పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : వెన్నఁ దినఁగఁ (10.1-314-క.)

10.1-314-క.

వెన్నఁదినఁగఁ బొడగని మా
పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దివియన్
న్నొడిసి పట్టి చీఱెను
జిన్నికుమారుండె యితఁడు? శీతాంశుముఖీ!

టీకా:

వెన్నన్ = వెన్నను; తినగన్ = తింటుండగా; పొడగని = కనుగొని; మా = మా యొక్క; పిన్నది = చిన్నమ్మాయి; అడ్డంబున్ = అడ్డుపెట్టుటకు; వచ్చి = వచ్చి; పిఱిదికిన్ = వెనుకకు; తివియన్ = లాగగా; చన్ను = స్తనమును; ఒడిసి = అనువుగా; పట్టి = పట్టుకొని; చీఱెను = గీరెను; చిన్ని = చిన్న; కుమారుండె = పిల్లవాడా; ఇతడున్ = ఇతను; శీతాంశుముఖీ = సుందరీ {శీతుంశుముఖి - చంద్రముఖి, స్త్రీ}.

భావము:

గోపికలు వచ్చి యశోదతో చిన్ని కృష్ణుని అల్లరి చెప్తున్నారు -  

        చంద్రముఖీ! మా ఇంట్లోకి చొరబడి నీ కొడుకు వెన్న తింటున్నాడు. అది చూసి మా చిన్నమ్మాయి అడ్డంవెళ్ళి ఇవతలకి లాగింది. మీ వాడు మా పడచుపిల్ల రొమ్ముమీద గోళ్ళతో గీరేసి పారిపోయాడు. చంద్రుళ్ళా వెలిగిపోతున్న ముఖం పెట్టుకొని మరీ చూస్తున్నావు గాని చెప్పవమ్మా! ఇవి పసిపిల్లలు చేసే పనులా.