పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : శంకర భక్తమానసవశంకర (10.2-315-ఉ.)

10.2-315-ఉ.

శంర! భక్తమానసవశంకర! దుష్టమదాసురేంద్ర నా
శంర! పాండునీలరుచిశంకరవర్ణ నిజాంగ! భోగి రా
ట్కంణ! పార్వతీహృదయకైరవ కైరవమిత్ర! యోగిహృ
త్పంజ పంకజాప్త! నిజతాండవఖేలన! భక్తపాలనా!

టీకా:

శంకర = శివుడు {శంకరుడు - శుభమును చేయువాడు, శివుడు}; భక్తమానసవశంకర = శివుడు {భక్తమానసవశంకరుడు - భక్తుల మనసులను వశపరచుకొనువాడు, శివుడు}; దుష్టమదాసురేంద్రనాశంకర = శివుడు {దుష్టమదాసురేంద్రనాశంకరుడు - దుర్మార్గులైన రాక్షసరాజులను నాశనము చేయువాడు, శివుడు}; పాండునీలరుచిశంకరవర్ణనిజాంగ = శివుడు {పాండునీలరుచిశంకరవర్ణనిజాంగుడు - పాండు (తెలుపు) నీల (నలుపు) రుచి (కాంతులచే) శంకర (శుభము కలుగజేయుచున్న) వర్ణ (రంగులు కల) నిజ (తన) అంగ (దేహము కలవాడు), శివుడు}; భోగిరాట్కంకణ = శివుడు {భోగిరాట్కంకణుడు - భోగిరాట్ (సర్పరాజు, వాసుకి) కంకణముగా కలవాడు, శివుడు}; పార్వతీహృదయకైరవకైరవమిత్ర = శివుడు {పార్వతీహృదయకైరవకైరవమిత్రుడు - పార్వతి మనస్సు అను కైరవ (తెల్ల కలువకు) కైరవమిత్రుడు (చంద్రుడు వంటి వాడు), శివుడు}; యోగిహృత్పంకజపంకజాప్త = శివుడు {యోగిహృత్పంకజపంకజాప్తుడు - యోగుల హృదయములను పంకజ (పద్మముల)కు పంకజాప్తుడు (సూర్యుని వంటి వాడు), శివుడు}; నిజతాండవఖేలన = శివుడు {నిజతాండవఖేలనుడు - నిజ (స్వకీయమైన) తాండవమను నాట్యమును ఖేలన (ఆడు వాడు), శివుడు}; భక్తపాలనా = శివుడు {భక్తపాలనుడు - భక్తులను పాలించువాడు, శివుడు}.

భావము:

శంకరా! సుఖములు కలుగజేసెడి వాడ! భక్తుల మనసులను వశంచేసుకొనువాడ! దుష్టులు మదోన్మత్తులు నైన రాక్షసులను నశింపజేయు వాడ! శుభకరము లైన రంగులు తెలుపు దేహమున, నీలము కంఠమున ప్రకాశించు వాడ! సర్ప భూషణుడా! పార్వతీ దేవి హృదయ పద్మమునకు చంద్రుని వంటి వాడ! యోగిజనుల హృదయ కమలములకు సూర్యునివంటి వాడ! తాండవ ప్రియుడా! భక్తులను పరిపాలించు వాడా!

       బాణాసురుడు పరమశివుని ఇలా స్తుతిస్తున్నాడు.