పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పుట్టితి బుద్ధి యెఱింగితి (10.1-536-క.)

10.1-536-క.

పుట్టితి; బుద్ధి యెఱింగితిఁ;
బుట్టించితి జగము; సగము పోయెను బ్రాయం;
బిట్టివి నూతన సృష్టులు
పుట్టుట లే; దౌర! యిట్టి బూమెలు భూమిన్.

టీకా:

పుట్టితిన్ = జన్మించితిని; బుద్ది = వివేకమును, ఙ్ఞానము; ఎఱింగితి = తెలుసుకొంటి; పుట్టించితిన్ = సృష్టించితిని; జగమున్ = లోకములను; సగము = అర్థభాగము; పోయెను = గడచిపోయినది; ప్రాయంబు = వయసు; ఇట్టివి = ఇలాంటి; నూతన = సరికొత్త; సృష్టులు = సృష్టింపబడుటలు; పుట్టుట = కలుగుట; లేదు = జరుగలేదు; ఔరా = అయ్యో; ఇట్టి = ఇలాంటి; బూమెలు = మాయలు; భూమిన్ = భూలోకమున.

భావము:

ఏనాడో పుట్టాను. అన్నినేర్చుకొన్నాను. జగత్తు అంతా సృష్టించాను. వయస్సు సగం గడిచిపోయింది. ఇంతవరకు ఎప్పుడు ఇట్లు కొత్త సృష్టులు పుట్టడం చూడలేదు. ఔరా! నేను పుట్టించిన భూలోకంలో యిన్ని మాయలు ఉన్నాయా!

      బ్రహ్మ దేవుడు గొల్లపిల్లలు గో వత్సాదులను మాయచేసి, ఓ గుహలో దాచాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ జీవాలన్నీ తానే అయ్యి భూ కాలంలో సంవత్సరం పాటు నడిపాడు. వాటన్నిటిని చూసి తెలుసుకోలేక, బొడ్డు తామరలో వికసించిన ఆ బ్రహ్మ దేవుడు ఇలా ఆశ్చర్యపోతున్నాడు