పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : వావిజెల్లెలు (10.1-34-మత్త.)

10.1-34-మత్త.

వావిఁజెల్లెలు గాని పుత్రికవంటి దుత్తమురాలు; సం
భానీయచరిత్ర; భీరువు; బాల; నూత్నవివాహ సు
శ్రీవిలాసిని; దీన; కంపితచిత్త; నీ కిదె మ్రొక్కెదన్;
కావే; కరుణామయాత్మక; కంస! మానవవల్లభా!

టీకా:

వావిన్ = వరుసకు; చెల్లెలు = చెల్లెలు; కాని = కాని; పుత్రిక = కూతురు; వంటిది = లాంటిది; ఉత్తమురాలు = మంచియామె; సంభావనీయ = గౌరవింపదగిన; చరిత్ర = నడవడికగలామె; భీరువు = భయస్తురాలు; బాల = చిన్నపిల్ల; నూత్నవివాహ = కొత్తపెళ్ళికూతురుగా; సు = మేలైన; శ్రీ = కాంతి యొక్క; విలాసిని = విలాసవతి; దీన = దీనురాలు; కంపిత = చలించిన; చిత్త = మనస్సుకలామె; నీ = నీ; కున్ = కు; ఇదె = ఇదిగో; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; కావవే = కాపాడుము; కరుణామయ = దయగల; ఆత్మక = మనసుకలవాడ; కంస = కంసుడా; మానవవల్లభా = రాజా.

భావము:

కంసుడు ఆకాశవాణి పలుకులు విని చెల్లి దేవకిని చంపబోతుంటే. వసుదేవుడు అతనిని శాంత పరచే సందర్భంలో దీ పద్యం.

       కంసమహారాజా! దయామయా! ఈమె నీకు వరసకు చెల్లెలే కాని, కూతురు లాంటిది. ఉత్తమురాలు. గౌరవించదగిన నడవడిక గలామె. అసలే భయస్తురాలు. అందులో చిన్నవయస్సుపిల్ల. కొత్తపెళ్ళికూతురు. చక్కని లక్ష్మీకళలతో విలసిల్లుతున్నది. దీనురాలు భయంతో లోలోన వణికిపోతున్నది. ఇదిగో నేను నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఈమెను రక్షించు.