పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పల్లవ (10.1-1713-సీ.)

10.1-1713-సీ.

ల్లవ వైభవాస్పదములు పదములు;
నకరంభాతిరస్కారు లూరు;
రుణప్రభామనోరములు గరములు;
కంబుసౌందర్యమంళము గళము;
హిత భావాభావధ్యంబు మధ్యంబు;
క్షురుత్సవదాయి న్నుదోయి;
రిహసితార్ధేందు టలంబు నిటలంబు;
జితమత్త మధుకరశ్రేణి వేణి;

10.1-1713.1-ఆ.

భావజాశుగముల ప్రాపులు చూపులు;
కుసుమశరుని వింటి కొమలు బొమలు;
చిత్తతోషణములు చెలువభాషణములు;
లజనయన ముఖము చంద్రసఖము.

టీకా:

పల్లవ = చిగురాకుల యొక్క; వైభవ = గొప్పదనములకు; ఆస్పదములు = ఉనికిపట్లు; పదములున్ = పాదములు; కనక = బంగారపు; రంభా = అరటిబోదెలను; తిరస్కారులు = తిరస్కరించునవి; ఊరులు = తొడలు; అరుణ = ఎర్రనైన; ప్రభా = కాంతులతో; మనోహరములు = అందమైనవి; కరములు = చేతులు; కంబు = శంఖము వంటి; సౌందర్య = చక్కదనముచేత; మంగళము = శుభప్రదమైనది; గళము = కంఠము; మహిత = గొప్ప; భావాభావమధ్యంబు = ఉందోలేదో తెలియనిది {భావాభావమధ్యంబు - భావ(ఉందో) అభావ (లేనిది) మధ్యంబు (సందేహాస్పదమైనది), ఉందోలేదో తెలియనిది}; మధ్యంబు = నడుము; చక్షుః = కన్నులకు; ఉత్సవ = సంతోషమును; దాయి = ఇచ్చునవి; చన్ను = స్తనముల; దోయి = ద్వయము; పరిహసిత = ఎగతాళి చేయబడిన; అర్ధేందు = అర్ధచంద్రుల యొక్క; పటలంబు = సమూహము కలది; నిటలంబు = నుదురు; జిత = గెలువబడిన; మధుకర = తుమ్మెదల; శ్రేణి = సమూహములు వంటిది; వేణి = జడ.
భావజ = మన్మథుని {భావజుడు - సంకల్పము చేత పుట్టువాడు, మన్మథుడు}; ఆశుగముల = బాణముల యొక్క; ప్రాపులు = ఉనికిపట్లు; చూపులు = దృష్టులు; కుసుమశరుని = మన్మథుని {కుసుమశరుడు - పుష్ప భాణములు కలవాడు, మన్మథుడు}; వింటి = ధనుస్సు యొక్క; కొమలు = కొసలు; బొమలు = కనుబొమ్మలు; చిత్త = మనస్సును; తోషణములు = సంతోషింపజేయునవి; చెలువ = అందగత్తె; భాషణములు = మాటలు; జలజనయన = పద్మాక్షి; ముఖము = ముఖము; చంద్ర = చంద్రబింబమునకు; సఖము = మిత్రము, వంటిది.

భావము:

విప్రుడు రుక్మిణి సందేశం శ్రీకృష్ణునికి విన్నవిస్తూ రుక్మణీదేవి అందాన్ని చెప్తున్నాడు –

       ఆమె చరణములు చిగురుటాకుల చెలువాన్ని మించుతాయి. తొడలు పసిడి అరటిబోదెల అందాన్ని తోసిపుచ్చుతాయి. అరచేతులు బాల అరుణుని ప్రభవలె మనోహరాలు. కంఠం శంఖం అంత కడు రమణీయమైనది. నడుము ఉందా లేదా అన్నంత సన్ననిది. స్తనద్వయం కళ్ళకి పండగ చేస్తుంది. నెన్నుదురు నెలవంక చక్కదనాన్ని గేలిచేస్తుంది. బారైన జడ గండుతుమ్మెదల బారును జయిస్తుంది. చూపులు పూల బాణాలు వేసే మన్మథుని తూపులు. కనుబొమలు మదనుని వింటికొనలు. మాటలు మనస్సుకి సంతోష కలిగించేవి. కలువ కళ్ళ చిన్నదాని వదనం చంద్రబింబంలా కమ్మనిది.