తేనెసోనలు(ప-హ) : విశ్వకరు (8-88-క.)
8-88-క.
విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నేభజియింతున్.
టీకా:
విశ్వ = జగత్తుని; కరున్ = సృష్టించెడివానిని; విశ్వ = జగత్తుకి; దూరునిన్ = అతీతముగనుండువానిని; విశ్వ = జగత్తు; ఆత్మునిన్ = తనస్వరూపమైనవానిని; విశ్వ = లోకమంతటికి; వేద్యున్ = తెలుసుకొనదగ్గవానిని; విశ్వున్ = లోకమేతానైనవానిని; ఆవిశ్వున్ = లోకముకంటె భిన్నమైనవాని; శాశ్వతున్ = శాశ్వతముగనుండువానిని; అజున్ = పుట్టుకలేనివానిని; బ్రహ్మ = బ్రహ్మదేవునికి; ప్రభున్ = ప్రభువైనవానిని; ఈశ్వరునిన్ = లోకమునడిపించువానిని; పరమ = సర్వశ్రేష్టమైన; పురుషున్ = పురుషుని; నేన్ = నేను; భజియింతున్ = స్తుతించెదను.
భావము:
జగత్తు సృష్టి చేసి, ఆ జగత్తుకి ఆవతల దూరంగా నుంటూ, జగత్తుకి అంతరాత్మ యై, జగత్తు అంతటిలో తెలుసుకో దగిన వా డై, జగత్తే తా నై, జగత్తుకి అతీతు డై, పుట్టుక లేకుండా, ఎల్లప్పుడు ఉండు వాడై, ముక్తికి నాయకు డై, జగత్తు నడిపిస్తున్న ఆ పరమాత్ముని నేను ఆరాధిస్తాను.
ఇలా తలచుకుంటూ మొసలికి చిక్కిన గజేంద్రుడు భగవంతుని తన మనస్సులో నెలకొల్పుకుంటు ప్రార్థించడానికి సిద్ధ మయ్యాడు.