలంచి యట్లొనరించెనని తలంచెదను. అదియునుగాక క్రీ.శ. 1240వ ప్రాంతమున రచించపఁ బడిన రంగనాథరామాయణముయొక్క సకలజనాదరణమును విచారించి కవి తాను గూడ నట్టి కావ్యమును రచింప నుత్సహించి భాగవత దశమస్కంధమును ద్విపదబద్ధము గావించెనేమో!

-: కృతిభర్త - కందామాత్యుఁడు: -

మడికి సింగనార్యుఁడు భాగవతదశమస్కంధమును, పద్మపురాణమును దెనిఁగించి ఔబళ కందామాత్యునకుఁ గృతిగా నిచ్చి యున్నాఁడు. పద్మపురాణమందుఁ గృతిపతిని వర్ణించు పద్యము లీక్రింది విధముగా నున్నవి.

సీ॥
స్వామి భక్తుఁడు కార్యచతురుఁడు బహుకళా; వేది నీతిజ్ఞుఁడు విప్రహితుఁడు
సరస సల్లాపుఁడు సప్తాంగరక్షణ; క్షముఁడు భావజ్ఞుఁడు సర్వసులభుఁ
డరి మంత్రభేదన పరుఁడు ధర్మాత్ముఁడు; సుందరాకారుఁడు సుజనవినతుఁ
డురుదయాపరుఁడు నిత్యోత్సవాసక్తుండు; సద్గుణాధారుండు సౌమ్యమూర్తి

సతత గురుదేవతా పరిచారరతుఁడు
గుణసముద్రుండు కాశ్యప గోత్రజనితుఁ
డనఁగ నుతికెక్కి పెంపున నతిశయిల్లు
మదన సదృశుండు కందన మంత్రివరుఁడు.

సీ॥ ఈ ధర్మచారిత్రు నేధాత్రిపతి యేలు; నాధాత్రిపతి యేలు నఖిల జగము
నీకామినీకాము నేకామినులు చూతు; రాకామినులు చూడ రన్యపురుషు
నీయర్కనుతతుల్యు నేయర్థి గొనియాడు; నాయర్థి యెరువేఁడ నాస సేయఁ
డీమంత్రి కులచంద్రు నేమంత్రి వురణించు; నామంత్రి విముఖాత్ముఁడఖిలమునకు

ననఁ బ్రగల్భరూపఘనదాననయమార్గ
ముల నుతింప నొప్పు ముజ్జగములఁ
దారహారహీరధవళాంశుసమకీర్తి
కలితుఁ డౌబళ కందవిభుఁడు.

కందన మంత్రికిఁ దాతకుఁ దాతయైన గన్నయ మంత్రి కాకతీయ గణపతిదేవుని కాలములో నుండినట్లు పద్మపురాణములోని యీక్రింది పద్యము చెప్పుచున్నది.

చ॥
"పరువడిఁ గాకతీయ గణపతి నాయకు నొద్ద మాన్యుఁడై
ధరణిఁ బ్రశస్తుఁడై నెగడి దానములెల్లను జేసి భక్తి పెం
పిరవుగ గుళ్ళు గట్టి గణపేశ్వర దేవుని గోపికాధిపున్
దిరమగుచున్న లక్ష్మిని బ్రతిష్ఠలు చేసెఁ బ్రభుత్వమేర్పడన్. . . .
కృతిపతి కందామాత్యుని వంశవృక్షము నిచ్చుచున్నాను.

గన్నయమంత్రి
|
|
మల్లన
|
|
గణపతి
|
|
అప్పయామాత్యుఁడు (ద్వితీయ పుత్రుఁడు)
|
|
కందనమంత్రి
(మూఁడవ కుమారుఁడు కృతిభర్త)

కాకతీయ గణపతిరాజు క్రీ.శ. 1200 మొదలు 1260 వఱకును రాజ్యపరిపాలన చేసెను. దీనినిఁ బట్టి శ్రీ వీరేశలింగము పంతులుగారు తరమునకు నలుబదేసి సంవత్సరముల చొప్పున నేర్పఱచి కందనమంత్రికాలమును 1420 గా లెక్కవేసిరి. 1420వ సంవత్సరమునఁ బద్మపురాణమును గందనమంత్రి కృతినందుట దీనికి సరిపోయినది.

