పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : రాజీవపత్రలోచన (1-528-క.)

1-528-క.

రాజీవపత్రలోచన!
రాజేంద్ర కిరీట ఘటిత త్న మరీచి
బ్రాజితపాదాంభోరుహ!
భూనమందార! నిత్యపుణ్యవిచారా!

టీకా:

రాజీవ = తామర; పత్ర = రేకుల వంటి; లోచన = కన్నులు ఉన్న వాడా; రాజ = రాజులలో; ఇంద్ర = శ్రేష్టుల యొక్క – మహా రాజుల యొక్క; కిరీట = కిరీటములలో; ఘటిత = పొదగ బడిన; రత్న = రత్నముల యొక్క; మరీచి = కాంతి చేత; బ్రాజిత = ప్రకాశించుచున్న; పాద = పాదములు అను; అంభోరుహ = పద్మములు కలవా డా; భూ = భూమి పై; జన = జనించిన జీవులకు; మందార = కల్పవృక్షమా {(మందార - కల్పవృక్షము వలె కోరికలు తీర్చు వాడు) / (మంద + ఆర = అజ్ఞాన ఛేధకుడు)}; నిత్య = నిత్యమును; పుణ్య = పుణ్యాత్ముల గురించి; విచారా = ఆలోచించు వాడా – పాలించు వాడా.

భావము:

కలువరేకుల వంటి కన్నులు కల వాడా! మహారాజుల కిరీటాలలోని మణుల కాంతులు ప్రతిఫలిస్తున్న పాదపద్మాలు కల వాడా! భూలోకవాసుల పాలిటి కల్పవృక్షమా! మంచివారిని ఎల్లప్పుడు పాలించు వాడా! నమస్కారము.

 ఇది ప్రథమ స్కంధాంత స్తోత్రం.కళ్ళు కలువరేకులవలె అందంగా ఉన్నాయి అంటే స్వామి చక్కటి అనుగ్రహాల్ని వర్షిస్తుంటావు అని. లోకంలోని మహారాజులు సైతం నీపాదాభివందనాలు చేస్తుంటారు కనుక వారి కిరీటాలలోని మణుల కాంతులు నీ పాదాలపైన నిత్యం పడుతుంటుంది అంటే అంతటి శక్తిసామర్థ్యాలతో మమ్ము పాలిస్తావు అని. భూలోకులకు మందార అంటే ఆ మహారాజులు నుండి జనసమామాన్యం వరకు మేమెవరి మైనా వలసినవి అనుగ్రహిస్తావు అని. ఎప్పుడు పుణ్యాత్ముల క్షేమ సమాచారాలు చూస్తుంటావు అంటే పుణ్యులమైన మమ్ము పాలిస్తుంటావు అని.