పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : విశ్వాత్ముడు (2-100-క.)

2-100-క.

విశ్వాత్ముఁడు, విశ్వేశుఁడు,
విశ్వమయుం, డఖిలనేత, విష్ణుఁ, డజుం, డీ
విశ్వములోఁ దా నుండును
విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్.

టీకా:

విశ్వాత్ముఁడున్ = విశ్వమే తానైనవాడు; విశ్వేశుఁడు = విశ్వమునకు ఈశ్వరుడు; విశ్వమయుండు = విశ్వమంతయు నిండి ఉన్నవాడు; అఖిలనేతన్ = సర్వమునకు నడిపించువాడు; విష్ణుఁడు = విష్ణువు; అజుండు = పుట్టుకలేని వాడు; ఈ = ఈ; విశ్వము = జగత్తు; లోన్ = లోపల; తాన్ = తాను; ఉండును = ఉండును; విశ్వము = జగత్తు; తనన్ = తన; లోనన్ = లోపలనే; చాలన్ = మిక్కిలి; వెలుఁగుతున్ = ప్రకాశిస్తూ; ఉండున్ = ఉండును.

భావము:

బ్రహ్మదేవుడు పుత్రుడు నారదునికి విష్ణుతత్వాన్ని ప్రభోధిస్తున్నాడు – 

   విశ్వమే తానైన వాడు; విశ్వమునకు ప్రభువు; విశ్వ మంతయు నిండి ఉండు వాడు; సర్వమునకు నడిపించు వాడు; విశ్వమును వ్యాపించి యుండువాడు; పుట్టుక లేని వాడు అయిన ఆ విష్ణువు ఈ జగత్తు లోపల ఉండును; జగత్తు సమస్తము ఆ విష్ణుని లోపలనే మిక్కిలి ప్రకాశిస్తూ ఉండును.