పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పుట్టిపుట్టడు (10.1-310-మత్త.)

10.1-310-మత్త.

పుట్టిపుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా
నుట్టియందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై
పెట్టఁజాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ
ట్టిమీఁగడపాలు చేరలఁ ట్టి త్రావెఁ దలోదరీ!

టీకా:

పుట్టిపుట్టడు = లేకలేకపుట్టినవాడు; నేడు = ఇవాళ; దొంగిలబోయి = దొంగిలించుటకువెళ్ళి; మా = మా యొక్క; యిల్లున్ = నివాసమును; చొచ్చి = ప్రవేశించి; తాన్ = అతను; ఉట్టి = ఉట్టి {ఉట్టి - పాలుపెరుగులాంటివి పిల్లులకు అందకుండుటకై పైన వేళ్ళాడదీసెడి తాళ్ళసాధనము}; అందక = అందకపోవుటచే; ఒక = ఒక; ఱోలున్ = రోటిని {రోలు - ధాన్యాదులను దంచుటకైన గుండ్రటి సాధనము}; పీటలు = పీటలు; ఒక్క = ఒక; ప్రోవు = పోగులా; ఇడి = పెట్టి; యెక్కి = పైకెక్కి; చై = చెయ్యి; పెట్ట = పెట్టుటకు; చాలకన్ = సరిపోకపోవుటచేత; కుండ = కుండకు; క్రిందన్ = కిందపక్కని; ఒక = ఒకానొక; పెద్ద = పెద్ద; తూటు = కన్నము; ఒనరించి = చేసి; మీ = మీ యొక్క; పట్టి = పిల్లవాడు; మీగడపాలు = మీగడకట్టినపాలను; చేరలన్ = దోసిళ్ళతో; పట్టి = పట్టుకొని; త్రావెన్ = తాగెను; తలోదరీ = సుందరీ {తలోదరి - తల (పలుచ)నైన ఉదరము కలది, స్త్రీ}.

భావము:

కృష్ణుడి అల్లరికి గోపికలు ఓపికలు లేక యశోదమ్మతో చెప్తున్నారు. –

     ఓ సన్నకడుపు సుందరీ! యశోదా! మీ వాడు మొన్నే కదా పుట్టాడు. అప్పుడే చూడు దొంగతనాలు మొదలెట్టేసాడు. మా యింట్లో దూరాడు. ఉట్టిమీది పాలు పెరుగు అందలేదట. రోళ్ళు, పీటలు ఒకదానిమీద ఇంకోటి ఎక్కించాడు. వాటిమీదకి ఎక్కినా చెయ్యి పెడదామంటే అందలేదట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టాడు. కారుతున్న మీగడపాలు దోసిళ్ళతో పట్టుకొని కడుపు నిండా తాగేసాడు.