పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : భాగవత సుథా లహరి. ఉపోద్ఘాతముసరస్వతీపుత్త్ర డా. పుట్టపర్తి నారాయణాచార్యులు వారి భాగవతసుధాలహరి నుండి యథాతథంగా ఉల్లేఖించడ మైనది.


భాగవతసుధాలహరి

ప్రథమ సంపుటము

వ్యాఖ్యాత:సరస్వతీపుత్త్రడా. పుట్టపర్తి నారాయణాచార్యులు


ప్రచురణః
కార్యనిరావాహణాధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
1988

Bhagavata sudhalahari

Commentary by:
Saraswathiputra Dr. puttaparthi narayana charyulu,

Edited by:
Mudivarthi Kondamacharyulu

T.T.D. Religious series No.337
Copies- 5,000.

Published by:
Sri Ch. Venkatapati Raju, I.A.S

Executive Officer,
T.T. Devasthanams, Tirupati,

Printed at:
Tirumala Tirupati Devasthanams press,
Tirupati- 517507.


ముందుమాట

శ్రీ మద్భాగవతము విష్ణ్వంశంతో ఉద్భవించిన వేదవ్యాస మహర్షిచే రచింపబడినది. ఈతడే వేదవిబాగము చేసినవాడు. పదునెనిమిది పురాణములు, అన్ని ఉపపురాణములు గూడ రచించిన మహామనిషి. భారతాది మహాగ్రంథములు విరచించి సంస్కృత వాజ్మయమును ఎంతగానో పరిపుష్టము చేసిన మహామహుడు. అన్ని గ్రంథములు వ్రాసియు మనశ్శాంతిని బడయక చింతాక్రాంతుడై యుండెనట. అట్టి పట్టున నారదుడు సమీపించి "భగవత్కథా ప్రథానమగు భాగవతమును వ్రాసిన నీకు చింతతీరి పరమానందము ప్రాప్తింపగల" దని తెలుప అత డట్లే చేసి పరమ శాంతిని పొందెనట.
అట్టి శ్రీ మద్భాగవతమును సహజ పాండిత్య బిరుదాంకితుడు, పరమభక్తాగ్రేసరుడు, బమ్మెర పోతన్న తెనిగించి తెనుఁగు తల్లికి అమూల్య మణిగణ దీప్తి మన్మకుటముగా దానిని సమర్పించి తరించెను.
పోతన "పలికెడిది- - - - - - - పలుకగనేలా" అని తననోట రామచంద్రుడే ఈ భాగవతమును పలికించుచున్నాడని సవినయంగా మనవి చేసుకున్నాడు. సంస్కృత భాగవతం రాసినది విష్ణ్వంశ సంభూతుడు. దానిని తెనిగించిన పోతన విష్ణ్వావిష్ణుఁడని నిర్ణయింప తగి యున్నది. ఇది పరమ సత్యము. కానిచో ఇట్టి కృతి చేయుట ఎవరికి సాధ్యము? తన భాగ్యవిశేషముచేతనే నన్నయ తిక్కనాదులు ఈ కృతిని తెనిగింపక వదిలిపెట్టి రని అతడు చెప్పికొని యున్నాడు.