మడికి సింగనార్యుఁడు తాను మొదట రచించిన పద్మపురాణ భాగవతదశమ స్కంధములను నరాంకితము చేసెను. కాలక్రమమున నతని చిత్తవృత్తి దైవపరాధీనమగుట బట్టి కాఁబోలును దన మూఁడవ కృతియగు వాసిష్ఠరామాయణమును అహోబలస్వామి కంకితమొనర్చెను. తనకు ముందుండిన నన్నయాది యాదిమ కవీశ్వరుల యాచారము ననుసరించి కృత్యాదిని గీర్వాణభాషాబద్ధమగు శ్లోకమును వేసుకొనెను. వాసిష్ఠరామాయణము యొక్క ఆదిమ శ్లోకమును చూడుడు.

"శ్రీమద్దివ్యమునీంద్రచిత్తనిలయం సీతామనోనాయకం
వల్మీకోద్భవ వాక్పయోధిశశినం స్మేరాననం చిన్మయం
నిత్యం నీరదనీలకాయ మమలం నిర్వాణ సంధాయినం
శాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రంభజే. . . .

ఇవిగాక మడికి సింగనార్యుఁడు "సకలనీతిసమ్మత. . . మను నీతిశాస్త్రమును రచియించెను. సకలనీతిసమ్మతమును శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు ప్రచురించినట్లు తెలియుచున్నది. దీనిలోని కొన్ని పద్యములను కీర్తిశేషులైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, ఈ గ్రంధాలయము తరఫున మద్రాసు ప్రభుత్వసహాయముచేఁ బ్రచురింపఁబడిన "ఆంధ్రకామందుకము. . . యొక్క వీఠికలో నుదహరించి యున్నారు.

ఈ విధముగా సంస్కృతాంధ్రములందసాధారణ పాండిత్యము కలవాఁడును, నీతి వేదాంతశాస్త్రము లందభిరుచి కలవాఁడును, మహాకవియు నగు మడికి సింగనార్యుని ప్రభావంతమైన అమృతవాహిని యగు లేఖిని పండిత పామర రంజక మగు ద్విపదలచే భక్తజనమందార మగు భాగవత దశమస్కంధమును రచించి, ఆంధ్రసారస్వతమునకు మహత్తర మగు సేవ యొనరించినది!

--: పరిష్కరణ - కథా విభాగము: -

తంజావూరు సరస్వతీమహల్ లైబ్రెరీ నెం 150 తాళపత్రప్రతి, ఈ పరిష్కరణకు మాతృకయై యున్నది. ఇట్టి ప్రతిగాని, ఇతోధికప్రతిగాని వేఱే ఎచ్చటను లేనందున నేను గావించిన సంస్కరణము పూర్తిగా నీతాళపత్ర ప్రతిపైననే యాధారపడి యున్నది. దీనియందు 180 తాళపత్రములున్నవి. వ్రాత సుమారుగా నున్నను, తప్పులు విశేషముగా దొర్లియున్నవి. అక్రూరుడు శ్రీకృష్ణభగవానుని స్తుతించు ఘట్టమునుండి యారంభమగుచున్నది. మొదటి నాలుగు పత్రములు కీట దష్టములు: అక్షరముల యాకారము బొత్తిగా నశించియున్నది.

కవి భాగవత దశమస్కంధము యొక్క పూర్వోత్తర భాగములను కాండ సంజ్ఞలతో విభజించుకొని యున్నాడు. దశమస్కంధపూర్వభాగము కంసుడు తన చెల్లెలు దేవకిని వసుదేవునితోఁ గలిపి రథారూడులఁ జేసి మంగళతూర్యనినాద వైభవములతో భర్తృగృహమునకుఁ దానే సారథియై రథమును నడుపుటతో నారంభించుచున్నది. తరువాతి కథయగు నాకాశవాణి కథనము, శ్రీకృష్ణావతార ఘట్టము, నందగోపుని యింట శ్రీకృష్ణుని బాల్యము, పూతనాది రాక్షసమథనము మొదలగువాని నన్నిటిని నొక కాండములో కవి రచించి యుండునని నాయూహ. ఆ కాండము దురదృష్టవశముచే ఖిలమైపోయి యుండునని తలంచెదను. ప్రస్తుత పరిష్కరణ ప్రతి రెండవకాండమగు మదురాకాండముతో ప్రారంభమగుచున్నది. ఇది జరాసంధుని రెండవమారు దండయాత్ర కథతో నంతమొందుచున్నది. ఈ కాండము యొక్క మొదటిభాగము కొంత లుప్త మై పోయినది.

