పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : వ్రతముల్ (10.1-1707-మ.)

10.1-1707-మ.

వ్రముల్ దేవగురుద్విజన్మ బుధసేవల్దానధర్మాదులున్
జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ గాంక్షించి చే
సితినేనిన్ వసుదేవనందనుఁడు నా చిత్తేశుఁ డౌఁ గాక ని
ర్జితులై పోదురుగాక సంగరములోఁ జేదీశముఖ్యాధముల్.

టీకా:

వ్రతముల్ = నోములు; దేవ = దేవతలను; గురు = పెద్దలను; ద్విజన్మ = విప్రులను; బుధ = ఙ్ఞానులను; సేవల్ = కొలచుటలు; దాన = దానములిచ్చుటలు; ధర్మ = దర్మాచరణములు; ఆదులున్ = మున్నగువానిని; గత = పూర్వ; జన్మంబులన్ = జన్మములలో; ఈశ్వరున్ = సర్వమునేలువాడనిని; హరిన్ = విష్ణమూర్తిని; జగత్ = లోకమునకు; కల్యాణున్ = మేలుచేయువానిని; కాంక్షించి = కావాలని, కోరి; చేసితినేనిన్ = చేసినచో; వసుదేవనందనుడు = కృష్ణుడు {వసుదేవనందనుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; నా = నా యొక్క; చిత్తేశుడు = భర్త {చిత్తేశుడు - మనసునకు ప్రభువు, భర్త}; ఔగాక = అగునుగాక; నిర్జితులు = ఓడిపోయినవారు; ఐపోదురుగాక = అయ్యెదరుగాక; సంగరము = యుద్దము; లోన్ = అందు; చేదీశ = శిశుపాలుడు {చేదీశుడు - చేది దేశపు ప్రభువు, శిశుపాలుడు}; ముఖ్య = మొదలగు; అధముల్ = నీచులు.

భావము:

పూర్వజన్మలలో నేను కనుక సర్వలోకాధీశుడు, సర్వలోకశుభ ప్రదాయుడు నైన గోవిందుడిని పతిగా కావాలని నోములు నోచి ఉంటే; దేవతలకు, గురువులకు, విప్రులకు, జ్ఞానులకు సేవలొనర్చి ఉంటే; దానధర్మాది పుణ్యకార్యాలు ఆచరించి ఉంటే; వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడౌ గాక. శిశుపాలుడు మున్నగు నీచలు అందరు యుద్ధంలో పరాజితు లైపోవు గాక.

       రుక్మిణి కృష్ణునికి పంపిన సందేశంలోని చక్కటి పద్యాలలో ఒకటిది.