పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పొలతుల (9-335-సీ.)

9-335-సీ.

పొలతుల వాలుచూపుల యంద చాంచల్య;
బలల నడుముల యంద లేమి;
కాంతాలకములంద కౌటిల్యసంచార;
తివల నడపుల యంద జడిమ;
ముగుదల పరిరంభముల యంద పీడన;
మంగనాకుచముల యంద పోరు;
డతుల రతులంద బంధసద్భావంబు;
తులఁబాయుటలంద సంజ్వరంబు;

9-335.1-తే.

ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు
లంద చౌర్యంబు; వల్లభు లాత్మ సతుల
నాఁగి క్రొమ్ముళ్ళు పట్టుటం క్రమంబు; 
రామచంద్రుఁడు పాలించు రాజ్యమందు.

టీకా:

పొలతుల = స్త్రీల; వాలుచూపుల = వాడిచూపుల; అంద = లోనే; చాంచల్యము = అస్థిరత్వము, చపలత్వం; అబలల = స్త్రీల; నడుముల = నడుముల; అందన్ = లోనే; లేమి = తక్కువగుటలు, బీదతనం; కాంత = స్త్రీల; అలకములు = శిరోజములు; అందన్ = లోనే; కౌటిల్య = వంకరగ, కుటిలత్వపు; సంచారము = తిరుగుటు, వర్తన; అతివల = స్త్రీల; నడపుల = నడకల; అంద = లోనే; జడిమ = మాంద్యము, బద్దకము; ముగుదల = స్త్రీల; పరిరంభముల = ఆలింగనమలు; అంద = లోనే; పీడనము = అణచుట, నొక్కుట; అంగనా = స్త్రీల; కుచముల = స్తనములు; అంద = అందే; పోరు = సంఘర్షణ, ఒరిపిడి; పడతుల = స్త్రీల; రతులు = కలయికలు; అంద = లోనే; బంధసత్ = కట్టివేయు, బంధించే; భావంబు = ఉద్దేశ్యము, బుద్ధి; సతులన్ = స్త్రీలను; పాయుటలు = విరహములు; అంద = లోనే; సంజ్వరంబు = తాపము, అనారోగ్యం.

సతులన్ = స్త్రీలను; పాయుటలు = విరహములు; అంద = లోనే; సంజ్వరంబు = తాపము, సంతాపము; ప్రియులు = ప్రియులు; ప్రియురాండ్ర = ప్రియురాళ్ళ; మనములన్ = మనసు లందు; బెరసి = వ్యాపించి; తార్పులు = తార్చుటల; అందన్ = లోనే; చౌర్యంబు = దొంగపనులు; వల్లభులు = భర్తలు; అత్మ = తమ; సతులన్ = భార్యలను; ఆగి = అడ్డగించి; క్రొమ్ముళ్ళు = జడలు; పట్టుటలు = పట్టుకొనుటలు; అంద = లోనే; అక్రమంబు = అక్రమములు, మోసగించుటలు; రామచంద్రుడు = శ్రీరాముడు; పాలించు = ఏలెడి; రాజ్యము = రాజ్యము; అందు = లో.

భావము:

శ్రీరాముని పాలనలో ఉన్న రాజ్యం రామరాజ్యం. ఆ రామరాజ్యం అంతా ఎంత ధర్మ బద్ధంగా సాగింది అంటే.

   స్త్రీల వాలుచూపులలో మాత్రమే చాంచల్యం కనిపించేది. వనితల నడుములలో మాత్రమే పేదరికం ఉండేది. నెలతల తలవెంట్రుకలలో మాత్రమే కౌటిల్యం ఉండేది. తరుణుల నడకలలో మాత్రమే మాంద్యం ఉండేది. నెలతల కౌగలింతలలో మాత్రమే పీడన ఉండేది. కామినుల స్తనాల్లో మాత్రమే ఘర్షణ ఉండేది. సతులతో కలయికల్లో మాత్రమే బంధాలు ఉండేవి. కాంతల ఎడబాటులలో మాత్రమే సంతాపం ఉండేది. ఎవరి ప్రియురాండ్ర మనసు వారు తెలిసి దొంగిలించుటలో మాత్రమే దొంగతనాలు ఉండేవి. ప్రియభార్యలను భర్తలు అడ్డగించి జడలుపట్టుకొని లాగటంలో మాత్రమే అక్రమాలు ఉండేవి.