పూర్వము సత్యలోకమున బ్రహ్మదేవుడు ఆరు శాస్త్రములను తదంగములను ఒక వైపున, భాగవతశాస్త్రమును మరియొక వైపున ఉంచి త్రాసున తూచగా అవన్నియు తేలికయై ఈ భాగవతము బరువై యుండెనను ప్రమాణ వచనముచే ఈ గ్రంథము యొక్క మహత్వమూ ప్రాధాన్యమూ ఎట్టిదో ఊహించవచ్చునుఅట్టి ఉత్తమోత్తమ గ్రంథమైన శ్రీమద్భాగవతమును ‘సుధాలహరి’ అను పేరున శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు విపులంగా వ్యాఖ్యానింపపూనినారు. వారు వ్యాస ప్రణీత మహాభాగవత పురాణశ్లోకములకు ప్రతిపదార్థ తాత్పర్య, విశేషవివరణములతో పోతన్నగారి పద్యగద్యములను కూడ జతపరిచి రచన చేసి యున్నారు. భాగవత మహత్మ్యము ఆరు అధ్యాయములు గల గ్రంథము. గ్రంథ మహత్య మెఱుగుట గ్రంథాశక్తిని పెంపొందింప జేయు ననుట అనుభవసిద్ధమే. మొదటి అధ్యాయమున భక్తి నారద సంవాదము; రెండవ అధ్యాయమున కుమార నారద సంవాదమూ; మూడవ అధ్యాయమున భక్తి కష్ట నివర్తనము; నాల్గవ అధ్యాయమున విప్రమోక్షము; ఐదవ అధ్యాయమున గోకర్ణవర్ణనము; ఆరవ అధ్యాయమున శ్రవణ విధి కథనము కలదు.
సప్తాహ కథాశ్రవణవిధానము అందలి భేదములు కథకుని యొక్కయూ, శ్రోతల యొక్కయూ నియమములు; ఆహార విధానమూ మున్నగు ఎన్నియో యంశములతో ఈ భాగవత మాహత్మ్య మొప్పి యున్నది.
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు సరస్వతీపుత్రులు, పండిత ప్రకాండులు, మహాకవులు, బహుబాషాకోవిదులు. వారు శ్రీమద్భాగవతమును ప్రత్యక్షరము పరిశీలించి భాషాంతరములలోని భాగవత విషయములను కూడ క్రోడీకరించి విమర్శనాత్మకముగా సర్వాంగసుందరముగా ఈ గ్రంథము రచించినారు. వారికి మా కృతజ్ఞతలు. తిరుమల తిరుపతి దేవస్థానము బహు కాలముగా అనేకములగు ధార్మిక గ్రంథములను కవిపండితులచే రచింపజేసి పరిష్కరింపజేసి స్థాలిత్యరహితముగా అందముగ ముద్రింపించి పాఠకులకు తక్కువ వెలకు అందించుచు ధర్మము, భక్తి, ఆస్తికత - వీనిని బహుముఖముగ విస్తరింప జేయుచున్నది. ఈగ్రంథము రసజ్ఞులైన ఆంధ్రపాఠకులను మిక్కిలి అలరింపగలదని మా విశ్వాసము.

