తేనెసోనలు(ప-హ) : విడువిడుడని (8-199-క.)
8-199-క.
విడువిడుఁ డని ఫణి పలుకఁగఁ
గడుభరమున మొదలఁ గుదురు గలుగమి గెడఁవై
బుడబుడ రవమున నఖిలము
వడవడ వడఁకఁగ మహాద్రి వనధి మునింగెన్.
టీకా:
విడు = విడిచిపెట్టండి; విడుడు = విడిచిపెట్టండి; అని = అని; ఫణి = సర్పము; పలుకగన్ = అరుచుచుండగ; కడు = అధికమైన; భరమునన్ = బరువువలన; మొదలన్ = క్రింద; కుదురు = కుదురు {కుదురు - కుదురుగా నిలుచుటకు ఏర్పరచెడి పీఠము}; కలుగమి = లేకపోవుటచేత; కెడవు = ఒరిగినది; ఐ = అయ్యి; బుడబుడ = బుడబుడ యనెడి; రవమునన్ = శబ్దముతో; అఖిలమున్ = సర్వము; వడవడ = వడవడ యని; వడకగన్ = వణికిపోగా; మహా = గొప్ప; అద్రి = కొండ; వనధిన్ = సముద్రమునందు; మునింగెన్ = మునిగినది.
భావము:
అమృతమథన సమయంలో వాసుకి “వదలండి వదలండి” అన్నాడు. మందర పర్వతం అడుగున కుదురు లేకపోడంతో అధిక బరువు వలన పడిపోతూ సముద్రంలో “బుడ బుడ” మని మునిగింది. దేవ రాక్షస సమూహం సమస్తం “వడ వడ” మని వణికింది.