పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : మామావలవలు (10.1-821-క.)

10.1-821-క.

మామావలువలు ముట్టకు
మామా!కొనిపోకుపోకు న్నింపు తగన్
మా మానమేల కొనియెదు?
మామానసహరణ మేల? మానుము కృష్ణా!

టీకా:

మామా = మావి మావి; వలువలు = వస్త్రములు; ముట్టకు = ముట్టుకొనకుము; మామా = నాయనా; కొనిపోకుపోకు = పట్టుకుపోబోకుము; మన్నింపు = మామాట గౌరవించుము; తగన్ = మిక్కిలగా; మా = మా యొక్క; మానము = మర్యాదను; ఏల = ఎందుకు; కొనియెదవు = తీసెదవు; మా = మా యొక్క; మానస = మనస్సులను; హరణము = అపహరించుట; ఏలన్ = ఎందుకు; మానుము = విడువము; కృష్ణా = కృష్ణుడా.

భావము:

నాయనా! కృష్ణా! మా బట్టలు తాకొద్దు. వాటిని తీయకు. మా మాట విను. మా సిగ్గు తీయకు. మా మనస్సులు దొంగిలించకు. ఈ ప్రయత్నం వదిలిపెట్టు.

గోపికా వస్త్రాపహరణ బాగా ప్రసిద్దమైన ఘట్టం. కృష్ణుడు గోపికల వస్త్రములు పట్టుకొని నల్లవిరుగు చెట్టు (నీపము) ఎక్కాడు. నీళ్ళల్లో ఉన్న గోపికలు పెట్టు కున్న ఈ మొర బహు చక్కటిది. అక్షరం “మా” 7 సార్లు (మకారం 11 సార్లు) వృత్యనుప్రాసంగా ప్రయోగించ బడింది. మా మా – మా అందరివి, మామా – సంభోదన, మా మాన – మా యొక్క మానం, మా మానస – మా యొక్క మనస్సులు అని మామా 4 సార్లు వాడిన యమకాలంకారం పద్యానికి సొగసులు అద్దింది. గోపికలు అంటే ఆత్మలు, కృష్ణ అంటే బ్రహతత్వం, వలువలు అంటే అవిద్యా ఆవరణలు, మా అంటే అహంకారం అనుకుంటే వచ్చే శ్లేష విశిష్ఠ మైన అలంకారంగా భాసిస్తుంది. పాలపర్తి నాగేశ్వర శాస్త్రులు గారు “ప్రజ్ఞ అనె తల్లి తో బుట్టినది బ్రహ్మతత్వం గనుక జీవునికి మామ అయింది” అన్నారు.