పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : భీమంబై (8-112-శా.)

8-112-శా.

భీమంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెంజక్రమా శుక్రియన్
హేక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గాక్రోధన గేహమున్ గరటి రక్తస్రావ గాహంబు ని
స్సీమోత్సాహము వీత దాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్.

టీకా:

భీమంబు = భయంకరమైనది; ఐ = అయ్యి; తలన్ = శిరస్సును; త్రుంచి = కత్తిరించి; ప్రాణములన్ = ప్రాణములను; పాపెన్ = తీసెను; చక్రమున్ = విష్ణుచక్రము; ఆశు = వేగవంతమైన; క్రియన్ = విధముగ; హేమక్ష్మాధర = మేరుపర్వతము వంటి {హేమక్ష్మాధరము - హేమ (బంగారు) క్ష్మాధరము (కొండ), మేరుపర్వతము}; దేహమున్ = శరీరముగలదానిని; చకిత = భయపెట్టబడిన; వన్య = అడవి; ఇభ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠముల; సందోహమున్ = సమూహముగలదానిని; కామ = కామము; క్రోధన = క్రోధములకు; గేహమున్ = నివాసమైనదానిని; కరటి = ఏనుగు యొక్క; రక్త = రక్తపు; స్రావ = ధారలయందు; గాహంబున్ = మునిగినదానిని; నిస్సీమ = అంతులేని; ఉత్సాహమున్ = ఉత్సాహముగలదానిని; వీత = పోయిన; దాహమున్ = ఆయాసముగలదానిని; జయ = విజయమనెడి; శ్రీ = సంపద యందు; మోహమున్ = మోహముగలదానిని; గ్రాహమున్ = మొసలిని.

భావము:

రివ్వురివ్వున పోయి, చక్రాయధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరు పర్వతమంత పెద్ద దేహం గలది, అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది, కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచిమరిగినది, అంతులేని ఉత్సాహంతో అలసటలేకుండ పోరాడుచున్నది, గెలుపుని నమ్మకంగా కోరుతున్నది. విష్ణుచక్రం వెళ్ళి అలాంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది.