పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : వాచవి యైన (1-421-ఉ.)

1-421-ఉ.

వావియైన గడ్డిఁ దిని వాహిను లందు జలంబు ద్రావఁగా
నీరణంబు లెవ్వఁ డిటు నిర్దళితంబుగఁ జేసె వాఁడు దా
ఖేరుఁడైన, వాని మణి కీలిత భూషణ యుక్త బాహులన్
వేని త్రుంచివైతు వినువీథికి నేగిన నేల డాఁగినన్.

టీకా:

వాచవి = నోటికి రుచి; ఐన = అయినట్టి; గడ్డిన్ = గడ్డిని; తిని = తిని; వాహినులు = నదులు కాలువలు; అందున్ = అందు; జలంబున్ = నీరు; త్రావఁగా = తాగుచుండగ; నీ = నీయొక్క; చరణంబులు = పాదములను; ఎవ్వఁడు = ఎవడు; ఇటు = ఈ విధముగ; నిర్దళితంబుగన్ = ఖండితముగ; చేసెన్ = చేసెను; వాఁడు = వాడు; తాన్ = తాను; ఖేచరుఁడు = ఆకాశమున తిరుగు వాడు; ఐన = అయినప్పటికిని; వాని = వాని యొక్క; మణి = రత్నములు; కీలిత = చెక్కిన; భూషణ = అలంకారములతో; యుక్త = కూడిన; బాహువులన్ = చేతులను; వే చని = శ్రీఘ్రముగ వెళ్ళి; త్రుంచి = ఖండించి; వైతున్ = వేయుదును; విను = ఆకాశ; వీథి = మార్గము; కిన్ = కు; ఏగినన్ = వెళ్ళిన; నేలన్ = నేలలో; డాఁగినన్ = దాగికొనినను.

భావము:

నోటికి రుచించిన గడ్డి పరకలు తిని, కాలవల్లో నీళ్ళు తాగి బతికే సాధు జీవివైన నీ పాదాలను ఇలా ఎవడు నరికేసాడు. వాడెవడైనా సరే వాడు భూమ్మీద తిరిగే వాడైనా, ఆకాశంలో తిరిగే వాడైనా సరే వాడి చేతులు మణికంకణాదులు అలంకరించుకొనేంత గొప్పవైతే వాటితో సహా నరికి పారేస్తాను. వాడిని వదలను. వాడు నింగికి ఎగిరిపోయినా, నేలలో దూరిపోయినా సరే వదలనే వదలను.

 భూదేవి ధర్మదేవతలు గో వృషభ రూపాలలో ఒక చోట గడ్డి మేస్తున్నాయి. కలికాలం ప్రవేశించటం వల్ల, ఇద్దరు దీనంగా ఉన్నారు. పైగా ధర్మదేవత ఒంటికాలిమీద ఉంది. ఇంతలో కలిపురుషుడు వచ్చి ఇద్దరిని చితక తన్నుతున్నాడు. పరీక్షిత్తు విధివశాత్తు ఇదంతా చూసాడు. కోపంతో కలిని నిగ్రహిస్తు, గో వృషభ రూపులను ఓదారుస్తు, వృషభ రూపునితో ఇలా అంటున్నాడు.