పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : రోలంబేశ్వర (10.1-1462-శా.)

10.1-1462-శా.

రోలంబేశ్వర! నీకు దూత్యము మహారూఢంబు; నీ నేరుపుల్
చాలున్;మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్రాదులన్
లీలంబాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ
మ్మేలాపాసె విభుండు? ధార్మికులు మున్నీచందముల్ మెత్తురే.

టీకా:

రోలంబ = తుమ్మెదల; ఈశ్వర = రాజా; నీవు = నీ; కున్ = కు; దూత్యము = రాయబారము చేయుట; మహా = మిక్కలి; రూఢంబు = అలవాటున్నది; నీ = నీ యొక్క; నేరుపుల్ = చమత్కారములు; చాలున్ = ఇక చాలు; మత్ = మా యొక్క; చరణ = పాదములనెడి; అబ్జముల్ = పద్మములను; విడువుము = వదులు; అస్మత్ = మా యొక్క; నాథ = పెనిమిటి; పుత్ర = కొడుకులు; ఆదులన్ = మున్నగువారిని; లీలన్ = అలక్ష్యముగా; పాసి = విడిచి; పరంబున్ = పరలోక సద్గతిని; డించి = వదలి; తన = అతని; కున్ = కి; లీనత్వమున్ = ఐక్యమును; పొందు = చెందెడి; మమ్మున్ = మమ్ములను; ఏలా = ఎందుకు; పాసెన్ = దూరమయ్యెను; విభుండు = ప్రభువు; ధార్మికులు = ధర్మమున నిష్ఠకలవారు; మున్ను = ఇంతకు పూర్వము; ఈ = ఈ; చందముల్ = విధములను; మెత్తురే = మెచ్చుదురా, మెచ్చరు.

భావము:

ఓ తుమ్మెదలరాయుడా! రాయబారం నడపటంలో నీవు చాల గడసరివేలే. నీ నేర్పులు ఇకచాలు. మా చరణపద్యాలను వదలిపెట్టు. మా భర్త, పుత్రాదులను చులకన తలచి పరిత్యజించి, సద్గతిమాట తలపెట్టక తనతో లీనమై ఉన్న మమ్మల్ని ప్రభువు ఎందుకు విడిచిపెట్టాడు? ఇలాంటి వర్తనలు ధర్మాత్ములు మెచ్చుకుంటారా?

   గోపభామినిలలో ఒకామె గండుతుమ్మెదను దూతగా కల్పించుకొని అన్యాపదేశంగా కృష్ణుని దూతగా వచ్చిన ఉద్ధవునికి ఈవిధంగా బహువిధాల దెప్పుతోంది.