పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : హరినామస్తితిసేయు (1-96-మ.)

1-96-మ.

రినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ
రినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీ
మై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్.

టీకా:

హరి = శ్రీహరి; నామ = నామములను; స్తుతిసేయు = స్తుతించు; కావ్యము = రచన; సువర్ణ = మంచిరంగుగల / బంగారు; అంభోజ = తామర పూవులు; హంస = హంసల; ఆవళీ = పంక్తులతో; సు = మంచి; రుచి = ప్రకాశముతో; భ్రాజితము = వెలుగుతున్నది; ఐన = అయినట్టి; మానస = మానస; సరస్ = సరోవరము; స్పూర్తిన్ = తీరుగ; వెలుంగొందు = ప్రకాశించును; శ్రీహరి = శ్రీహరియొక్క; నామ = నామముల; స్తుతి = స్తుతించుట; లేని = లేనట్టి; కావ్యము = రచన; విచిత్ర = విశేషముగ చిత్రింపబడిన; అర్థ = అర్థములు; ఆన్వితంబు = కూడుకొన్నది; అయ్యున్ = అయినప్పటికిని; శ్రీకరమై = శుభకరమై; ఉండదు = ఉండదు; అయోగ్య = యోగ్యముకానిది; దుర్మద = దుర్గంధపూరితమైన; అదత్ = భయంకరమైన; కాకోల = విషపు; గర్త = గుంత; ఆకృతిన్ = రూపము గలదాని వలె.

భావము:

పరాశర పుత్రా వ్యాసా! హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కలహంస పంక్తులతో శోభాయమానమైన మానససరోవరం లా విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినప్పటికి కూడా దుర్గంద భూయిష్ఠమైన కాలవ యొక్క కాకోలవిష పూరిత బురదగుంట లాగ ఉంటుంది. అది శోభాకరం కాదు.