కల్యాణ జగదభిరక్ష కాండములలో నుత్తరభాగ కథలు చెప్పఁబడినవి. శ్రీకృష్ణుని వివాహములు, ఈ కాండల యందు వర్ణింపఁబడినవి. జగదభిరక్షకాండము శిశుపాల వధతో నిలచిపోయినది. ఇఁక నుత్తర భాగ కథలగు సాల్వమథనము, దంతవక్త్రసంహారము, కుచేలోపాఖ్యానము, సుభద్రా పరిణయము మొదలగునవి వివరించుచు మఱియొక కాండమును గూడ కవి రచించియే యున్నాఁడని నాధృడాభిప్రాయము. దుర్భాగ్యవశముచే నదియు మనకు లభింపలేదు. "అని సకలజనసమ్మతంబుగా నుపక్రమించి భాగవత దశమస్కంధంబును దెనుఁగున రచియించి యిచ్చి . . . . . . .. . . అని వాసిష్ఠరామాయణములో వ్రాసి యుద్ఘాటించిన మడికిసింగనార్యుఁడు కొంతభాగమునే వ్రాసినాఁ డని చెప్పుట యుక్తమగునా?

కొన్నిచోట్ల గ్రంథాంతరమందు ద్విపదలలో నేకపాదము లున్నవి. ఇవి గ్రంథపాతములేమో యని మొదట నేను శంకించితిని. కాని పరిశీలించి చూచినప్పుడు అన్వయము చెడకుండ కథాభాగము నడుచుచున్నందున నా యేకపాద ద్విపదలనట్లే పూర్తి ద్విపదల క్రిందనే లెక్కించి వేసితిని. ఇట్టి లుప్తపాదములు కల శ్లోకభాగములు పూర్వగ్రంథములలోఁ బెక్కు లుండుట సహజమే.

విజ్ఞాననిధి యగు మహాకవి సింగనార్యుని విరచితమైన దీనిని పరిష్కరించుటలో నాయల్పీయమగు బుద్ధిని సాధ్యమైనంతవఱకు నరికట్టి మిక్కిలి శ్రద్ధగానే యుపయోగించితిని. యుక్తి కందుబాటులో నున్నట్టి కొన్ని లుప్తభాగములను బూరించి కుండలీకరణముగావించి పాఠకులకుఁ జూపి యున్నాను. వ్రాయసకాని ప్రమాదముచే నేర్పడిన గణభంగములను సవరించితిని. ఈ సవరణ కవిహృదయమునకు భంగముండదని విమర్శన జ్ఞానముతోనే చేయఁబడినదని మనవి చేసుకొనుచున్నాను. అన్వయము సరిగా కాని కొన్ని ద్విపద భాగములను సరిదిద్దిన పూర్తిగా క్రొత్తరూపము సిద్ధించునని తోచిన చోట్ల యథా మాతృకముగానే విడిచి వేసితిని.

బురదలో మాణిక్యమువలె, గుణగ్రాహకుల దృష్టికి మఱుఁగుపడి, ఈ ద్విపదకావ్యము సరస్వతీమహల్ లైబ్రరి అలమారలలోఁ బడియుండినది. దాని యునికిని, శ్రేష్టతను నాకెఱుక పఱచినవారు మన్మిత్రులును, బహుగ్రంథ ద్రష్టలును, విద్యానిధులును నగు బ్రహ్మశ్రీ నిడదవోలు వెంకటరావుగారు M. A. (Head of the Telugu Department Madras University) వారికి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతాభివందనము లర్పించు కొనుచున్నాఁడను.

-- -: రచన: --

శ్రీ మద్భాగవతము లో రసవంతమైనభాగము దశమస్కంధము. దీనిని సంగ్రహించి తెనుఁగు చేయుటలో మడికి సింగనార్యుఁడు కవితాశక్తితో పాటు విషయములను బెంచియో, క్లుప్తపఱచియో ఘట్టములను బ్రతిపాదించుటలోఁ దన విమర్శనా జ్ఞానమును జూపి యున్నాడు.

