పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : మావారిభస్మరాసుల (9-221-క.)

9-221-క.

మా వారి భస్మరాసుల
నీవారిం గలిపికొనుము; నెఱి మావారల్
నీ వారిఁ గలయ నాకము
మావారికిఁ గలుగు నిది ప్రమాణము తల్లీ!

టీకా:

మా = మాయొక్క; వారి = జనుల; భస్మ = బూడిద; రాసులన్ = గుట్టలను; నీ = నీయొక్క; వారిన్ = నీటియందు; కలిపికొనుము = కలిపేసుకొనుము; నెఱిన్ = చక్కగా; మా = మాయొక్క; వారల్ = జనులు; నీ = నీయొక్క; వారిన్ = నీటిలో; కలయన్ = కలయుటచేత; నాకమున్ = స్వర్గము; మా = మాయొక్క; వారి = జనుల; కిన్ = కి; కలుగున్ = దొరుకును; ఇది = ఇది; ప్రమాణము = యథార్థము; తల్లీ = అమ్మా.

భావము:

ఓ యమ్మా గంగమ్మతల్లి! మా పూర్వీకుల భస్మరాసులను నీ నీటిలో కలిపేసుకో. అలా చక్కగా నీ పవిత్రజలాలలో కలిస్తే మా వాళ్ళకు స్వర్గలోకప్రాప్తి కలుగుతుంది. ఇది యథార్థం.

   భాగీరథ ఘట్టంలోని పద్యమిది. భాగీరథ ప్రయత్నం అంటే బహుతర కష్టసాధ్యమని పేరు పడింది. పవిత్ర గంగానది భాగీరథి అనికూడ ప్రసిద్ధికెక్కింది. అంతటి మహనీయుడు భాగీరథుడు. గంగాదేవి కోసం తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను ఇలా వరం వేడుకుంటున్నాడు. ప్రాస, ఉత్తర స్థానాలలో నాలుగు పాదాలలోను అవే అక్షరాలు వాడిన తీరు ప్రత్యేక అందానిచ్చింది.