పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పలికెడిది (1-18-క.)

1-18-క.

లికెడిది భాగవత మఁట,
లికించెడివాడు రామద్రుం డఁట, నేఁ
లికిన భవహర మగునఁట,
లికెద, వేఱొండు గాథ లుకఁగ నేలా?

టీకా:

పలికెడిది = పలుకునది; భాగవతము = భాగవతము; అఁట = అట; పలికించెడి = పలికించెడి; వాడు = వాడు; రామభద్రుండు = రాముడు; అఁట = అట; నేన్ = నేను; పలికిన = పలికినట్లయిన; భవ = సంసార బంధనములు; హరము = తొలగుట; అగునఁట = అవుతుందట; పలికెద = (అందుకే) పలుకుదును; వేఱొండు = ఇంకొక; గాథ = కథ; పలుకఁగన్ = పలకటం; ఏలా = ఎందుకు.

భావము:

రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో రాయించేవాడు. రాసి నందువల్ల భవభందాలు పరిహారమౌతాయి కదా. అంచేత భాగవతాన్ని మాత్రమే రాస్తాను మిగతా వేవి రాయను.
    బహుళ ప్రాచుర్యం గల ఈ పద్యం మన పోతన్నగారి శైలి, అలతిపొలతి పలుకులతో అతి హృద్యంగా అలరించే అద్భుత శైలికి ఒక చక్కటి ఉదాహరణ. భాగవతం తనంతట తనే పలుకుతుంది నేను సాధనం మాత్రమే అంటున్నాడు. రమింప చేసేవాడు భద్రత ఒసగే వాడు అయిన భగవంతుడు శ్రీరాముడే పలికిస్తుంటే చిలకలా నే పలుకుతా అంతే అంటు ఈ రామచక్కని పంచదార చిలక అందించాడు. స్వయంభూగా పలకబోతున్న సాక్షాత్ భగవత్ స్వరూపం వ్యక్తంకావటంలోని నిమిత్తపాత్రత మోక్షాన్ని ఇస్తుంది కదా. అంతకన్నా కావలసిందేం ఉంది. అందుకే మిగతావన్నీ పరిత్యజించేస్తాను. ఈ పని మాత్రమే చేస్తాను అంటు సన్యాసం స్వీకరిస్తున్నాడు. దానితో ఇచ్చేవాడు, ఇవ్వబడేది, తీసుకొనేవాడు మధ్య అబేధ్య సంయోగం ఏర్పడిందేమో. అందుకే పెద్దలు బాగుపడటానికి భాగవతం అంటారేమో. అందుకే కైవల్యపదంబు జేరుకునై అని గ్రందాన్ని ప్రారంభించాడు.