తెనుఁగు సారస్వతరథ మొక్కొక్క శతాబ్దము నందొక్కక్క పోకడను గల్గి సాగినది. నన్నయాదుల కాలము ప్రాయికముగా సంస్కృతములోని పురాణేతి హాసములను దెనుంగు భాషలో ప్రచారమునకుఁ దీసుకొని వచ్చునదిగానుండెను. పెద్దనాదుల కాలమందు దెనుఁగు సారస్వతముయొక్క పోకడ మారినది. ఒక చిన్న కథా వస్తువునుఁ దీసుకొని పెంచి వన్నెలు చిన్నెలు దిద్ది స్వతంత్రముగాఁ బ్రబంధ రచన యాకాలమందు సాగినది. తరువాతికాలపు కవులు రెండు విధములైన పోకడలను ననుసరించుటలోనే నిమగ్నులై యుండిరి. ప్రతిభావంతులగు మహాకవులందఱును భాషాంతరీకరణము నందును, శృంగారాది వర్ణనలయందును నిమగ్నులై తమ యమూల్యమైన భాషాజ్ఞానమును గవితాశక్తిని చెక్కడపు పనులతో నగిషీకూర్చిన చక్కని పెట్టెలలో నిమడ్చి బంధించిరేకాని స్వేచ్ఛగా నడచుట కవకాశ మిచ్చినవారు కారైరి! వారు తమతమ నాయకానాయికల వర్ణనలయందు చాతుర్యమును జూపుటలోఁ గన్పఱచిన కవితా శక్తిని ఆయాయీ కాలములందుండిన దేశీయ జీవన ప్రతిపాదకములగు విషయము లందుఁ గన్పఱచి యుండినచో నాంధ్రభాషాయోష సర్వాంగ సుందరియై యుండును గదా! ఈ విషయములో నన్నయాదుల భాషాయుగమే కొంతమెఱుఁగని నాస్వాభిప్రాయము. ఏలనన భారతభాషాంతరీకరణము తెనుఁగు జాతీయ కవిత్వమును బోషించుటయే గాక మానవ జీవితమున కావశ్యకములగు యనేక యుపాఖ్యానములతోఁ జదువుచున్నకొలఁది చదువవలయునని యాసక్తిని గల్గించునదిగా నున్నది.

మడికి సింగనార్యుఁడు నన్నయాదులయొక్క పోకడ ప్రధానముగాఁ గల్గిన కవిసత్తముఁడు. ఇతఁడు నన్నయ తిక్కనలఁ దక్క నెవరిని స్తుతి యొనరించినవాఁడు కాఁడు.

గీ॥
వ్యాస వాల్మీక శుక కాళిదాస బాణ
హర్ష ణాదుల నాఢ్యుల నాత్మనిలిపి
సకలభాషా రసజ్ఞుల సముల నన్న
పార్య తిక్కన కవీంద్రుల నభినుతింతు.

(వాసిష్ఠరామాయణము)

తెనుఁగు జాతీయ కవిత్వమును బాగుగాఁ బోషించి, దీర్ఘములగు సంస్కృత సమాసములను దొర్లించి విసువుఁ బుట్టించక భాగవత దశమస్కంధ రచన యింపుఁ గల్గించునదై యున్నదన్నచో సత్యదూరము కాదు. కవి స్వాభిమానము కలవాఁడు. తన శక్తిని బాగుగాఁ గుర్తెఱిఁగిన వాఁడు.

క॥
ఆపరమేశ్వర మకుట
వ్యాపిత గంగాప్రవాహ కవితా స
ల్లాపుఁడగు మడికి సింగనఁ
జేపట్టక కీర్తిగలదె శ్రీమంతునకున్

. (పద్మపురాణము)

కవి గొప్పభక్తుఁడు. వేదాంత శాస్త్రమందభిరుచి కలవాఁడు. కాఁబట్టి సాక్షాత్ లక్ష్మీదేవి యవతారమగు రుక్మిణిని వర్ణించు సందర్భమునందు స్తోత్రసాహిత్య ఫక్కీని పాదాదికేశాంత వర్ణన జేసి యున్నాఁడు.