సి హెచ్ వేంకటపతిరాజు,
తిరుపతి.
8- 8- 1988
కార్యనిర్వాహణాధికారి,
తి.తి.దేవస్థానములు.

ఆముఖము

ప్రాచీన పురాణ వాజ్మయము రెండు రీతులు. ఇతిహాసము, పురాణము. పాశ్చాత్యులు (ఎపిక్) - శబ్దమును సోదాహరణముగా వీరకావ్యములకు వాడుకొందురు. మన పురాణ వాజ్మయ మట్టిది కాదు. అది విజ్ఞాన సర్వస్వము. భారత రామాయణము లితిహాసములు; మహాపురాణములు, ఉపపురాణములు. రెండవతెగకుఁ చెందినవి. వేదార్థమును నిరూపించుట ఇతిహాస పురాణ జ్ఞాన మావస్యక మని ప్రాచీనులు శాసించిరి.
"ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్,
బిభేత్యల్ప శ్రుతాద్వేదో, మామయం ప్రహరిష్యతి.


   (భార 1- 1- 204),

- ఇతిహాస పురాణములను జోడించి, వేదార్థములను నిర్ణయింపవలెను. ఆ జ్ఞానము లేనివాడు నన్నపార్థ కల్పనములతోఁ బ్రహరించు చున్నాఁడని వేదమాత భయపడునట; ఈ రెండును - భారతీయ జీవనమును దిద్దుటలో గొప్ప జవాబ్దారీని వహించినవి. వీని యావిర్భూతి - యెప్పుడు? వేదకాలమునకును, కావ్యయుగమునకును - మధ్య జరిగినదని కొంతమంది తలఁపు. మహాభారతమునకు, పురాణములకు మనవారు పంచమవేద మన్నంత గౌరవ మిచ్చిరి.
"ఇతిహాస పురాణః పంచమో వేదానాం (చాందోగ్యో- 7- 1- 2- 4). రామాయణము నాదికావ్య మన్నారు. భారతీయజీవనము నందు నేఁటికిని మహాభారతము, పురాణములు - వీని పలుకబడి చెల్లుచునే యున్నది. సంకల్పము నందుఁ బ్రతి యొక్కరును - "శ్రుతిస్మృతిపురాణోక్త" - మ్మను మాట వాడుచున్నారు. ఇందులో "శ్రుతి" యను శబ్దము మహాభారతమును గూడగట్టికొనుచున్నది. వేదకాలము లందే పురాణము లున్నవని యొక వాదము. కొందరు బ్రహ్మదేవునికి వేదము లావిష్కారము గాక ముందు అతఁడే పురాణములను స్మరించె నని యందురు. వాయుపురాణ మీ క్రింది విషయమును జెప్పుచున్నది.
"పురాణం సర్వశాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాస్మృతమ్,
అనంతరం చ వక్తేభ్యోవేదాస్తస్య వినిర్గతాః.

    (వాయు, 1- 60- 61)
కాని విద్వాంసు లీ యభిప్రాయము నంగీకరించుట లేదు. ఋగ్వేదమే పురాణ వాజ్మయమునకు మొదలన్న వారును లేకపోలేదు. వాని లోని సంవాదరూపములైన యాఖ్యానములతో పురాణము లారంభ మైన వని వారి వాదము: వేదముల తర్వాత పురాణముల కున్న గౌరవము మరి దేనికిని లేదు. పురాణ మనగా నేమి? రెండు విధము లైన వ్యుత్పత్తులు చెప్పికొన్నారు. నిష్ణాతుఁడు గాని వాడు పురాణములను వివరింపలేడు.
"యస్మాత్పురా హ్యానతీదం పురాణం తేనహిస్మృతమ్,
నిరుక్త మస్య యోవేద సర్వపాపైః ప్రముచ్యతే.
     (వాయుపురా.1- 203-శ్లో.)
అనాది కాలమునుండి యున్నది గనుకనే "పురాణము", దాని కర్ధము సరిగాఁ జెప్ప గలవారు సర్వపాప విముక్తు లగుదురు. నిజమునకు పురాణముల కర్ధముఁ జెప్పుటకు సంస్కృత వ్యుత్పత్తి మాత్రమే చాలదు. ఈ విషయమునే ప్రస్తావించుచు ఆనంద తీర్థుల భాష్యవివరణములో తర్కప్రదీపకారుఁ డి ట్లన్నాఁడు-
"భాషాత్రయం న జానాతి రీతీనాంశతమేవ చ,
పురాణార్థం వదన్ యాతి నరకం నాzత్ర సంశయః.

పురాణభాష ముత్తెఱఁగులు, గుహ్యభాష, సమాధిభాష, దర్శనభాష. ఈ మూడు మార్గము లందును అథర్వ వేదకాలము నాటికి పురాణ వాజ్మయము ప్రత్యేకముగా నున్నట్లు కన్పింపదు. ఆ వేదమందీ ఋక్కున్నది.
"బుచస్వామాని ఛందాంసి పురాణం యజుషా సహ,
ఉచ్ఛిష్టాత్ జజ్ఞిరే సర్వే దివదేవా దివిశ్రితః.

   (అధర్వవే. 11- 7- 24)
- ఇక్కడ ‘పురాణం’ అను ఏకవచనము గమనింపదగినది. ఛాందోగ్య మందుఁ గూడ నీ ప్రస్తావనమే వచ్చును.
"సహోవాచ
ఋగ్వేదం భగవోzధ్యేమి యజుర్వేదం సామవేద మథర్వణం చ, చతుర్థ మితిహాస పురాణం పంచమం వేదానాం వేదమితి:
   (ఛాందోగ్య ఉ. 7- 1- 2)
- ఇతిహాసపురాణము పంచమ వేద మన్నారు. పురాణములలో ముఖ్యముగా నేమి చెప్పెదరు? అమరసింహుఁ డి ట్లనుచున్నాఁడు.
" సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశోమన్వంతరాణి చ,
వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం.

