పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : భాగవతముదెలిసి (1-19-ఆ.)

1-19-ఆ.

భాగవతము దెలిసి లుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు.

టీకా:

భాగవతము = భాగవతమును; తెలిసి = తెలుసుకొని; పలుకుట = పలుకుట; చిత్రంబు = చిత్రమైనది; శూలి = శూలధారి శివుని; కిన్ = కి; ఐనన్ = ఐనప్పటికి; తమ్మి = పద్మము బొడ్డులో; చూలి = పుట్టినవాని; కిన్ = కి; ఐనన్ = ఐనప్పటికి; విబుధ = విశేషమైన జ్ఞానముగల; జనుల = జనుల; వలనన్ = వలన; విన్న = వినిన; అంత = అంత; కన్న = చూసిన; అంత = అంత; తెలియ = తెలిసి; వచ్చిన = వచ్చిన; అంత = అంత; తేట = తెలిసేలా; పఱతు = చేస్తాను.

భావము:

అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్ననో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్ననో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్ల మయ్యేలా చెప్తాను.

     భాగవతాన్ని ఆంధ్రీకరించవలెననే తన నిర్ణయం గురించి బమ్మెర పోతనామాత్యులు వివరిస్తున్న తీరు యిది. తను చేపట్టినది ఎంతో సంక్లిష్టమైన పని యని తెలియజెప్తు, తనకు తెలిసినది తక్కువది కాదు కనుక చక్కగా సాధించగల నని చెప్పటంలో వారి వినయవివేకాల ఉన్నతి అంతర్లీనంగా ప్రస్ఫుట మౌతున్నది.