ద్వి॥.
"ఉచ్చిత పండ్లతో నుల్లసంబాడు
నచ్చపలాక్షికి నంగుష్ఠచయము;
పదనఖద్యుతుల నుపచరించు నెలవుఁ
గదియ మౌక్తికములుఁ గట్టి నట్లుండు;
తనరు గచ్ఛప నిధిద్వయ మింతి పాద
వనజాతముల మీఁద వ్రాలెనో యనఁగ;
గమనజాడ్యము శుభాకరమును నగుచుఁ
గమనీయలీల మీఁగాళ్లొప్పు సతికి;
పగడంపుఁ దీగల పంక్తులో యనఁగ
మగువకు నొప్పారు మడిమల తీరు;
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

(ద్వి॥భా॥పుట72)

విష్ణుశక్తియగు రుక్మిణీదేవి వర్ణనము శ్రీకృష్ణుని వద్దకు దూతగా వెళ్ళిన బ్రాహ్మణుని నోట నుండి వచ్చునప్పుడు చితజ్ఞుఁడగు కవి చూపిన మర్యాదను, బ్రాహ్మణుఁడు రుక్మిణీదేవి యొక్క యభిప్రాయమును రసికాగ్రేశరుఁడగు శ్రీకృష్ణుని యెదుట ప్రతిపాదించిన నేర్పును గమనింపుడు.

ద్వి॥
"అనఘాత్మ! భీష్మకుండను విదర్ఛేశు
తనయ రుక్మిణి యను ధవళతాక్షి
తనుమధ్య యుత్పుల్ల తామరసాక్షి
గరుడ కిన్నర యక్ష గంధర్వ సతులు
దొరయలేరా యింతితో నీడుఁబోల్ప;
దేవర సౌభాగ్య దివ్యవర్తనలు
వావిరి జను లెల్ల వర్ణింపుచుండ
విని పుష్పధన్వుని విషమబాణములు
యనవొందఁ దనువున నట నాటుటయును
జిత్తంబులో నీదు చెలువైన మూర్తి
చిత్తరు వొత్తిన చెలువంబుఁ దోఁపఁ
జింతించు వెఱఁగందు చేష్టలు మఱచు
నంతకంతకు నిన్ను నభిమతి సేయు
విరహాగ్ని శిఖిఁ గ్రాఁగు వెలవెల నగుచు
మరులెత్తినట్లు పల్మరు చిన్నఁబోవు
నీభంగి నున్న యీ యిభరాజ గమనఁ
బ్రాభవంబునఁ జైద్యపతి పెండ్లియాడ
నెల్లుండి చనుదెంచు టెఱిఁగి యాయింతి
యెల్ల విధంబుల నిది నీకుఁ జెప్పి
పుత్తేర వచ్చితిఁ బుండరీకాక్ష!
చిత్తంబులో నొండు చింతింప నేల
ఆభామ నిజభార్యయై యుండునట్టి
సౌభాగ్య మెవరికి సమకూరు? నీవు
నారుక్మిణిబ్బంగి నాసలు సేయు
కారుణ్యమూర్తివి కమలాక్ష! నిన్నుఁ
గదసి నీదరహాస కౌముదిఁ గ్రోల
ముదిత నేత్ర చకోరములు చేరఁగోరు
నలవడి నీప్రయాణాంబువులోపఁ
గలకంఠి చాతకి కడువేడ్క సేయు
నీవెటులైనను నేచిన వేడ్క
నావెలందుక నేలుటది నీకు నొప్పు;
నిను నమ్మియుండిన నెలఁతుక నొకఁడు
కొనిపోవగాఁ జూడఁగూడునే నీకు?. . .

మొదట శ్రీ రుక్మిణి యొక్క నామ వంశాదికమును జెప్పి యాదవాన్వయవంశమణియగు శ్రీకృష్ణుని వరించుటకుఁ దగిన యోగ్యతను నిరూపించెను. తరువాత దక్షిణనాయకుఁడైన శ్రీకృష్ణుని చిత్తము నాకర్షించుటకై యువజనాకర్షములైన తనుమధ్యత్వము, యత్ఫుల్లతామరసాక్షులు, దేవకన్యలతో గూడ నీడుఁబోల్పగారాని లావణ్యము మృదువుగాను క్లుప్తముగాను నాటునట్లు వాక్రుచ్చెను. పిమ్మట సమస్తగుణగణములతో విరాజిల్లు శ్రీకృష్ణునియందు ఆమెకున్న మోహపాశమును వివరించెను. శ్రీకృష్ణుని విరోధి యామెను బెండ్లాడ నిశ్చయమైనందున దనరాకకు ముఖ్యకారణమని నొక్కి చెప్పెను. కొసకు "ఆభామ నిజభార్యయై యుండునట్టి సౌభాగ్య మెవరికి సమకూరు?. . . అని ప్రశ్నించి శ్రీకృష్ణుని యుత్సాహమును రేకెత్తించెను. చూచితిరా కవి చాతుర్యము! చాతుర్యముతోపాటు కవితాధార మిట్టపల్లములులేని నడకతో సొంపుగా సాగెడు తీరును గమనింపుడ!