- సర్గ మనఁగా సృష్టిక్రియ. దానికి సంబంధించిన వృత్తాంతము పురాణములో నుండవలెను. ప్రతిసర్గము అనఁగా ప్రళయము పునస్సృష్టి. వంశము - దేవతాదుల వంశ వర్ణనము. మన్వంతరము అనఁగా మనువులను గూర్చిన గాథ. వంశానుచరిత మనుట కా మనువుల కాలములో నేర్పడిన రాజవంశముల వర్ణన మని అర్థము. వంశానుచరిత మను మాటకు బదులుగా ‘భూమ్యాదే స్సంస్థాన’ మను పాఠమును మఱికొందరు చెప్పెదరు. అనఁగా భూగోళ క్రమమును వర్ణించుట. అమరసింహుడు క్రీ.శ.5వ శతాబ్దమువాఁడు. అతఁడు చెప్పిన యీ లక్షణము సమగ్రముగాఁ దోపదు. కొన్ని పురాణములలో వీనికన్న నెక్కువ విషయము లున్నవి. మరి కొన్నిటిలో నీ యూసే లేదు. భాగవతములో నిఁక కొంత విస్తృతమైన లక్షణము వచ్చును.
"సర్గోస్యాzథ విసర్గశ్చ వృత్తీరక్షాంతరాణి చ,
వంశ్యో వంశానుచరితం ముక్తిర్ణేతురసాశ్రయః.


"దశభి ర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విధుః,
కేచిత్పంచవిదం బ్రహ్మన్: మహాదల్ప వ్యవస్థయా.

- పై దానిలో వృత్తి యనఁగా జీవనవిధానము. రక్ష యనఁగా అవతారముల వర్ణన. మోక్షము ముక్తి. హేతు వనఁగా జీవుని విదానము. అపాశ్రయము బ్రహ్మను గూర్చిన లక్షణము. మత్స్యపురాణములో మరియొక్క రీతిగా నున్నది.
"బ్రహ్మవిష్ణ్వర్క రుద్రాణాం మాహత్మ్యం భువనస్య చ,
స సంహారప్రదానాం చ పురాణే పంచవర్ణకే.
ధర్మశ్చార్థశ్చ కామశ్చ మోక్షశ్చైవాత్రకీర్త్యతే,
సర్వేష్వపి పురాణేషు తద్విరుద్థం చ యత్ఫలమ్.

- ఈ పురాణము లెన్ని? మహాపురాణములు పదునెనిమిది. ఉపపురాణములు గూడ అన్నే నఁట. దేవీభగవతములో నీ పదునెన్మిది పురాణములను చాల చమత్కారముగా ఒకే శ్లోకములో సంగ్రహించినారు. ఆ శ్లోక మిది.
"మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వ చతుష్టయమ్,
నాలింపాగ్ని పురాణావి కూస్కం గారుడ మేవచ.

