పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : వ్రాలంగవచ్చిన (10.1-320-క.)

10.1-320-క.

వ్రాలఁగ వచ్చిన నీ సతి
చూలాలం దలఁగు మనుఁడు జూలగుటకు నే
మూలంబు చెప్పు మనె నీ
బాలుఁడు; చెప్పుదురె సతులు? ర్వేందుముఖీ!

టీకా:

వ్రాలగన్ = మీదపడుటకు; వచ్చినన్ = రాగా; ఈ = ఈ; సతి = ఇంతి; చూలాలన్ = గర్భిణిని; తలగుము = తప్పుకొనుము; అనుడున్ = అనగా; చూలు = గర్భము; అగుట = కలుగుట; కున్ = కు; ఏ = ఏది; మూలంబు = కారణము; చెప్పుము = చెప్పు; అనెన్ = అన్నాడు; నీ = నీ యొక్క; బాలుడు = పిల్లవాడు; చెప్పుదురె = చెప్తారా; సతులు = ఇల్లాండ్రు; పర్వేందుముఖీ = సుందరీ {పర్వేందుముఖీ - పర్వ (పౌర్ణమినాటి) ఇందు (చంద్రునివంటి) ముఖి (మోముకలామె), స్త్రీ}.

భావము:

ఓ యశోజమ్మా! నీ కొడుకు ఈ ఇల్లాలు ఒళ్ళో కూర్చోడానికి వచ్చేడు. ఈమె “గర్భవతిని దూరంగా ఉండు అంది”. “ గర్భవతివి కావటానికి కారణం ఏమిటి చెప్పు” అని అడుగుతున్నాడు నీ కొడుకు. సుందరి! ఈ తెలివితేటలకు నిండుపున్నమి నాటి చందమామలా నీ మోము వికసించిందిలే. అలా అడిగితే ఆడవాళ్ళు ఎవరైనా చెప్తారుటమ్మా.

     ఇది బమ్మర పోతనామాత్యుల కృష్ణుని కపట శైశవ దొంగజాడలు. ఇది చాలదన్నట్టు లకార ప్రాస వేసాడు అందాలు అద్దాడు. పర్వేందుముఖి బ్రహ్మవిద్యకు సంకేతంగా వాడారు. వ్రాలగ తనలో ఐక్యం చేసుకోడాన్ని సూచించడానికి వాడారు. చూలగుట పరిపక్వానికి చేరబోతున్న సూచన. గీతా ప్రమాణం “అహం బీజప్రదః పితా; బీజంతదహ మర్జున!” కదా. నీవు చూలగుటకు కారణం నేనే అని సూచిస్తున్నాడు.