తేనెసోనలు(ప-హ) : మన్నేటికిభక్షించెదు (10.1-336-క.)
10.1-336-క.
మన్నేటికి భక్షించెదు?
మన్నియమము లేల నీవు మన్నింపవు? నీ
యన్నయు సఖులును జెప్పెద
రన్నా!మన్నేల మఱి పదార్థము లేదే?
టీకా:
మన్ను = మట్టిని; ఏటికిన్ = ఎందుకు; భక్షించెదు = తినెదవు; మత్ = నా యొక్క; నియమములు = ఆంక్షలు, ఆజ్ఞలు; ఏలన్ = ఎందులకు; నీవున్ = నీవు; మన్నింపవు = అనుసరించవు; నీ = నీ యొక్క; అన్నయున్ = అన్నయ్య; సఖులునున్ = స్నేహితలు; చెప్పెదరు = చెప్పుతున్నారు; అన్నా = నాయనా; మన్ను = మట్టి; ఏలన్ = ఎందుకు; మఱి = ఇంకేమి; పదార్థము = తినదగినవస్తువు; లేదే = లేదా ఏమి.
భావము:
ఏమయ్యా కన్నయ్యా! మట్టెందుకు తింటున్నావు. నే వద్దని చెప్పేవేవి ఎందుకు లెక్క చేయవు. తల అలా అడ్డంగా ఊపకు. అన్న బలరాముడు, స్నేహితులు అందరు చెప్తున్నారు కదా. ఏం ఇంట్లో తినడానికి ఇంకేం లేవా పాపం.
అంటు ఆ అమాయకపు తల్లి ఆ నెరదంట పాపడిని చెయ్యి పట్టుకొని గదమాయిస్తోంది.