మద్వయ మనగా మార్కండేయ మత్స్యపురాణములు. భద్వయములు భాగవత భవిష్యములు. బ్రత్రయం - బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండపురాణములు. వచతుష్టయం - వాయు, వరాహ, వామన, విష్ణుపురాణములు. న - నారదపురాణము, లిం - లింగపురాణము. పా - పద్మపురాణము, అగ్ని- అగ్నిపురాణము. కూ - కూర్మపురాణము, స్కం - స్కందపురాణము. గారుడం - గరుడపురాణము; కొందరు వాయుపురాణమునకు బదులు శివపురాణమును జేర్తురు. భాగవతమునకు బదులు దేవీభాగవతమును లెక్కింతురు. కాని శివపురాణము మహాపురాణములలోఁ జేరదు. కొందరు శివ వాయుపురాణములను జేర్చి పందొమ్మిదికి లెక్కచేసినారు. మరికొందరు హరివంశమునుకూడ జేర్చిరి. ఉపపురాణము లీ క్రిందివి.
సనత్కుమారము, నారసింహము, నందపురాణము, శివధర్మఖండము, దుర్వాస నారదీయములు, కపిల వామన ఉశనస్సులు, మానవ కరుణ కాళి మాహేశ్వరములు, సాంబ సౌర పరాశ మరీచ, భార్గవములు.
కొందరీ యుపపురాణముల సంఖ్యను నూఱువరకును బెంచిరి. కాని - మనకు ముద్రితములై చిక్కునవి పదునైదు మాత్రమే, మహాపురాణములలో పదిపురాణములు శివునిగూర్చియే చెప్పును. నాలుగు బ్రహ్మదేవుని వర్ణించును. రెండు దేవీవరములు. రెండు విష్ణువును గూర్చి. స్కాందములోని యీ శ్లోకము పై విషయమును జెప్పును.
"అష్టాదశ పురాణేషు దశభి ర్గీయతే శివః,
చతుర్భిర్భగవాన్ బ్రహ్మా ద్వాభ్యాం దేవీ తథా హరిః,

- ఈ మహాపురాణములను మరల సాత్త్విక రాజస తామసికము లని విభజించినారు. పాద్మము ఉత్తరఖండములో నీ శ్లోకము లున్నవి.
"మాత్స్యం కౌర్మం తథా లైంగం శైవం స్కాందం తథైవ చ,
అగ్నేయం చ షడేతాని తామసాని నిబోధమే.
"వైష్ణవం నారదీయం చ తథా భాగవతం శుభమ్,
గారుడం చ తథా పాద్మం వారాహం శుభదర్శనే.

"సాత్త్వికాని పురాణాని విజ్ఞేయాని శుభాని వై,
బ్రహ్మాండం బ్రహ్మవైవర్తం మార్కండేయం తథైవ చ,
భవిష్యం వామనం బ్రాహ్మ్యం రాజసాని నిబోధమే.

విష్ణు, నారదీయ, భాగవత, గరుడ, పద్మ, వరాహములు - సాత్త్వికములు. మత్స్య, కూర్మ, లింగ, శివాzగ్ని, స్కాందములు తామసములు. ఇక రాజసములు – బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, మార్కండేయ, బ్రహ్మ, వామన, భవిష్యములు. సాత్త్విక పురాణములలో శ్రీహరి మాహత్త్య మధికముగా నుండును. రాజసము లందు బ్రహ్మ గొప్పతనమును వర్ణింతురు. తామస పురాణము లందు, అగ్ని, శివుల మాహత్మ్యము పుష్కలముగా నుండును. సంకీర్ణము లందు సరస్వతి పితృదేవతలు గొప్పగా వర్ణింపబడుదురు. పురాణముల పుట్టుకను గూర్చి రెం డభిప్రాయములు ముందే చెప్పితిని. వ్యాసభగవానుడే పురాణములను రచించె నని మూడవ వాదము. వేదముల నాతడు విభాగించి, తన నల్గురు శిష్యుల కొప్పగించెను. పురాణ సంహితను నిర్మించి ఐదవ శిష్యుఁడైన సూత రోమహర్షణున కొప్పించె నఁట.
"ఆఖ్యానైశ్చావ్యుపాఖ్యానైర్గాథాభిః కల్పశుద్ధిభిః,
పురాణ సంహితాం చక్రే పురాణార్థ విశారదః

