పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : హయరింఖాముఖ (1-220-మ.)

1-220-మ.

రింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
జాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
ముం బార్థున కిచ్చువేడ్క నని నాస్త్రాహతిం జాల నొ
చ్చియుఁబోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.

టీకా:

హయ = గుర్రముల; రింఖా = కాలి గిట్టల; ముఖ = చివళ్ళ నుండి లేచు; ధూళి = దుమ్ము వలన; ధూసర = బూడిదవర్ణము; పరిన్యస్త = పైపూత గా ఉన్న; అలక = ముంగురులుతో; ఉపేతము = కూడినది; ఐ = అయి; రయ = వేగమువలన; జాత = పుట్టినట్టి; శ్రమ = శ్రమచేత పట్టిన; తోయ = నీటి / చెమట; బిందు = బిందువులతో; యుతము = కూడినది; ఐ = అయ్యి; రాజిల్లు = ఎర్రనైన; నెఱ = నిండు; మోము = ముఖము; తోన్ = తో; జయమున్ = జయమును; పార్థున = అర్జునున; కున్ = కు; ఇచ్చు = ఇవ్వవలె ననే; వేడ్కన్ = కోరికతో; అనిన్ = యుద్ధములో; నా = నా యొక్క; శస్త్ర = శస్త్రముల; ఆహతిన్ = దెబ్బల వలన; చాలన్ = అధికముగ; నొచ్చియున్ = నొప్పి చెందియు; పోరించు = యుద్ధమును చేయించు; మహానుభావున్ = మహానుభావుని; మది = మనసు; లోన్ = లో; చింతింతున్ = స్మరింతును; అశ్రాంతమున్ = ఎల్లప్పుడూ.

భావము:

గుర్రాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎర్రగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.