పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా (10.1-374-క.)

10.1-374-క.

వీరెవ్వరు? శ్రీకృష్ణులు
గారా?యెన్నడును వెన్నఁ గానరఁట కదా!
చోత్వం బించుకయును
నేరఁట! ధరిత్రి నిట్టి నియతులు గలరే?

టీకా:

వీరు = ఈ పెద్దమనిషి; ఎవ్వరు = ఎవరు; శ్రీకృష్ణులు = కృష్ణడుగారు; కారా = కాదా; ఎన్నడును = ఎప్పుడు; వెన్నన్ = వెన్నను; కానరు = చూడనేచూడలేదు; అట = అట; కదా = కాదా; చోరత్వంబున్ = దొంగతనము; ఇంచుకయును = కొంచముకూడ; నేరరు = తెలియదు; అట = అట; ధరిత్రిన్ = భూమిపైన; ఇట్టి = ఇలాంటి; నియతులు = పద్దతిప్రకారముండువారు; కలరే = ఉన్నారా.

భావము:

ఓహో ఎవరండి వీరు? శ్రీకృష్ణుల వారు కాదా? అసలు వెన్న అంటే ఏమిటో ఎప్పుడు చూడనే లేదుట. పాపం దొంగతనం అంటే ఏమిటో ఎరుగరట. అబ్బో ఈ భూలోకంలో యింతటి బుద్ధిమంతులు ఎవరు లేరట.

      వేరొకరి యింట్లో వెన్న దొంగిలించి కోతిపాలు చేస్తు దొరికిపోయిన చిలిపి కృష్ణుని పట్టుకొని, కొట్టజాలక కట్టేద్దా మనుకొంటు, ఇలా దెప్పుతోంది.