పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తుదమొదళ్ళకు (3-637-సీ.)

3-637-సీ.

తుదమొదళ్ళకుఁ జిక్కి దునిసి పాఱఁగ మోరఁ;
గులశైలములఁ జిమ్ముఁ గొంత దడవు
బ్రహ్మాండభాండంబు గిలి చిల్లులువోవఁ;
గొమ్ములఁ దాటించుఁ గొంతద డవు
లధు లేడును బంకసంకులం బై యింక;
ఖురముల మట్టాడుఁ గొంత దడవు
నుడురాజు సూర్యుఁడు నొక్క మూలకుఁ బోవఁ;
గుఱుచ వాలము ద్రిప్పుఁ గొంత దడవు

3-637.1-తే.

గునియుఁ గుప్పించి లంఘించుఁ గొప్పరించు
నెగయు ధరఁ ద్రవ్వు బొఱియఁగా నేపురేగి
దానవేంద్రుని గుండెలు ల్లడిల్లఁ
బంది మెల్లన రణపరిపంథి యగుచు.

టీకా:

తుద = చివర; మొదళ్ల = మొదలుల; కున్ = కు; చిక్కి = చిక్కుకొని; తునిసి = చినగి; పాఱగన్ = పోవగా; మోరన్ = మెడను; కులశైలములన్ = కులపర్వతములను; చిమ్మున్ = చెదరగొట్టును; కొంత = కొంచము; తడవు = సేపు, కాలము; బ్రహ్మాండ = బ్రహ్మాండము అను; భాండమున్ = కుండను; పగిలి = పగిలిపోయి; చిల్లులు = కన్నములు; పోవన్ = పడునట్లుగ; కొమ్ములన్ = కొమ్ములతో; తాటించు = కొట్టును; కొంత = కొంచెము; తడవు = సేపు; జలధులు = సముద్రములు {జలధి - జలము (నీటి)కి నివాసము వంటిది, సముద్రము}; ఏడున్ = ఏడును (7); పంక = బురద; సంకులమున్ = మయముగ; ఐ = అయిపొయి; ఇంకన్ = ఇంకిపోవునట్లు; ఖురములన్ = గిట్టలతో; మట్టాడున్ = కాలితో గెంటును; కొంత = కొంచము; తడవున్ = సేపు; ఉడురాజు = చంద్రుడు; సూర్యుడున్ = సూర్యుడును; ఒక్క = ఒకే; మూల = మూల; కున్ = కు; పోవన్ = పోవునట్లు; కుఱుచ = పొట్టి; వాలమున్ = తోకను; త్రిప్పున్ = తిప్పును; కొంత = కొంచము; తడవు = సేపు; గునియున్ = తిరుగు; కుప్పించి = గెంతి; లంఘించున్ = దాటును; కొప్పరించున్ = తవ్విపెళ్ళగించును; ఎగయున్ = ఎగురును; ధరన్ = భూమిని; త్రవ్వున్ = తవ్వును; బొఱియగన్ = గుంటపడునట్లు; ఏపురేగి = విజృంభించి; దానవ = రాక్షస; ఇంద్రుని = ప్రభువు యొక్క; గుండెలు = గండెలు; తల్లడిల్లన్ = తల్లడిల్లగ; పంది = వరాహమూర్తి; మెల్లనన్ = మెల్లగా; రణ = యుద్ధమునకు; ప్రతి = ఎదురు, సిద్దపడి; పంథి = వెళ్లువాడు; అగుచున్ = అవుతూ.

భావము:

కొంతసేపు తుదా మొదలూ ఏకమై ముక్కలయ్యేటట్లు కులపర్వతాలను తన ముట్టెతో కూలదోస్తూ, కొంతసేపు బ్రహ్మాండభాండం పగిలి చిల్లులుపడే విధంగా తన కొమ్ములతో చిమ్ముతూ, కొంతసేపు సప్తసముద్రాలు బురదలై ఇంకిపోయే విధంగా తన గిట్టలతో మట్టగిస్తూ, కొంతసేపు చంద్రుడూ సూర్యుడూ ఒకమూలకు తోసుకుపోయేటట్లు తన పొట్టితోకను త్రిప్పుతూ...తిరుగుతూ, కుప్పించి దూకుతూ, దాటుతూ, ఇగిలిస్తూ, ఎగురుతూ, నేలను బొరియలుగా తవ్వుతూ హిరణ్యాక్షుని గుండెలు తల్లడిల్లే విధంగా ఆ వరాహావతారుడు యుద్ధానికి సిద్ధమై....