పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : రాజీవసదృశలోచన

7-480-క.

రాజీవసదృశలోచన!
రాజీవభవాదిదేవరాజివినుతవి
బ్రాజితకీర్తిలతావృత
రాజీవభవాండభాండ! ఘుకులతిలకా!

టీకా:

రాజీవసదృశలోచన = శ్రీరామా {రాజీవసదృశలోచనుడు - రాజీవ (తామరల) సదృశ(వంటి) లోచనుడు, కన్నులుగలవాడు, రాముడు}; రాజీవభవాదిదేవరాజివినుత = శ్రీరామా {రాజీవభవాదిదేవరాజివినుతుడు - రాజీవభవ (బ్రహ్మదేవుడు) ఆది (మున్నగు) దేవ (దేవతల) రాజి (సమూహములచే) నుత (స్తుతింపబడినవాడు), రాముడు}; విబ్రాజితకీర్తిలతావృతరాజీవభవాండభాండ = శ్రీరామా {విబ్రాజితకీర్తిలతావృతురాజీవభవాండ భాండుడు - విభ్రాజిత(మిక్కలిమెర యుచున్న) కీర్తి (కీర్తి యనెడి) లతా (తీగలచే) ఆవృత (చుట్టబడిన) రాజీవభవాండ(బ్రహ్మాండము అనెడి) భాండుడు(భాండముగలవాడు), రాముడు}; రఘుకులతిలకా = శ్రీరామా {రఘుకులతిలకుడు - రఘుకుల (రఘువంశమునకు) తిలకుడు (వన్నె తెచ్చినవాడు), రాముడు}.

భావము:

సప్తమ స్కంధాంత స్తోత్రం – శ్రీరామచంద్ర ప్రభు! నీవు కలువల వంటి కన్నులు ఉన్న అందగాడవు. నిన్ను బ్రహ్మదేవుడు మున్నగు సకల దేవతలు సదా స్తుతిస్తు ఉంటారు. నీ కీర్తి సమస్త బ్రహ్మాండాల సమూహం అంతటా వ్యాపించి తళతళలాడుతు ఉంటుంది. నీవు రఘువంశానికి వన్నె తెచ్చిన వాడవయ్యా రామయ్య.