పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : సకలప్రాణి (1-185-మ.)

1-185-మ.

లప్రాణిహృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ
క్ష్మళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా ర్భంబుఁ దాఁ జక్రహ
స్తకుఁడై వైష్ణవమాయఁ గప్పి కురు సంతానార్థియై యడ్డమై
ప్రటస్ఫూర్తి నడంచె ద్రోణతనయబ్రహ్మాస్త్రమున్ లీలతోన్.

టీకా:

సకల = సమస్త మైన; ప్రాణి = ప్రాణుల యొక్క; హృద = హృదయముల; అంతరాళములన్ = లోలోపల; భాస్వత్ = ప్రకాశించే; జ్యోతి = దీపము; ఐ = అయ్యి; ఉండు = ఉండే; సూక్ష్మ = సూక్ష్మ మైన; కళుండు = నేర్పున్న వాడు; అచ్యుతుఁడు = హరి {అచ్యుతుడు – చ్యుతము లేని వాడు / విష్ణువు}; ఆ = ఆ; ఎడన్ = సమయములో; విరటజా = ఉత్తర యొక్క {విరటజ - విరటుని సంతానము / ఉత్తర}; గర్భంబున్ = గర్భమును; తాన్ = తాను; చక్ర = చక్రమును; హస్తకుఁడు = చేతియందు ధరించిన వాడు; ఐ = అయ్యి; వైష్ణవ = విష్ణువు {విష్ణువు – విశ్వమంతా వ్యాపించి ఉండు వాడు / హరి} యొక్క; మాయన్ = మాయను; కప్పి = కప్పి; కురు = కురువంశ; సంతాన = సంతానమును; అర్థి = కోరినవాడు; ఐ = అయ్యి; అడ్డము = అడ్డముగా నిలబడిన వాడు; ఐ = అయ్యి; ప్రకట = అభివ్యక్త మైన; స్ఫూర్తిన్ = స్పూర్తితో; అడంచెన్ = అణచెను; ద్రోణతనయు = అశ్వత్థామ {ద్రోణతనయుడు - ద్రోణుని కుమారుడు / అశ్వాత్థామ}; యొక్క; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రమును; లీల = అవలీల / లీలావిలాసము; తోన్ = గా.

భావము:

సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాళాల్లో జ్యోతిర్మూర్తియై ప్రకాశించే వాసుచేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించటం కోసం చక్రాన్ని ధరించి, ఉత్తరా గర్భాన్ని యోగమాయతో కప్పివేసి, అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు.