పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : సంసార (7-171-సీ.)

7-171-సీ.

సంసారజీమూతసంఘంబు విచ్చునే? ;
క్రిదాస్యప్రభంనము లేక;
తాపత్రయాభీలదావాగ్ను లాఱునే? ;
విష్ణుసేవామృతవృష్టి లేక;
ర్వంకషాఘౌఘలరాసు లింకునే? ;
రిమనీషాబడబాగ్ని లేక;
నవిపద్గాఢాంధకారంబు లడగునే? ;
ద్మాక్షునుతిరవిప్రభలు లేక;

7-171.1-తే.

నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే? ముఖ్యమైన
శార్ఙ్గకోదండచింతనాంనము లేక
తామరసగర్భునకు నైన దానవేంద్ర!"

టీకా:

సంసార = సంసారము యనెడి; జీమూత = మబ్బుల; సంఘంబు = సమూహము; విచ్చునే = విడిపోవునా ఏమి; చక్రి = నారాయణుని; దాస్య = కైంకర్యము యనెడి; ప్రభంజనము = పెనుగాలి; లేక = లేకుండగ; తాపత్రయ = తాపత్రయములు యనెడి {తాపత్రయము - 1ఆధ్యాత్మికము 2ఆదిభౌతికము 3అధిదైవికము అనెడి బాధలు}; ఆభీల = భయంకరమైన; దావాగ్నులు = కారుచిచ్చులు; ఆఱునే = ఆరిపోవునా ఏమి; విష్ణు = నారాయణుని; సేవా = సేవ యనెడి; అమృత = అమృతపు; వృష్టి = వర్షము; లేక = లేకుండగ; సర్వంకష = ఎల్లెడలను నిండిన; అఘ = పాపముల; ఓఘ = సముదాయములనెడి; జలరాసులు = సముద్రములు; ఇంకునే = ఇంకిపోవునా ఏమి; హరి = నారాయణుని; మనీషా = ప్రజ్ఞ యనెడి; బడబాగ్ని = బడబాగ్ని; లేక = లేకుండగ; ఘన = గొప్ప; విపత్ = ఆపదలనెడి; గాఢ = చిమ్మ; అంధకారంబుల్ = చీకటులు; అడగునే = నశించునా ఏమి; పద్మాక్షున్ = నారాయణుని {పద్మాక్షుడు - పద్మములను పోలెడి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; నుతి = స్తోత్రము యనెడి; రవి = సూర్యుని; ప్రభలు = కాంతులు; లేక = లేకుండగ.
నిరుపమా = సాటిలేని; అపునరావృత్తిన్ = తిరిగిరానివిధమైన; నిష్కళంక = నిర్మలమైన; ముక్తినిధిన్ = మోక్షపదవిని; కానన్ = చూచుటకు; వచ్చునే = అలవియా ఏమి; ముఖ్యము = ముఖ్యము; ఐన = అయిన; సార్ఙ్గకోదండ = నారాయణుని {సార్ఙ్గకోదండడు - సార్ఙ్గ్యము యనెడి ఖడ్గము కోదండము యనెడి విల్లు మొదలగు ఆయుధములు గలవాడు, విష్ణువు}; చింతన = ధ్యానము యనెడి; అంజనము = కాటుక; లేక = లేకుండగ; తామరసగర్భున = బ్రహ్మదేవుని {తామరసగర్భుడు - పద్మమునందు పుట్టినవాడు, బ్రహ్మ}; కున్ = కు; ఐనన్ = అయినను; దానవేంద్ర = రాక్షసరాజా.

భావము:

నాయనగారు! రాక్షసరాజా! పెనుగాలి విసరు లేకుండా కారుమబ్బుల గుంపులు విడిపోవు కదా. అలాగే చక్రధారి సేవ చేయడం లేకుండ సంసారబంధాలు తొలగిపోవు. వర్షం పడకపోతే అడవులలో రగుల్కుంటున్న దావాగ్నులు ఆరవు. అలాగే హరిసేవ అనే అమృతం పడకపోతే తాపత్రయాలు చల్లారవు. బడబాగ్ని చెలరేగితే సముద్రాలైనా ఇంకిపోతాయి. అలాగే నారాయణ చింతన ఉంటే పాపాలు పటాపంచలు ఐపోతాయి. సూర్యకిరణాలు సోకకుండా చీకటి తెరలు విడిపోవు. అలాగే విష్ణుధ్యానం ఉంటే చుట్టుముట్టిన ఎంతటి ఆపదలైనా తొలగిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే; శార్ఙ్ఞం అనే కత్తి, కోదండం అనే విల్లులతో చావుపుట్టుకల చక్రాన్ని చీల్చిచెండాడే విష్ణుమూర్తిమీది భక్తి అనే అంజనం లేకుండా నిర్మలమైన నిరుపమానమై పునర్జన్మ లేని ముక్తి అనే పెన్నిధిని అందుకోడం ఎవరికైనా అసాధ్యం. ఆ విష్ణుమూర్తి బొడ్డు తామరలో పుట్టిన బ్రహ్మదేవుడికి అయినప్పటికి ఇదే తప్ప మరోమార్గం లేదు.

  ఇన్నాళ్ళ బట్టి చదవుకున్నావు కదా చదువులో నీ ప్రతిభా పాటవాలు ఏపాటివో చూపిం చని అడిగిన హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు ఏ జంకు లేకుండ సమాధానం చెప్తున్నాడు.