పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : శ్రీకృష్ణా యదుభూషణా (1-201-శా.)

1-201-శా.

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

టీకా:

శ్రీకృష్ణా = కృష్ణా {కృష్ణ - నల్లనివాడు}; యదుభూషణా = కృష్ణా {యదు భూషణా - యదు వంశమునకు భూషణము వంటి వాడు / కృష్ణుడు}; నరసఖా = కృష్ణా {నరసఖ - అర్జునునకు సఖుడు / కృష్ణుడు}; శృంగారరత్నాకరా = కృష్ణా {శృంగార రత్నాకర -శృగార రసమునకు సముద్రము వంటివాడు / కృష్ణుడు}; లోకద్రోహినరేంద్రవంశదహనా = కృష్ణా {లోకద్రోహినరేంద్రవంశదహనా - దుష్టరాజవంశముల నాశనము చేయువాడు, కృష్ణుడు}; లోకేశ్వరా = కృష్ణా {లోకేశ్వర - లోకములకు ఈశ్వరుడు / కృష్ణుడు}; దేవత = దేవతల; అనీక = సమూహమునకును; బ్రాహ్మణ = బ్రాహ్మణులకును; గోగణ = గోవులమందకును; ఆర్తి = బాధలను; హరణా = హరించువాడా / కృష్ణా; నిర్వాణ సంధాయకా = కృష్ణా {నిర్వాణ సంధాయిక - మోక్షమును కలింగించువాడు / కృష్ణుడు}; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; త్రుంపవే = తెంపుము; భవ = సంసార; లతల్ = బంధనములు; నిత్యానుకంపానిధీ = కృష్ణా {నిత్యానుకంపానిధీ -నిత్యమైన దయకు నిలయమైనవాడు / కృష్ణుడు}.

భావము:

శ్రీ కృష్ణ! యదుకులవిభూషణ! విజయమిత్ర! శృంగార రసరత్నాకర! జగత్కంటకులైన మహీపతుల వంశాలను దహించు వాడ! జగదీశ్వర! ఆపన్నులైన అమరుల, అవనీసురుల, ఆవులమందల ఆర్తులను బాపువాడ! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను తెంపెయ్యి.