పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పాఱడు (7-194-ఉ.)

7-194-ఉ.

పాఱఁడు లేచి దిక్కులకు; బాహువు లొడ్డఁడు; బంధురాజిలోఁ
దూఱఁడు; ఘోరకృత్య మని దూఱఁడు; తండ్రిని మిత్రవర్గముం
జీరఁడు; మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిం
దాఱఁడు; కావరే యనఁడు; తాపము నొందఁడు; కంటగింపఁడున్.

టీకా:

పాఱడు = పారిపోడు; లేచి = లేచిపోయి; దిక్కుల్ = దూరప్రదేశముల; కున్ = కు; బాహువులు = చేతులు; ఒడ్డడు = అడ్డము పెట్టడు; బంధు = చుట్టముల; రాజి = సంఘము; లోన్ = లోకి; దూఱడు = ప్రవేశింపడు; ఘోర = ఘోరమైన; కృత్యము = కార్యము, పని; అని = అనుచు; దూఱడు = తిట్టడు; తండ్రిని = తండ్రిని; మిత్ర = స్నేహితుల; వర్గమున్ = సమూహమును; చీరడు = పిలువడు; మాతృ = తల్లుల; సంఘము = సమూహము; వసించు = ఉండెడి; సువర్ణ = బంగారు; గృహంబు = ఇంటి; లోని = లోపలి; కిన్ = కి; తాఱడు = దాగికొనడు; కావరే = కాపాడండి; అనడు = అనడు; తాపమున్ = సంతాపమును; ఒందడు = పొందడు; కంటగింపడున్ = ద్వేషముచూపడు.

భావము:

హిరణ్యకశిపుడు రాక్షస సైనికులతో చేత దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రహ్లాదుని చితగ్గొట్టిస్తున్నాడు. ప్రహ్లాదుడు మహా మహిమాన్విత భక్తుడు కదా,

     రాక్షసులు ఎన్ని బాధలు పెడుతున్నా ప్రహ్లాదుడు భగవంతుంణ్ణి స్మరిస్తున్నాడు తప్ప కళ్ళ నీళ్ళు పెట్టటం లేదు, ఏ మాత్రం జంకడు. (దూఱడుని ఉన్న రెండర్థాలుతో రెండు సార్లు వాడారు)ఇటు అటు దూరంగా పారిపోడు. కొట్టద్దని చేతులు అడ్డం పెట్టుకోడు. బంధువుల గుంపు లోకి దూరిపోడు. “ఘోరం, అన్యాయం ” అంటు గోల చేయడు. కొట్టిస్తున్న తండ్రిని తిట్టను కూడ తిట్టడు. తన స్నేహితులను ఎవరిని సాయం చెయ్యమని పిలవడు. తల్లులు ఉండే బంగారు మేడల లోపలకి పోయి దాక్కోడు. “కాపాడండి కాపాడండి ” అని కూడ అనడు. అస్సలు బాధ పడడు. వాళ్ళని ఎందుకు కొట్టరు అంటు ఎవరిమీద అసూయ చెందడు.

     ఇలాంటి పిల్లాడిని ఎక్కడైనా ఉంటాడా?