పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పుట్టంబుట్ట (1-7-శా.)

1-7-శా.

పుట్టంబుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
నెట్టంగల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టేవెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మయో! యమ్మ మేల్
ట్టున్నాకగుమమ్మనమ్మితిఁ జుమీబ్రాహ్మీ! దయాంభోనిధీ!

టీకా:

పుట్టన్ = పుట్టలో; పుట్ట = పుట్టి ఉండ లేదు (వాల్మీకిని కాదు); శరంబునన్ = రెల్లుపొదలో; మొలవ = పుట్టి ఉండ లేదు (సుబ్రహ్మణ్యుడను కాదు) {పాఠాంతరం - పుట్టంబుట్టశిరంబున్ మొలువ = శిరస్సు మీద పుట్టపుట్టి ఉన్నవాడను కాదు (వాల్మీకిని కాదు)}; అంభస్ = జల; యాన = ప్రయాణ; పాత్రంబునన్ = సాధనములో - పడవలో; నెట్టన్ = పుట్టుకను; కల్గను = పొందని వానిని (వ్యాసుని కాదు); కాళిన్ = కాళి; కొల్వను = ఆరాధించను (కాళిదాసును కాదు); పురాణింపన్ = పురాణ (భాగవత) రచనకి; దొరంకొని = పూనుకొని; ఉంటిని = ఉన్నాను; మీఁదు = ముందు చెప్పిన; ఎట్టే = అటువంటి వారి; వెంటన్ = పద్ధతినే; చరింతున్ = నడుస్తాను; తత్ = ఆ; సరణి = విధమును; నాకు = నాకు; ఈవు = ఇవ్వుము; అమ్మ = తల్లీ; ఓ = ఓ; అమ్మ = అమ్మ; మేల్ = మంచి; పట్టున్ = దన్నుగా; నాకు = నాకు; అగుము = ఉండుము; అమ్మ = తల్లీ; నమ్మితిన్ = (నిన్నే) నమ్మొకొంటిని; చుమీ = సుమా; బ్రాహ్మీ = సరస్వతీదేవీ {బ్రహ్మి – బ్రహ్మ దేవుని భార్య, సరస్వతి}; దయ = దయ అనే; అంభోనిధీ = సముద్రమా {అంభోనిధి - అంభస్ (నీటియొక్క) నిధి (పెద్ద పోగు), సముద్రము}.

భావము:

అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! *నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ! {*‘పుట్టంబుట్టశిరంబునన్ మొలవ’ అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్ట పుట్టిన వాల్మీకిని కాదు}