పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : సరసవచోవిలాస (4-974-చ.)

4-974-చ.

సవచో విలాస! గుణసాగర! సాగర మేఖలా మహీ
ణ ధురంధరప్రకట వ్య భుజాభుజగేంద్ర! రాజశే
!ఖర దూషణప్రముఖ గాఢ తమఃపటలప్రచండభా
స్క!కఱకంఠ కార్ముక విఖండన ఖేలన! భక్తపాలనా!

టీకా:

సరసవచోవిలాస = రామచంద్ర {సరసవచోవిలాస - సరస (మనోహరమైన) వచస్ (పలుకలతో) విలాస (శోభిల్లువాడ), రామ}; గుణసాగర = రామచంద్ర {గుణసాగర - సుగుణములకు సాగర (సముద్రము వంటివాడు), రాముడు}; సాగర మేఖలా మహీభరణ ధురంధర = రామచంద్ర {సాగరమేఖలామహీభరణధురంధర - సాగర (సముద్రములే) మేఖలా (సరిహద్దులుగాగల) మహీ (భూమండలమును) భరణ (పాలించుట యందు) ధురంధర (మిక్కిలి నేర్పుగలవాడు), రాముడు}; ప్రకటభవ్య భుజా భుజగేంద్ర = రామచంద్ర {ప్రకటభవ్య భుజా భుజగేంద్ర - ప్రకట (ప్రసిద్ధమైన) భవ్య (శుభమైన) భుజ (భుజములనెడి) భుజగేంద్ర (గొప్పసర్పములు గలవాడు), రాముడు}; రాజశేఖర = రామచంద్ర {రాజశేఖర - రాజులలో (శ్రేష్టమైనవాడు), రాముడు}; ఖరదూషణప్రముఖగాఢతమఃపటలప్రచండభాస్కర = రామచంద్ర {ఖరదూషణప్రముఖగాఢతమఃపటలప్రచండభాస్కర - ఖర (వాడియైన, ఖరయనెడిరాక్షసుడు) దూషణ (దూషించదగినది, దూషణుడు యనెడి రాక్షసుడు) ప్రముఖ (మొదలగు) గాఢ (గాఢమైన) తమః (చీకట్ల) పటల (తెరలకు) ప్రచండ (భయంకరమైన) భాస్కర (సూర్యునివంటివాడు), రాముడు}; కఱకంఠకార్ముకవిఖండనఖేలన = రామచంద్ర {కఱకంఠకార్ముకవిఖండనఖేలన - కఱకంఠ (శివ) కార్ముక (ధనుస్సును) విఖండన (విరిచుట యనెడి) ఖేలన (క్రీడ గలవాడు), రాముడు}; భక్తపాలనా = రామచంద్ర {భక్తపాలనా - భక్త (భక్తులను) పాలన (పరిపాలించెడివాడు), రాముడు}.

భావము:

చక్కటి మాటతీరు గలవాడ! సుగుణాల పోగా! చతుస్సాగర పర్యంతం గల భూమండలము అంతటిని మిక్కిలినేర్పుగా ఏలినవాడ! దివ్యమైన మహాశక్తివంతమైన ఆదిశేషుని వంటి భుజబలము గలవాడ! రాజుశ్రేష్ఠుడ! ఖరుడు దూషణుడు మున్నగు రాక్షసు లనే చిక్కటి చీకట్లను తీక్షణమైన సూర్యుని వలె అణచినవాడ! శివధనస్సును విలాసంగా విరచినవాడ! భక్తులను రక్షించువాడ! శ్రీరామచంద్రప్రభు! నీకు నమస్కారము.