పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : వారిల్లు చొచ్చి (10.1-312-క.)

10.1-312-క.

వా రిల్లు చొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యిఁ ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డ వాదయ్యె సతీ!

టీకా:

వారి = వారి యొక్క; ఇల్లున్ = నివాసమును; చొచ్చి = దూరి; కడవలన్ = కుండలలోని; తోరంబు = గట్టిగాపేరుకొన్నది; అగు = ఐన; నెయ్యిన్ = నేతిని; త్రావి = తాగి; తుదిన్ = చివరకు; ఆ = ఆ; కడవల్ = కుండలను; వీరి = వీరి యొక్క; ఇంటన్ = ఇంటిలో; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; ఇడన్ = పెట్టగా; వారి = వారల; కిన్ = కి; వీరి = వీరల; కిని = కి; దొడ్డ = పెద్ద; వాదు = జగడము; అయ్యెన్ = అయినది; సతీ = ఇల్లాలా.

భావము:

గోపికలు బాలకృష్ణుడి అల్లరి యశోదాదేవికి చెప్తున్నారు – 

     ఓ యిల్లాలా! మీ సుపుత్రుడు వాళ్ళింట్లోకి దూరి ఘమఘమలాడే నె య్యంతా తాగేసి, చివరకి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసి పోయాడు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ పెద్ద గొడవ అయిపోయింది తెలుసా?