పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పరగన్ (1-161-మ.)

1-161-మ.

రఁగన్ మా మగవార లందఱును మున్ బాణప్రయోగోపసం
ణాద్యాయుధవిద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరిపుత్త్రాకృతి నున్న ద్రోణుడవు, నీ చిత్తంబులో లేశముం
రుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే.

టీకా:

పరఁగన్ = ప్రసిద్ధముగా; మా = మా యొక్క; మగవారలు = భర్తలు; అందఱును = అందరును; మున్ = పూర్వము; బాణ = బాణములను; ప్రయోగ = ప్రయోగించుట; ఉపసంహరణ = మరల్చుట; ఆది = మొదలగు; ఆయుధ = అస్త్ర; విద్యలు = విద్యలు; అన్నియును = అన్నీ; ద్రోణ = ద్రోణుడు అను; ఆచార్యు = గురువు; చేన్ = వలన; అభ్యసించిరి = నేర్చుకొంటిరి; పుత్త్ర = పుత్రని యొక్క; ఆకృతిన్ = రూపముతో; ఉన్న = ఉన్నటువంటి; ద్రోణుడవు = ద్రోణుడవు; నీ = నీ; చిత్తంబు = మనసు; లోన్ = లో; లేశమున్ = కొంచము కూడా / పిసరంతైన; కరుణ = దయ యొక్క; సంగము = స్పర్శ; లేక = లేకుండగా; శిష్య = శిష్యుల యొక్క; సుతులన్ = పుత్రులను; ఖండింపఁగాన్ = సంహరింపగా; పాడియే = న్యాయమా.

భావము:

“ ఇంతకుముందు గురువర్యులు ద్రోణాచార్యులవారి సన్నధిలోనే కదా మా మగవాళ్ళు అందరు బాణాలు ప్రయోగించటం ఉపసంహరించటం మొదలైన యుద్ధవిద్యలు అన్ని అభ్యసించారు. అశ్వత్థామా! నీవు పుత్రరూపంలో ఉన్న ద్రోణాచార్యుడవు కదా. అలాంటి నీకు హృదయంలో కనికరం అన్నది ఇసుమంతైనా లేకుండా ఇలా శిష్యుల సంతానాన్ని సంహరించటం న్యాయమా చెప్పు నాయనా!