పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : రామ గుణాభిరామ (2-285-ఉ.)

2-285-ఉ.

రా!గుణాభిరామ! దినరాజకులోంబుధిసోమ! తోయద
శ్యా!దశాననప్రబలసైన్యవిరామ! సురారిగోత్రసు
త్రా!సుబాహుబాహుబలర్ప తమఃపటుతీవ్రధామ! ని
ష్కా!కుభృల్లలామ! కఱకంఠసతీనుతనామ! రాఘవా!

టీకా:

రామ = రామ; గుణ = సద్గుణములతో; అభిరామ = ఒప్పువాడ; దినన్ = దినమునకు; రాజ = రాజు (సూర్య); కుల = వంశము అను; అంబుధి = సముద్రమునకు; సోమ = చంద్రుడ; తోయద = మేఘము వలె; శ్యామ = నల్లని రంగు కలవాడ; దశానన = దశకంఠుని {దశానన - దశ (పది) ఆనన (ముఖములు) కలవాడ, రావణుడు, దశకంఠుడు}; ప్రబల = బలమైన; సైన్య = సైన్యమును; విరామ = అంతము చేయువాడ; సురారి = రాక్షసులు అను {సురారులు - దేవతలకు శత్రువులు, రాక్షసులు}; గోత్ర = పర్వతములకు; సుత్రామ = ఇంద్రుని వంటివాడ; సుబాహున్ = సుబాహిని; బాహున్ = చేతుల; బల = బలము వలని; దర్ప = గర్వము అను; తమస్ = చీకటికి; పటు = మిక్కిలి; తీవ్ర = తీవ్రమైన కిరణములు; ధామ = నివాసమైన సూర్యుని వంటి వాడ; నిష్కామ = కోరికలు లేనివాడ; కుభృత్ = రాజులలో; లలామ = తిలకమా, శ్రేష్టుడ; కఱ = నల్లని {కఱకంఠుడు - నల్లని కంఠము కలవాడు, శివుడు}; కంఠ = కంఠము కలవాని, శివుని {కఱకంఠసతి - కఱకంఠుని భార్య, పార్వతి}; సతీ = భార్య చేత, పార్వతి చేత; నుత = స్థుతింపబడు; నామ = పేరు కలవాడ; రాఘవా = రఘు వంశపు వాడ.

భావము:

ఓ శ్రీరామచంద్ర! నీవు కల్యాణగుణసాంద్రుడవు. సూర్యవంశ మనే సముద్రానికి చంద్రుడవు. నీలమేఘశ్యాముడవు. రావణాసురుని భీకర సైన్యాన్ని అంతమొందించిన వాడవు. రాక్షసులనే పర్వతాల పాలిటి వజ్రాయుధధారైన ఇంద్రుడవు. సుబాహుని బాహుబల గర్వం అనే చీకటి పాలిటి తీక్ష్ణకిరణాల సూర్యుడవు. కాంక్షలు లేనివాడవు. అవనీపతులలో అగ్రగణ్యుడవు. పరమశివుని భార్య సతీదేవిచే సర్వదా సన్నుతి చేయబడుతుండే నామం గలవాడవు.