అదే సందర్భమందుఁ బోతనార్యుని వర్ణన యించుక గమనింపుడు.

సీ॥
"పల్లవవైభవస్పదములగు పదములు; కనకరంభాతిరస్కారు లూరు
లరుణప్రభా మనోహరములు గరములు; కంబు సౌందర్యమంగళము గళము
మహితభావాభావ మధ్యంబు మధ్యంబు; చక్షురుత్సవదాయి చన్నుదోయి
పరిహసితార్ధేందు పటలంబు నిటలంబు; జితమత్త మధుకర శ్రేణి వేణి

భావజాశుగముల ప్రావులు చూపులు
గుసుమకరుని వింటి కొమలు బొమలు
చిత్తతోషణములు చెలువ భాషణములు
జలజనయనముఖము చంద్రసఖము. . . .

వెలలేని ఈపద్యరత్నము నెంతకొనియాడినను దనివి తీరనిది. కాని స్థానము చెడి శోభింప లేకున్నది. దూత్యముఁ జేయబోయిన బ్రాహ్మణుఁడిట్లు వర్ణించుట సందర్భోచితము కాఁజాలదు. ఈ సందర్భమునందు సింగనార్యుని రచనయే స్వాభావికమై యింపును గూర్చినదిగా నున్నది.

సౌధవర్ణన, ఋతువర్ణన, యుద్ధవర్ణన మొదలగునవి కవి చాలా చోట్ల చేసియున్నాఁడు. ప్రబంధములలో విసుగు పుట్టించు ఘట్టములిట్టి వర్ణనాడంబరములే యగును. అయినను జతురుఁడగు నీ కవి పాఠకుల కా భాగము లందు వినోదమునే కలిగించి చరితార్థుఁడయ్యెను. మచ్చునకు కొన్ని యెత్తి చూపించుచున్నాను.

పురస్త్రీలు శ్రీకృష్ణబలరాములను జూచి వారిలో వారు మాట్లాడుకొనుటను దిలకింపుడు.

"ఈతఁడే, ఎలనాగ! ఇసుమంత నాఁడు
పూతన (పాల్ ద్రావి) పొరిఁగన్నవాఁడు,
"సకియరొ! ఈతండే, శకటమై వచ్చు
ప్రకట దానవుఁ ద్రుళ్ళిపడఁ దన్నినాఁడు.
ముద్దియ! ఈతఁడే మొగి ఱోలుఁ ద్రోచి
(మద్దియలు)డిపిన మహనీయ యశుఁడు
అక్కరో! ఈతఁడే యఘదైత్యుఁజీరి
కొక్కెర రక్కసుఁ గూల్చిన వాఁడు
గోవర్ధనముఁ గేల గొడుగుగాఁబట్టి
(గోవులదే)ర్చిన గోవిందుఁ డితఁడె.
కొమ్మ! ఈతఁడే పిల్లగ్రోవూది వ్రేతఁ
గొమ్మల గడు వెఱ్ఱిఁ గొలిపిన వాఁడు.. . .

కవి శ్రీకృష్ణుఁడు బలరామునితోఁ గలసి కంసుని కొలువు కూటములో ప్రవేశించు సందర్భమున, శ్రీకృష్ణుని స్వరూపమును గుణగణములతోసహా పాఠకుల కంటిముందఱ నెంత మనోహరముగాఁ జిత్రించుచున్నాడో చూడుడు!

