పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : విష్ణుకథారతు (10.1-13-క.)

10.1-13-క.

విష్ణుకథా రతుఁ డగు నరు
విష్ణుకథల్ చెప్పు నరుని వినుచుండు నరున్
విష్ణుకథా సంప్రశ్నము
విష్ణుపదీ జలము భంగి విమలులఁ జేయున్.

టీకా:

విష్ణు = నారాయణుని; కథా = చరిత్రములను; రతుడు = వినుటందాసక్తికలవాడు; ఆగు = ఐన; నరున్ = మానవుని; విష్ణు = హరి యొక్క; కథల్ = వర్తనలను; చెప్పు = తెలియజెప్పెడి; నరుని = మానవుని; వినుచుండు = ఎప్పుడు వినెడి; నరున్ = మానవుని; విష్ణు = మాధవుని; కథ = కథలను; సంప్రశ్నము = చెప్పుమని యడుగుట; విష్ణుపదీ = గంగానదీ {విష్ణుపది - విష్ణుమూర్తి పాదములందు జనించినది, గంగ}; జలము = నీటి; భంగిన్ = వలె; విమలులన్ = నిర్మలులనుగా; చేయున్ = తయారుచేయును.

భావము:

పరీక్షిన్మహారాజా!  శ్రీమన్నారాయణ పాదపద్మములనుండి పుట్టిన పవిత్ర గంగానది వలెనే, విష్ణుకథాప్రసంగంకూడ విష్ణుకథల యందు ఆసక్తి కలవారిని, విష్ణు కథలు చెప్పేవారిని, వినేవారిని పునీతులను చేస్తుంది. 

    కృష్ణబలరాముల అవతార విశేషాలు ఆ మాధవుని చరిత్ర వివరంగా తెలియజెప్ప మని అడిగిన పరీక్షిత్తునకు వ్యాసభగవానుని పుత్రుడైన శుకయోగి ఉపోద్ఘాతంగా విష్ణుకథల విశిష్టతని ఇలా వివరించారు.