తేనెసోనలు(ప-హ) : హవరూపివి (3-427-క.)
3-427-క.
హవరూపివి హవనేతవు
హవభోక్తవు నిఖిలహవఫలాధారుఁడవున్
హవరక్షకుఁడవు నగు నీ
కవితతముగ నుతులొనర్తు మయ్య; ముకుందా!
టీకా:
హవ = హోమము యొక్క; రూపివిన్ = రూపము కలవాడవు; హవ = హోమము యొక్క; నేతవు = నాయకుడవు; హవ = హోమము యొక్క; భోక్తవున్ = స్వీకరించువాడవు; నిఖిల = సమస్తమైన; హవ = హోమముల యొక్క; ఫల = ఫలితములకు; ఆధారుడవున్ = కారణము అయినవాడవు; హవ = హోమముల యొక్క; రక్షకుడవున్ = రక్షించువాడవును; అగు = అయిన; నీకు = నీకు; అవితథముగన్ = సత్యముగా; నుతులు = స్తోత్రములు; ఒనర్తుము = చేయుదుము; అయ్య = తండ్రి; ముకుందా = భగవంతుడా {ముకుందుడు - విష్ణుమూర్తి}.
భావము:
భూమ్యుద్ధరణ చేసిన దేవదేవుని దేవతలు స్తుతిస్తున్నారు. యజ్ఞ స్వరూప మైనవాడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞ భోక్తవు, సర్వ యజ్ఞాల ఫలప్రధాతవు, యజ్ఞ రక్షకుడవు అయిన ఓ ముక్తిప్రధాత! యజ్ఞవరాహమూర్తి! నిన్ను హృదయపూర్వకంగా కొనియాడుతున్నాము.