    (విష్ణువు. 3- 6- 15)
- సూత రోమహర్షణుఁడు పురాణవాజ్మయము నాఱుగా విభజించెను. విభజించి, శిష్యుల కుపదేశించె నఁట: ఆ శిష్యులలో మువ్వురు మరికొంత వాజ్మయము నభివృద్ధిపఱచికొనిరి. సూతునికి సంబంధించిన సంప్రదాయము రోమహర్షణ సంప్రదాయము - ఇదేగాక వారి శిష్యులు విస్తరించిన, కాశ్యపిక - సావర్ణిక సాంశపాయనిక సంప్రదాయము లున్నవి. కాని యివి నేఁడు ప్రచారములో లేవు. లోమహర్షణుని కుమారుఁ డుగ్రశ్రవసుఁడు. అతని సంప్రదాయమే యిపు డున్నది. ఇట్లు పురాణ వాజ్మయము మహావిస్తృతము. అనేక పురాణములలో భాగవత ప్రశస్తి కలదు. భాగవత సప్తాహపారాయణ మొనర్చువారు పద్మపురాణ భాగవత మాహత్మ్యమును ముందే సేవించి తరువాత కథాసుధాబ్ధిలోఁ ప్రవేశింతురు. మరికొందరు - స్కాందపురాణము నందలి మాహత్మ్య కథను గూడ పారాయణము చేయుదురు. కేరళమునందు గురువాయూరి యం దనుసరించెడి పారాయణక్రమమును దాసుఁడు తిలకించి పవిత్రుఁ డగుట తటస్థించినది. నాకు శ్రీమద్భాగవతముపై విపుల వ్యాఖ్య నొనర్చి జీవితము ధన్య మొనర్చికొను పేరాస యెన్ని దినములనుండియో యున్నది. ఆ కోరిక "కిమాశ్చర్యం నంగో రుపరి యది గంగానివతతి" గా నెరవేరుటకు తిరువేంగడముడైయాన్ మార్గమేర్పఱచినాఁడు. కార్యమా! నావంటి వాని కసాధ్యమైనది. భగవన్నియమనము దొడ్డది. నా స్థితి "ఉద్బాహురివ వామనః" గా నున్నది.
తిరుమలేశునకు ప్రతినిధులైన దేవాలయ కార్యనిర్వాహణాధికారులు పి. వి. ఆర్. కె. ప్రసాదుగారు నన్నీ పవిత్ర యజ్ఞమునకు యజమానిగా నొనర్చిరి. నా వంటి యల్పజ్ఞుఁడు ఈ మహాకార్యకరణదక్షుఁ డగుట వారి యౌదార్యము. డా. రావుల సూర్యనారాయణమూర్తి - పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరుగారు, ఇ.ఓ. గారి సదభిప్రాయమునకు తమ యంగీకార సాహచర్యము నొసఁగిరి. వారి నిండుహృదయమునకు నా యేటికోళ్లు. ఆ ఇర్వురి పవిత్రభావన తిరుమలేశుని కృపాబలము - నాచే ఈ పనిని ముగింపజేయు నని విశ్వసించు చున్నాను.కాఁగల కార్యములకు శ్రీ శ్రీనివాసుఁడే సాక్షి.
శ్రీ ప్రసాదుగారు గొప్ప హృదయముతో - నా కొకటి రెండు సలహా లిచ్చిరి. "ఇది శ్రీనివాసునిసేవ. మీ రొనర్చు వ్యాఖ్యానములో భాషావిషయకమైన తర్కముల కెక్కువ యెడ మివ్వక భక్తి జ్ఞాన వైరాగ్యములకే యెక్కువ యవకాశ మిచ్చుట మంచిది. భాగవత విషయము లెక్క డెక్కడ ఎన్నెన్ని గలవో యవి యన్నియు సంగ్రహింపుడు. వ్యాఖ్యలో నే మతము నందు నభినివేశ ముండరాదు. అందరు మనకు మాన్యులే", అట్లే కా నిమ్మన్నాను.
ఈ భాగవత సుధాలహరి రచనా యత్నములో నా భార్య సౌభాగ్యవతి కనకవల్లీదేవి తన యనారోగ్యమును గూడ లెక్కింపక నాకు తోడ్పడుచున్నది. మొదటి నుండియు, నా సాహిత్య కార్యములకు - అమె సహకారమే బలము. ఇఁక మే మిర్వురము కోరఁగల దేమున్నది?
శ్లో.
అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే
వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే,
శ్రుతి శిరసి విదీప్తే బ్రహ్మాణి శ్రీనివాసే
భవతు మమ వరస్మిన్ శేముషీ భక్తిరూపా.

- పుట్టపర్తి నారాయణాచార్యులు.          

---