తేనెసోనలు(ప-హ) : రక్షకులులేనివారల (2-22-క.)
2-22-క.
రక్షకులు లేనివారల
రక్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్
రక్షింపు మనుచు నొక నరు
నక్షము బ్రార్థింపనేల యాత్మజ్ఞులకున్?
టీకా:
రక్షకులున్ = కాపాడేవాళ్ళు; లేనివారల = లేనివాళ్ళను; రక్షించెదన్ = కాపాడుదును; అనుచున్ = అంటూ; చక్రి = చక్ర ధారి - విష్ణువు; రాజు = ప్రభుత్వము కల వాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగ; రక్షింపుము = కాపాడుము; అనుచున్ = అని; ఒక = ఒక; నరున్ = మానవ; అక్షమున్ = అథముని; ప్రార్థింపన్ = వేడుకొనుట; ఏల = ఎందులకు; ఆత్మజ్ఞులు = ఆత్మ తత్త్వము తెలిసిన జ్ఞానులు; కున్ = కు.
భావము:
దిక్కులేని వాళ్ళకు దిక్కై రక్షిస్తా నంటు చక్రం ధరించే విష్ణుమూర్తి సిద్ధంగా ఉన్నాడు. మరింకా ఆత్మజులు, ప్రాజ్ఞులు అయిన వారు అసమర్థుడైన మానవుడు ఒకణ్ణి ప్రాధేయపడటం అనవసరం కదా.
– ఇలా శుకబ్రహ్మ పరీక్షిత్తుకి విరాడ్విగ్రహం వివరించి భాగవత తత్వం చెప్పాడు.