"కరిమదరక్త పంకములచే మేన
దొరగెడు ఘర్మ బిందువులును నరయ
హరిమేను చిత్రవనాంబుద మనఁగ
నరుదారఁ జూపట్టె నందంద చూడ;
గజదంతములుఁ దాను కామపాలుండు
భుజశిఖరంబులఁ బొలువందఁ దాల్చి
దారుణతర దండధర్మయుగ్మమనఁగ
గౌరత మల్లరంగము సొచ్చి నిలువఁ
గోరి మల్లులకెల్ల కులిశమై, ప్రజకు
ధారుణి నాథుఁడై, తల్లిదండ్రులకుఁ
బసి బాలుఁడై యొప్పు, పంకజాక్షులకు
నసమాస్త్రుఁడై, వల్లవాళికి నెల్లఁ
బరమాప్తుఁడై, యతిప్రతతికి నెల్లఁ
బరతత్త్వమూర్తియై, బంధు సంతతికి
దైవమై, రౌహిణీతనయుఁడు దాను
నావిష్ణుం డరుదెంచె నందఱుఁజూడ.. . .

శ్రీకృష్ణుని రూపును వర్ణించు కొన్ని ద్విపదలు చిత్రకారులకుంచెకు రసాయనమై ప్రోత్సాహమును గల్గించునదిగా నుండుట జూడుడు!

"నల్లని మే నున్నతమైన యురము
దెల్లదమ్బుల మించు తెలి గన్నుగవయ
నెరిజడ చొళ్లెము నిటల రేఖయును
జిరునవ్వు మోమును జేత వేణువును
పాయక జగిమించు పసిఁడి చేలయును
దలఁబురిపెనవు కదంబ మంజరియు
ధళధళ వెలిఁగెడు దంతధీధితియుఁ
గలరూపు మోమున గట్టినట్లుండు.. . .

ఈ విధముగా వివిధమైన మనోహరవర్ణనలతోను, ఇంపును గూర్చు స్వభావోక్తులతోను, చక్కని తెనుఁగు నడకతోను, నాతి దీర్ఘములగు మధురమైన సమాసములతోను శ్రీకృష్ణుని చరిత్ర ద్విపదబద్ధముఁ గావించి మహాకవియగు మడికి సింగనార్యుఁడు భాగవత దశమస్కంధమును మాట్లాడు చలన చిత్రముభంగి పాఠకుల దృష్టిపథమునకుఁ బ్రదర్శించి ధన్యుఁడయ్యెను!

--:కొన్ని వ్యాకరణాంశములు :-

1. సంధి:- "పరిమార్చినతఁడు. . . "రుక్మిణిబ్బంగి. . . ఇత్యాది సంధిరూపములక్కడక్కడ కన్పడుచున్నవి. ఇట్టిసంధులు భాషలో విరణములు. మహాకవుల సమ్మతములే. "తామరసనేత్రలిండ్లు. . . "మా భక్తులొద్ద. . . "ఇతరులిండ్లు. . . ఇట్టి ప్రయోగము లనేకములున్నవి.

2. "హరుషనిర్భర చిత్తుఁడై పలికె నతఁడు. . .

ఇచ్చట "హర్ష. . . అను పదమును విడదీసి "హరుష. . . అని ప్రాసకొఱకు ప్రయోగింపఁ బడియున్నది.

అప్పకవి వంటి లాక్షణికుఁడు మడికి సింగనార్య కృతమగు వాసిష్ఠరామాయణములోని రెండు పద్యములను "అప్పకవీయము. . . లో నుదహరించి యున్నాఁడు.

--:ముగింపు:-

సరస్వతీమహల్ లైబ్రరీలోని తెనుఁగు వ్రాతప్రతుల సంఖ్య సుమారు 816 ఉన్నవి. ఇవి తంజావూరాంధ్ర నాయక రాజుల కాలమునుండి వచ్చుచున్నవి. నాయకుల పరిపాలన హూణశకము 1535-1675 వఱకు సాగినది. తరువాత మహారాష్ట్ర రాజులు తంజావూరును బరిపాలించిరి. నాయకరాజులలో "రఘునాథ నాయకుఁడు. . . . అతని కుమారుఁడు "విజయరాఘవ నాయకుఁడు. . . . ఈ యిద్దఱును తంజావురాంధ్ర సాహిత్యమునకు జీవగఱ్ఱలై యుండిరి. స్వయముగా గూడ అనేక గ్రంథములను విరచించిన ప్రజ్ఞానిధులు వారు. మహారాష్ట్ర రాజులలో గూడ తెనుఁగు సాహిత్యము కొనసాగినదే కాని మొరడు పోలేదు. మహారాష్ట్ర రాజులైన ఏకోజీ, శాహ మహారాజులు స్వయముగా తెనుఁగు ప్రబంధములను వ్రాసిన మేధావులు. లైబ్రరీలోని తెనుఁగు గ్రంథములను ఈవిధముగా విభజించవచ్చును.

  • 1. పద్యకావ్యములు
  • 2. ద్విపదకావ్యములు
  • 3. శతకములు
  • 4. దండకములు
  • 5. గానములు
  • 6. నాటకములు (యక్షగానములు)
  • 7. వచనకావ్యములు
  • 8. శాస్త్రసాహిత్యము
  • 9. వివిధగ్రంథములు.
  • <

మద్రాసు ప్రభుత్వమువారు స్వతంత్రమును బొందిన హిందూదేశ పురోభివృద్ధికి విజ్ఞానము ప్రధానాంశముగా గమనించి పై లైబ్రరీలోని తెనుఁగు శాఖకు సంబంధించిన పుస్తకములను గొన్నింటిని బ్రచురించి, ఆంధ్రసాహిత్యమునకు మహాదుపకారమును జేయుటకు పూనుకొని యున్నారు. ఈ విషయమందు మద్రాసు ప్రభుత్వము వారు చూపిన శ్రద్ధకు ఆంధ్రలోకము మనఃపూర్వకమైన ధన్యవాదములు సమర్పించుకొనుటలో వెనుకంజ వేయదు. ఈ చిన్న సేవను జేయు సందర్భమును నాకిచ్చి భాగవత దశమస్కంధము యొక్క పరిష్కరణ భారమును నాకొసంగిన సరస్వతీమహల్ లైబ్రరీ గౌరవకార్యదర్శి శ్రీయుతులు యన్. గోపాలన్ బి.ఎ., బి.ఎల్. గారికి నా కృతజ్ఞతాభివందనములను సమర్పించుకొనుచున్నాను.

మా సరస్వతీమహల్ లైబ్రరీ విమర్శనశాఖా నిర్వాహకులును, బహుగ్రంథ ద్రష్టలును, సర్వతోముఖ పాండిత్యమును గల శ్రీయుతులు కె. వాసుదేవశాస్త్రిగారు నా కన్నివిధములుగా ప్రోత్సాహము నొసంగి నాయుద్యమము కొనసాగుటకు సహాయ మొనరించిరి. వారికి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతాభివందనము లర్పించుకొనుచున్నాను.

నాకన్ని విధములనుఁ జేదోడు వాదోడుగానుండి సహాయ మొనర్చిన మన్మిత్రులు శ్రీయుతులు విఠలదేవుని సుందరశర్మగారికి నా కృతజ్ఞతాభివందనములను నివేదించు కొనుచున్నాను. తాళపత్రప్రతి గ్రంథమును శ్రమను బాటించక శ్రద్ధగావ్రాసి యిచ్చిన లైబ్రరీ తెనుఁగు లేఖకుఁడు చిరంజీవి యన్. విశ్వనాథునకు నా యాశీర్వాదపూర్వకమైన ధన్యవాదములు. ఈ చిన్న పొత్తమును సకాలమందు తగు విధముగా ముద్రణ చేసిన "ఆముదనిలయం. . . ముద్రణాలయమువారికి నా ధన్యవాదములను సమర్పించుకొనుచున్నాను.

ఈ యుపోద్ఘాతారంభము మా కులమునకు పరమగురువు లగు శ్రీరమణమహర్షులవారికి నమస్కృతులతో ప్రారంభించినది. నాజనకులును, గురువును దైవమునగు శ్రీ వాసిష్ఠ కావ్యకంఠ గణపతి మునులవారిని స్మరించుటతోపాటు శ్రీకృష్ణ భగవానుని పై వారు సెలవిచ్చిన శ్లోకముతో నీ యుపోద్ఘాతమును ముగించుచున్నాను.

శ్లో॥
భూమిభార వారణాయ యోయదుష్వభూ ద్విభు
ర్విస్మయం శిశోశ్చ యస్య చేష్టితాని తేనిరే
శర్మవః స పూరుషో రథాంగమాయుధం దధ
త్కర్మయోగదేశికః కరోతు పార్థసారథిః.


సరస్వతీమహల్ లైబ్రరీ
తంజావూరు.
7 - 12 -50.